Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : కస్టడీ

By:  Tupaki Desk   |   12 May 2023 12:07 PM GMT
మూవీ రివ్యూ : కస్టడీ
X
'కస్టడీ' మూవీ రివ్యూ
నటీనటులు: నాగచైతన్య-కృతి శెట్టి-అరవింద్ స్వామి-శరత్ కుమార్-ప్రియమణి-సంపత్-వెన్నెల కిషోర్-గోపరాజు రమణ-జయప్రకాష్-రాంకీ తదితరులు
సంగీతం: ఇళయరాజా-యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం: ఎస్.ఆర్.కదీర్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వెంకట్ ప్రభు

మంచి హిట్టు కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న యువ కథానాయకుడు నాగచైతన్య.. తమిళ విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి చేసిన సినిమా 'కస్టడీ'. ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:

శివ (నాగచైతన్య) 90వ దశకంలో గోదావరి ప్రాంతంలోని సకినేనిపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్. తాను ప్రేమించిన రేవతి (కృతి శెట్టి)ని బలవంతంగా మరో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తుండటంతో తనను ఎలా సొంతం చేసుకోవాలో తెలియక అయోమయంలో ఉన్న అతడికి రాజు (అరవింద్ స్వామి) అనే పెద్ద రౌడీ కారణంగా మరో తలనొప్పి మొదలవుతుంది. సీఎం స్థాయిలో రాజును టార్గెట్ చేయడంతో అతణ్ని కాపాడి.. బెంగళూరులోని సీబీఐ కోర్టులో హాజరు పరచాల్సిన బాధ్యత శివ మీద పడుతుంది. మరి శివ ఆ బాధ్యతను ఎలా నెరవేర్చాడు.. ఈ క్రమంలో రేవతి సమస్యను ఎలా పరిష్కరించి ఆమెను తన సొంతం చేసుకున్నాడు అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:

తమిళంలో వెంకట్ ప్రభు అంటే ఒక బ్రాండ్. తెలుగులోకి కూడా అనువాదమైన 'సరోజ'.. 'గ్యాంబ్లర్'.. లాంటి సినిమాలు చూస్తే ఆయన మార్కు స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కువ థ్రిల్లర్ కథాంశాలను ఎంచుకుని.. ఓవైపు ఉత్కంఠ రేపుతూనే.. ఇంకోవైపు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం వెంకట్ ప్రభు శైలి. దర్శకుడిగా పరిచయం అయి దశాబ్దంన్నర దాటినా.. ఇంకా తనలో చేవ తగ్గలేదని ఈ మధ్యే 'మానాడు' సినిమాతో రుజువు చేశాడు వెంకట్. అది ఒక విదేశీ చిత్రం స్ఫూర్తితో తెరకెక్కినప్పటికీ.. ఇక్కడి నేటివిటీతో అతను ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తూ వినోదాన్ని పంచిన విధానం హైలైట్. ఇలాంటి ట్రాక్ రికార్డున్న దర్శకుడు.. మన నాగచైతన్యతో ఒక థ్రిల్లర్ సినిమా తీశాడంటే అది ఆషామాషీగా ఉండదనే అనుకుంటాం. కానీ ఇన్నేళ్ల కెరీర్లో ఫ్లాప్ సినిమాల్లో కూడా తన మార్కు అంటూ చూపించిన వెంకట్ ప్రభు.. 'కస్టడీ'లో మాత్రం గాడి తప్పేశాడు. 'నాయట్టు' లాంటి కల్ట్ మూవీ స్ఫూర్తితో 'కస్టడీ' కథ రాసుకున్నట్లు చెప్పిన వెంకట్.. అందులోని బిగిని.. ఇంటెన్సిటీని ఇందులో ఎంతమాత్రం చూపించలేకపోయాడు. మూడు రోజుల వ్యవధిలో జరిగే కథ.. ఒక క్రిమినల్ ను కాపాడే కానిస్టేబుల్.. 'కస్టడీ' గురించి ఈ మాటలు విని.. రియలిస్టిగ్గా సాగే ఇంటెన్స్ థ్రిల్లర్ సినిమాను ఆశిస్తాం కానీ.. ఇదొక సగటు కమర్షియల్ సినిమాలా సాగడం అతి పెద్ద నిరాశ.

'కస్టడీ'లో ఆశ్చర్యపరిచే విషయం.. చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న ఆర్టిస్టులను తీసుకోవడం. అరవింద్ స్వామి.. శరత్ కుమార్.. సంపత్.. ప్రియమణి.. జీవా.. ఆనంది.. రాంకీ.. జయసుధ.. జయప్రకాష్.. ఇలా చాలామంది పెద్ద ఆర్టిస్టులను సినిమాలో చూస్తాం. కానీ ఇంతమందిలో ఒక్కరంటే ఒక్కరికి కూడా చెప్పుకోదగ్గ పాత్ర లేకపోవడం మైనస్. కనీసం హీరో పాత్రనైనా వెంకట్ ప్రభు ఆసక్తికరంగా తీర్చిదిద్దాడా అంటే అదీ లేదు. వెంకట్ ప్రభు సినిమాలో హీరో కానిస్టేబుల్ అంటే.. అది రియలిస్టిగ్గా సాగుతూ.. హీరో పాత్ర కథలో ఇమిడిపోయి ఉంటుందని.. సగటు కమర్షియల్ సినిమాల్లో మాదిరి లేని పోని ఎలివేషన్లు ఉండవని.. కథ ముందుకు సాగేకొద్దీ దాంతో ట్రావెల్ చేస్తామని అనుకుంటాం. కానీ ఈ పాత్ర ఆరంభంలో అలాంటి ఆశలే రేకెత్తించినా.. ముందుకు సాగేకొద్దీ రొటీన్ హీరో క్యారెక్టర్లాగే మారిపోతుంది. ఎప్పుడూ చూసే ఫైట్లు.. ఎలివేషన్లు తప్ప పాత్రలో ఏ ప్రత్యేకతా కనిపించదు. విపత్కర పరిస్థితుల మధ్య హీరో.. విలన్.. హీరోయిన్ కలిసి ప్రయాణం సాగించే నేపథ్యంలో సినిమా నడుస్తున్నపుడు.. ఆ మూడు ప్రధాన పాత్రలతో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడటం.. వాటితో పాటు ప్రేక్షకులు ట్రావెల్ చేయడం కీలకం. కానీ వీటిలో ఏ పాత్రనూ భిన్నంగా తీర్చిదిద్దకపోవడంతో అవి సాదాసీదాగా అనిపిస్తాయి. కథానాయికకు కథలో ప్రాధాన్యం ఉన్నా సరే.. తన పాత్ర కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. ఈ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలన్నీ రిపీటెడ్ గా అనిపించడంతో ఒక దశ దాటాక విసుగు పుడుతుంది.

ఒక సాధారణ కానిస్టేబుల్.. సీఎం స్థాయి వ్యక్తి ఇరుక్కున్న కేసులో ప్రధాన ఆధారం అయిన నేరస్థుడిని.. మొత్తం వ్యవస్థకు ఎదురు నిలబడి.. రాజమండ్రి దగ్గర్లోని ఒక ఊరి నుంచి బెంగళూరు వరకు తీసుకెళ్లడం 'కస్టడీ'లో ప్లాట్ పాయింట్. ఈ లైన్ వినడానికి ఆసక్తికరంగానే అనిపిస్తుంది. దీనికి వెంకట్ ప్రభు మార్కు స్క్రీన్ ప్లే తోడైతే ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేవాళ్లే. కానీ వెంకట్ తన శైలి విడిచిపెట్టి సగటు కమర్షియల్ డైరెక్టర్ల స్టైల్ ఫాలో అయిపోయాడు. ఈ రోజుల్లో అయితే అందుబాటులో ఉన్న టెక్నాలజీతో నిమిషాల్లో హీరోని పోలీసులు పట్టేసుకుంటారు కాబట్టి.. ఈ కథను 90వ దశకం నేపథ్యంతో నరేట్ చేశాడు దర్శకుడు. ఆ నేపథ్యం తీసుకున్నా సరే.. వందల మంది పోలీసులు.. రౌడీలు తరుముతుంటే.. వాళ్లందరినీ తప్పించుకుని ఒక పేరుమోసిన నేరస్థుడిని.. హీరోయిన్ని వెంటబెట్టుకుని హీరో ముందుకు సాగడం అన్నది తేలిక కాదు. ఈ విషయంలో వెంకట్ ప్రభు ఇంటలిజెంట్ ఐడియాలతో హీరో జర్నీని ముందుకు నడిపిస్తాడని అనుకుంటే.. విపరీతమైన సినిమాటిక్ లిబర్టీ తీసుకుని సాదాసీదాగా సన్నివేశాలను లాగించేశాడు.

ప్రతి పావుగంటకి ఒకసారి పోలీసులు.. రౌడీలు కలిసి వీరిని ఎటాక్ చేయడం.. ఏదో విన్యాసాలు చేసి హీరో తప్పించుకోవడం.. మళ్లీ ఎటాక్.. మళ్లీ ఎస్కేప్.. ఇలా ఒక ఫార్మాట్లో సాగిపోతుంది 'కస్టడీ'. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ఎంగేజ్ చేసినా.. ఓవరాల్ ఇంప్రెషన్ మాత్రం ఏమంత గొప్పగా ఉండదు. హీరో తొలిసారి విలన్ తో కలిసి పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యే ఎపిసోడ్ ఆసక్తికరంగా తీర్చిదిద్దినప్పటికీ.. ఇది సహా ఏ ఎస్కేప్ ఎపిసోడ్ కూడా రియలిస్టిగ్గా అనిపించవు. ఇక విలన్ పాత్రకు.. హీరో ఫ్లాష్ బ్యాక్ కు ముడిపెడుతూ ఒక సెంటిమెంట్ స్టోరీ నడిపించగా.. అది కూడా రొటీనే అనిపిస్తుంది. ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ లు తెలుగు సినిమాల్లో కుప్పలు కుప్పలుగా చూశాం. ఇక హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ అయినా బాగుందా అంటే అదీ లేదు. ఈ ట్రాక్ వల్లే సినిమా ఆరంభంలో మరీ బోరింగ్ గా అనిపిస్తుంది. అరవింద్ స్వామి పాత్ర ప్రవేశంతోనే కథ కొంచెం ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ ముందు కథలో తీవ్రత పెరిగి ఆసక్తి రేకెత్తినా.. ద్వితీయార్ధం ప్రేక్షకుల అంచనాలకు తప్పకుండా రొటీన్ గా సాగిపోవడంతో నిరాశ తప్పదు. వెంకట్ ప్రభు ఎంచుకున్న కథేమో.. రియలిస్టిక్ టచ్ ఉన్నది. కానీ దాన్ని నరేట్ చేసింది మాత్రం కమర్షియల్ సినిమాల స్టయిల్లో. దీంతో 'కస్టడీ' ఎటూ కాకుండా తయారైంది.


నటీనటులు:

నాగచైతన్య నిబద్ధత కలిసి కానిస్టేబుల్ పాత్రను పండించడానికి బాగానే కష్టపడ్డాడు. పాత్రకు అవసరమైన ఇంటెన్సిటీ చూపించాడు. తన అన్నయ్య ప్రాణాలు పోయే సన్నివేశంలో అతడి నటన ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాల్లో మాత్రం చైతూ నిస్సహాయంగా కనిపించాడు. కృతి శెట్టికి పెర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్రే దక్కింది. 'వారియర్'.. 'బంగార్రాజు' లాంటి సినిమాలతో పోలిస్తే తన పాత్ర.. నటన ఇందులో మెరుగే. అరవింద్ స్వామి చేసిన రాజు పాత్ర.. ఆయన స్థాయికి తగ్గది కాదు. ఆరంభంలో ఆ క్యారెక్టర్ని ఏదో ఊహించుకుంటాం కానీ.. చివరికి అది రొటీన్ గా ముగుస్తుంది. శరత్ కుమార్ పాత్రలో కూడా బిల్డప్ ఎక్కువ.. విషయం తక్కువ. రాంకీ చేసిన అతిథి పాత్ర.. దానికి ఇచ్చిన ట్విస్ట్ వెటకారంగా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి పాత్రలో ప్రియమణి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కానీ తన పాత్రలో బలం లేదు. వెన్నెల కిషోర్ కాస్త నవ్వించాడు. సంపత్.. జయప్రకాష్.. గోపరాజు రమణ.. వీళ్లంతా తమ పరిధిలో బాగానే నటించారు.


సాంకేతిక వర్గం:

ఇళయరాజా-యువన్ శంకర్ రాజాల అరుదైన కలయిక చూసి సంగీత పరంగా ఎంతో ఊహించుకుంటాం కానీ.. పాటలు భరించలేని స్థాయిలో ఉన్నాయి. ఒక్క పాట కూడా మినిమం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. నేపథ్య సంగీతం పర్వాలేదు. కదీర్ ఛాయాగ్రహణం ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ ఆశించినంత గొప్పగా లేవు. కొన్ని సన్నివేశాల్లో భారీతనం ఉన్నా.. ఓవరాల్ గా సినిమాలో అంత క్వాలిటీ కనిపించలేదు. అబ్బూరి రవి మాటలు సోసోగా అనిపిస్తాయి. సినిమాకు సంబంధించి లోపమంతా వెంకట్ ప్రభు స్క్రిప్టులోనే ఉంది. కథ లైన్ బాగున్నా.. అది పూర్తి స్క్రిప్టుగా మారే క్రమంలో బిగి.. ఉత్కంఠ లోపించాయి. సినిమా మొత్తంలో చూసుకుంటే ఎగ్జైటింగ్ గా అనిపించే ఎపిసోడ్ ఏదీ లేదు. టేకింగ్ లోనూ వెంకట్ ప్రభు తన మార్కును చూపించలేకపోయాడు.

చివరగా: కస్టడీ.. నో థ్రిల్.. నో ఎంటర్టైన్మెంట్

రేటింగ్-2.25/5


Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater