Begin typing your search above and press return to search.

నకిలీ డైరెక్ట‌ర్ వేధింపుల‌పై న‌టి సైబ‌ర్ క్రైమ్ కి ఫిర్యాదు

By:  Tupaki Desk   |   31 Aug 2021 4:24 AM GMT
నకిలీ డైరెక్ట‌ర్ వేధింపుల‌పై న‌టి సైబ‌ర్ క్రైమ్ కి ఫిర్యాదు
X
ఫిల్మిండ‌స్ట్రీస్ లో న‌టీమ‌ణుల ట్రాప్ గురించి నిరంత‌రం ఏదో ఒక క‌థ‌నం షాకిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ నటి పాయెల్ సర్కార్ తానను అవ‌కాశాల పేరుతో ట్రాప్ చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. తనకు ఫిల్మ్ మేకర్ రవి కినాగి అని చెప్పుకునే ఫేస్‌బుక్ యూజర్ నుండి అసభ్యకరమైన మెసేజ్ రావడంతో షాక్ కు గురయ్యారు. నకిలీ ప్రొఫైల్ వెనుక అజ్ఞాత యూజర్ తనకు క‌థానాయిక‌గా అవకాశం ఇప్పిస్తానని ఆశ చూపించాడు. నిజానికి ఈ కేసులో ఇప్పటికే పాయెల్ కోల్ కతా పోలీసు సైబర్ సెల్ కు ఫిర్యాదు చేశారు.

గత శనివారం రవి కినాగి ఫేస్‌బుక్ ప్రొఫైల్ నుండి తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందని పాయెల్ పేర్కొంది. రవి టాలీవుడ్ లో ప్రసిద్ధ దర్శకుడు కాబట్టి `అన్నదాత`- ఛాంపియన్ -ఐ లవ్ యు-లవ్ స్టోరీ వంటి కొన్ని హిట్ కమర్షియల్ సినిమాల్ని తీసాన‌ని తెలిపార‌ట‌.

అందువ‌ల్ల పాయల్ ఫ్రెండ్షిప్ రెక్వ‌స్ట్ ని అంగీకరించడానికి వెనుకాడలేదు. చాలా మంది ప్రశంసలు పొందిన దర్శకులు ఆమెకు సినిమాలు సీరియల్స్ లో ఆసక్తికరమైన పాత్రలను అందిస్తూ సోష‌ల్ మీడియా సందేశాలు ఇస్తూనే ఉన్నారని పాయెల్ చెప్పారు. మెసెంజర్ లోని సంభాషణ అధికారికంగా మొద‌లు పెట్టాను. కానీ ఆఫర్ కావాలంటే రాజీపడగలరా? అని స‌ద‌రు యూజ‌ర్ అడిగార‌ట‌. అలాంటి అసభ్యకరమైన సందేశాన్ని చూసి తాను చలించిపోయాన‌ని తెలిపారు.

పాయల్ ఆ తర్వాత సంభాషణను కొనసాగించలేదు. అటువంటి మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ లో సంభాషణ కు సంబంధించిన‌ స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. వెంటనే స‌ద‌రు నటి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

``అలాంటి ఆఫర్ అందుకున్నందుకు నేను పెద్ద‌ షాక్ కి గుర‌య్యాను. నేను సినిమా లేదా టీవీ పాత్రలకు సంబంధించి చాలా మంది దర్శకులతో మాట్లాడాను కానీ ఇది నాకు గతంలో జరగలేదు. నేను అలాంటి మోసాల గురించి విన్నాను. కానీ నేను దానిని ఒక రోజు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ నకిలీల భారిన ప‌డుతున్న వారికి న్యాయం జరగాలి. లేకపోతే చాలా మంది నటీమణులు దీనిని ఎదుర్కొంటారు. దీనిని నిలిపివేయాలి. పరిశ్రమను దుర్వినియోగం చేస్తున్న అలాంటి దుర్మార్గులను గుర్తించి కటకటాల వెనక్కి నెట్టాలి`` అని సీరియ‌స్ గా వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని కొంత పురోగతి ఉందని పాయల్ చెప్పారు. ఫేస్ బుక్ ప్రొఫైల్ ఇప్పటికే డీయాక్టివేట్ చేసారు. కానీ సైబర్ క్రైమ్ విభాగం ప్రొఫైల్ ని ట్రేస్ చేసింది. చిరునామాను కనుగొనడానికి ప్రస్తుతం శోధన కొనసాగుతోంది. ఆ వ్యక్తిని త్వరలో గుర్తిస్తామని నాకు హామీ ఇచ్చారని తెలిపారు. ఇటీవల యాసిడ్ దాడి బాధితులపై `పెయిన్` అనే డాక్యుమెంట్ ఫీచర్ లో నటించిన పాయల్ సమాజంలోని చెడు కోణాన్ని ఇందులో ఎలివేల్ చేస్తూ.. ప్రతి ఒక్కరినీ ముఖ్యంగా ఔత్సాహిక నటీమణులు .. మోడల్స్ అలాంటి మోసాల నుండి దూరంగా ఉండాలని కోరారు.

ఈ త‌ర‌హా వేధింపులు ఇంత‌కుముందు టాలీవుడ్ లో ప‌లువురు న‌టీమ‌ణులు యాంక‌ర్ల‌కు ఎదుర‌య్యాయి. దానిపై సైబ‌ర్ క్రైమ్ కి ఫిర్యాదులు అందాయి. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి న‌కిలీ కాస్టింగ్ ఏజెంట్లు.. ఫిలింమేక‌ర్స్ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని న‌టీన‌టులను సైబ‌ర్ క్రైమ్ హెచ్చ‌రిస్తూనే ఉంది. కానీ ఇంకా ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉన్నాయి.