Begin typing your search above and press return to search.

'CSI సనాతన్' గ్లింప్స్: ఈసారి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ తో వస్తోన్న ఆది..!

By:  Tupaki Desk   |   28 Sep 2022 10:35 AM GMT
CSI సనాతన్ గ్లింప్స్: ఈసారి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ తో వస్తోన్న ఆది..!
X
డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే 'క్రేజీ ఫెలో' అనే ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ను రిలీజ్ కు రెడీ చేసిన ఆది.. ఇప్పుడు "CSI సనాతన్'' అనే మరో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం "సీఎస్ఐ సనాతన్". శివ‌శంక‌ర్ దేవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ఐ) ఆఫీస‌ర్ గా ఆది ఒక కొత్త తరహా రోల్ లో కనిపించనున్నాడు. ఫస్ట్ ఎవిడెన్స్ పేరుతో మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ను పరిచయం చేయడంతో ప్రారంభమైన ఈ గ్లిమ్స్.. ఆసక్తికరంగా థ్రిల్లింగ్ గా ఉంది. ఓ హత్య కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన సీఎస్ఐగా ఆది ఇంటెన్స్ మూడ్ లో కనిపించారు. క్రైమ్ సీన్ లో దొరికిన ప్రతి చిన్న అంశాన్నీ రిపోర్టులో చేరుస్తూ నివేదిక తయారు చేస్తున్నారు.

ఎలాంటి నేరాన్నయినా చేధించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్.. తనకు దొరికిన ఆధారాలతో నేరస్థులను ఎలా పట్టుకోబోతున్నాడు అనేది ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. హత్య కేసు విచారణ సాగే క్రమం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుందని అర్థమవుతుంది.

క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో సరికొత్త ఇన్వెస్టిగేటివ్ గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ గా "సీఎస్ఐ సనాతన్" సినిమాని రూపొందించారు. ఆది తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇందులో మిషా నారంగ్ హీరోయిన్ గా నటించగా.. అలీ రెజా - నందిని రాయ్ - తాక‌ర్ పొన్న‌ప్ప - మ‌ధు సూద‌న్ - వసంతి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

అనీష్ సోలోమాన్ సంగీతం సమకూర్చగా.. జి. శేఖ‌ర్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. అజ‌య్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నవంబర్ రెండో వారంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

'సీఎస్ఐ సనాతన్' ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. మరి ఈ చిత్రంతోనైనా ఆది సాయికుమార్ ఆశించిన విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.