Begin typing your search above and press return to search.

గాన‌గంధ‌ర్వుడి విగ్ర‌హానికి ప్రాణం పోసిన అభిమాన శిల్పి

By:  Tupaki Desk   |   8 April 2021 3:30 AM GMT
గాన‌గంధ‌ర్వుడి విగ్ర‌హానికి ప్రాణం పోసిన అభిమాన శిల్పి
X
గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25 న స్వర్గలోక విహారియై ఇహ‌లోకాన్ని వీడిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణంతో సంగీత ప్ర‌పంచం నివ్వె‌ర‌పోయింది. మ‌హ‌మ్మారీ క‌రోనాకి చికిత్స పొందుతూ ఆయ‌న మ‌ర‌ణించ‌డం అభిమానుల్ని క‌ల‌చివేసింది. బాలు సుదీర్ఘ అనారోగ్యంతో సుదీర్ఘ పోరాటం తర్వాత తుది శ్వాస విడిచారు.

అయితే ఆయ‌న మ‌ర‌ణానికి ముందే తన చివరి పుట్టినరోజు సందర్భంగా తన కోసం ఒక విగ్రహాన్ని నిర్మించాలని కోరినట్లు సమాచారం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జూన్ లో తన 74 వ పుట్టినరోజు జరుపుకున్నారు. రాజ్‌కుమార్ అనే శిల్పిని తన విగ్రహాన్ని తయారు చేయమని కోరారు.

తాజా స‌మాచారం మేర‌కు .. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదట శిల్పికి తన తల్లిదండ్రుల విగ్రహాన్ని తయారు చేయమని చెప్పారు. కానీ కొద్ది రోజుల తరువాత త‌న‌ విగ్రహాన్ని తయారు చేయమని కోరారు.

కరోనా ఉధృతి కారణంగా ఫోటోషూట్ కోసం వెళ్ళడం సాధ్యం కానందున బాలు శిల్పికి ఫోటోలను పంపారు. ప్రస్తుతం విగ్రహం పూర్తయింది. శిల్పి రాజ్ కుమార్ త‌న‌ పనిని పూర్తి చేశార‌ట‌. ఆయ‌న చేతిలో రూపొందిన విగ్ర‌హంపై ఇంత‌కుముందే మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఇప్ప‌టికి సంపూర్ణంగా విగ్ర‌హం సిద్ధ‌మైంద‌ని తెలిసింది. శిల్పి రాజ్ కుమార్ వ‌డ‌యార్ తూర్పు గోదావ‌రి కొత్త పేట మండ‌లం కొత్త పేట గ్రామ‌వాసి.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు- తమిళం- మలయాళం- హిందీ ఇతర భాషలలో 40 వేల పాటలను పాడారు. కరోనావైరస్ చికిత్స కోసం ఆగస్టు 5 న ఆసుపత్రిలో చేరారు. ఆయ‌న‌ కరోనాను ఓడించినప్పటికీ 50 రోజులకు పైగా చికిత్స పొందాల్సి వ‌చ్చింది. కానీ దురదృష్టవశాత్తు సెప్టెంబర్ 25 న మధ్యాహ్నం 1 గంటకు కన్నుమూశారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అతని మరణాన్ని ముందే ఊహించార‌ని అందుకే విగ్ర‌హాన్ని కోరార‌న్న భావ‌న అభిమానుల్లో నెల‌కొంది. ఇక ఇప్ప‌టికే పుదుచ్చేరిలోని ఒక బేక‌రీ అభిమాని ఎస్పీబాలు చాక్లెట్ విగ్ర‌హాన్ని రూపొందించి నివాళి ఇచ్చిన సంగ‌తి తెలిసిన‌దే.