Begin typing your search above and press return to search.

దాసరి సూచనలు తీసిపడేస్తున్నారు

By:  Tupaki Desk   |   15 Oct 2015 8:53 AM GMT
దాసరి సూచనలు తీసిపడేస్తున్నారు
X
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ర్టీలా పెద్ద తలకాయలా ఒక వెలుగు వెలిగిన దర్శకనిర్మాత దాసరి నారాయణరావు ఇప్పుడు ఏం మాట్లాడినా దానికి మద్దతు పలికేవారే కరవవతున్నారు. తాజాగా ఆయన పెద్ద సినిమా హీరోల సినిమాల మధ్య కనీసం రెండు వారల గ్యాప్ ఉంటే బాగుంటుందని సూచన చేయగా నిర్మాత సురేశ్ బాబు ఆ మాటలను కొట్టిపారేశారు. రుద్రమదేవి - బ్రూస్ లీ సినిమాల నేపథ్యంలో దాసరి ఈ వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల థియేటర్ల కొరత ఏర్పడుతుందన్న ఉద్దేశంలో ఆయన మాట్లాడగా సురేశ్ బాబు కొట్టిపారేశారు.

మంచి సినిమాలకు ఎప్పుడూ థియేటర్లు దొరక్కపోవడమన్న సమస్యే లేదని.. ఉయ్యాల జంపాల, భలేభలేమగాడివోయ్ వంటి సినిమాలకు థియేటర్లు దొరకలేదా... అవి ఆడలేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లను కలిగి ఉన్న సురేశ్ బాబు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దాసరి ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదన సినీ పరిశ్రమలో ఉంది. దీంతోనే సురేశ్ బాబు కాస్త హార్డ్ గానే స్పందించారు. ఎన్ని థియేటర్లలో ఆడిస్తామన్నది ముఖ్యం కాదని... సినిమా ఎంత బాగుందన్నదే ప్రధానమని.. సినిమాలు బాగుంటే జనం వస్తారని అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు చెందిన సూర్య సినిమేక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభానికి హాజరైన సురేశ్ బాబు దాసరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దాసరి వ్యాఖ్యలపై రాంచరణ్ కూడా కాస్త తీవ్రంగానే ఎదురుదాడి చేశారు. అయితే... నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వ్యంగ్య బాణాలు వేశారు. ఆయన మాటలు వినడానికి మాత్రమే బాగుంటాయని అనేశారు రాంచరణ్. దీంతో కొత్త తరం కూడా దాసరిపై ఎదురుదాడి చేస్తుండడంతో తెలుగు ఇండస్ర్టీలో ఆయన పనైపోయిందని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.