Begin typing your search above and press return to search.

తాత విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో మ‌న‌వ‌డు ధూంధాం

By:  Tupaki Desk   |   7 Jun 2019 6:29 AM GMT
తాత విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో మ‌న‌వ‌డు ధూంధాం
X
మూవీ మొఘ‌ల్ .. టాలీవుడ్ లెజెండ‌రీ నిర్మాత కీ.శే.డా.డి.రామానాయుడు విగ్ర‌హాన్ని హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ ప‌రిస‌రాల్లో ఆవిష్క‌రించిన‌ సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలంతా ఈ ఆవిష్క‌ర‌ణ‌లో పాల్గొన్నారు. ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్ ర‌మేష్ ప్ర‌సాద్- ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు- బి.గోపాల్- ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌- కైకాల స‌త్య‌నారాయ‌ణ‌- నిర్మాత అశోక్ -జి.ఆది శేష‌గిరిరావు- కోట శ్రీ‌నివ‌సారావు- గిరిబాబు- విజ‌య్ చంద‌ర్-ర‌ఘు రామ‌రాజు- కె.ఎల్.నారాయ‌ణ‌- శివ‌కృష్ణ‌- ముత్యాల రామ‌దాసు- మోహ‌న్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో వెట‌ర‌న్ నిర్మాత‌ ఆది శేష‌గిరిరావు మాట్లాడు.. ``నాయుడు గారు మ‌ద్రాస్ ప‌రిశ్ర‌మ‌లోనే పెద్ద నిర్మాత‌. హైద‌రాబాద్ వ‌చ్చాక ఫిలింఛాంబ‌ర్ - ఎఫ్ ఎన్ సీసీ అభివృద్ధికి ఆయ‌న‌ కృషి చేశారు. రామానాయుడు పేరుతో ఛాంబ‌ర్ వ‌ద్ద‌ క‌ళామండ‌పాన్ని నిర్మించారు. ఫిలిం ఇండ‌స్ట్రీ అభివృద్ధిలో ఆయ‌న‌ భాగ‌స్వామి. ఆయ‌న అందుకోని ప‌ద‌వులూ లేవు. అలాగే రాజ‌కీయాల్లోనూ ఆయ‌న తొలి ప్ర‌య‌త్న‌మే ఎంపీ అయ్యి ఎంతో సేవ చేశారు. సినీప‌రిశ్ర‌మ‌లో ఏ స‌మ‌స్య వ‌చ్చినా నిర్మాత స‌మ‌స్య గురించి ఆయ‌న మాట్లాడేవారు. ఆర్టిస్టులు- క‌ళాకారుల్ని- సాంకేతిక నిపుణుల్ని ప‌రిచ‌యం చేశారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా నిర్మాత వెంటే ఉండేవారు. స్టూడియోస్.. పంపిణీ.. ఎగ్జిబిష‌న్ .. ఏ విభాగంలో స‌మ‌స్య వ‌చ్చినా ఆయ‌న ముందుండి ప‌రిష్క‌రించేవారు.. ఆయ‌న వారసుడు డి.సురేష్ బాబు ఆ ప్ర‌వృత్తిని కొన‌సాగించ‌డం ప్ర‌శంస‌నీయం`` అన్నారు. సురేష్ బాబు- వెంక‌టేష్ -రానా అంద‌రూ ప‌రిశ్ర‌మ‌కే అంకిత‌మై ప‌ని చేస్తున్నారని ప‌రుచూరి ప్ర‌శంసించారు. రామానాయుడు గారు స‌రిలేరు నీకెవ్వ‌రు అంటూ అల్లు అర‌వింద్ ప్ర‌శంసించారు.

ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్ ర‌మేష్ ప్ర‌సాద్ మాట్లాడుతూ-``60 ఏళ్లు పైగానే ప‌రిశ్ర‌మను హైద‌రాబాద్ లో బ‌లంగా వేళ్లూనుకుంది. రామానాయుడు గారు ఎంతో కృషి చేశారు. ఆయ‌న వార‌సుడిగా డి.సురేష్ బాబు ఎంతో కృషి చేస్తున్నారు. సురేష్ బాబు ఎంద‌రికో లైఫ్ ని ఇచ్చారు. బొంబాయ్ వెళ్లా.. హాలీవుడ్ వెళ్లా. కానీ అన్నిటినీ ఒకే చోట చేర్చి తీసిన నిర్మాత రామానాయుడు మాత్ర‌మే. ఆయ‌న కుటుంబం సినిమాకే అంకిత‌మై సేవ చేస్తున్నారు`` అని అన్నారు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో తాత విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేస్తూ నాయుడు గారి మ‌న‌వ‌డు అభిరామ్ క‌నిపించారు. ఆ క్ర‌మంలోనే ఇక తాత లెగ‌సీని ముందుకు తీసుకెళ్లే ఆలోచ‌న మ‌న‌వ‌డికి ఉంద‌నే ఆస‌క్తిక‌ర చ‌ర్చా ఈ వేదిక వ‌ద్ద సాగింది. అయితే అభిరామ్ హీరో అవుతారా? నిర్మాత అవుతారా? అన్న‌దానిపై ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన క్లారిటీ లేదు. దీనిపై ద‌గ్గుబాటి ఫ్యామిలీ క్లారిటీ నిస్తుందేమో వేచి చూడాలి.