Begin typing your search above and press return to search.

సినీ నిర్మాతపై క్రిమినల్ కేసు

By:  Tupaki Desk   |   29 Jun 2020 8:10 AM GMT
సినీ నిర్మాతపై క్రిమినల్ కేసు
X
టాలీవుడ్ సినీ నిర్మాతపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్న వార్త కలకలం రేపింది. టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. టాలీవుడ్ సినీ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ పై తాజాగా బంజారాహిల్స్ రోడ్ నంబర్12లో నివాసం ఉంటున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్షలాది రూపాయల అద్దె కట్టుకుండా ముఖం చాటేయడంతో పాటు దౌర్జన్యంగా తాళాలు పగులకొట్టి ఇంట్లోకి చొరబడ్డారంటూ ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బంజారాహిల్స్ కు చెందిన నవ్వాడ శోభారాణి 2018లో మినిస్టర్ క్వార్టర్స్ ఎదురుగా తమ భవనాన్ని నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ కు ఇచ్చామని.. అందులో ఆయన తెలంగాణ ఫిలిం కల్చరల్ సెంటర్ (టీఎఫ్సీసీ) ఏర్పాటు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. నెలకు నాలుగున్నర లక్షల అద్దెకు అంగీకరించారని.. రూ.40 లక్షలు అడ్వాన్స్ గా ఇస్తామని చెప్పి రూ.30 లక్షలే ఇచ్చారని ఆరోపించారు. ఇక అప్పటి నుంచి అద్దె సరిగ్గా ఇవ్వకుండా వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు.

ఇదిలా ఉండగా.. పదిరోజుల క్రితం తాను అద్దె చెల్లించలేనంటూ తాళాలు అప్పగించి వెళ్లిపోయిన ప్రతాని రామకృష్ణ గౌడ్ తన కొడుకు సందీప్ ను ఇంటి మీదకు పంపించి దౌర్జన్యానికి దిగాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది.. తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించడంతోపాటు తనకు ప్రభుత్వంలో పెద్దవాళ్లు పరిచయం ఉన్నారని చంపేస్తామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.