Begin typing your search above and press return to search.

వద్దు వద్దన్నా.. ‘జేమ్స్ బాండ్’ మళ్లీ అతడే

By:  Tupaki Desk   |   25 July 2017 5:28 PM IST
వద్దు వద్దన్నా.. ‘జేమ్స్ బాండ్’ మళ్లీ అతడే
X
ప్రపంచంలో అత్యంత విజయవంతమైన మూవీ ఫ్రాంఛైజ్ ఏదంటే మరో మాట లేకుండా ‘జేమ్స్ బాండ్’ సిరీస్ అని చెప్పేయొచ్చు. ఇప్పటిదాకా ఏకంగా 24 సినిమాలు వచ్చాయి ఆ సిరీస్‌లో. 13 మంది నటులు జేమ్స్ బాండ్ పాత్రలు పోషించారు. ఒకే పాత్రతో ఇన్ని సినిమాలు రావడమంటే మామూలు విషయం కాదు. దీన్ని బట్టే ఇది ఎంత విజయవంతమైన పాత్రో.. ఈ సిరీస్ ఎంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తోందో అర్థం చేసుకోవచ్చు.

చివరగా ‘జేమ్స్ బాండ్’ సిరీస్‌ లో భాగంగా రెండేళ్ల కిందట ‘స్పెక్టర్’ వచ్చింది. ఆ సినిమా కూడా మంచి వసూళ్లే రాబట్టింది. ఐతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాండ్ హీరో డేనియల్ క్రెయిగ్ మాట్లాడుతూ.. ఇక జన్మలో మళ్లీ జేమ్స్ బాండ్ పాత్ర చేయనన్నాడు. బాండ్ సినిమాల్లో నటించడం అంటే నరకం అని.. ఆ కష్టం ఇక తాను పడలేనని.. ఎన్ని వందల కోట్లిచ్చినా ఇక ఈ సిరీస్ లో నటించనని తెగేసి చెప్పాడు.

క్రెయిగ్ అంతగా వ్యతిరేకత చూపిస్తున్నాడంటే.. జేమ్స్ బాండ్ మేకర్స్ కొత్త హీరోను చూసుకోవాల్సిందే అనుకున్నారంతా. కానీ క్రెయిగ్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నాడు. బాండ్ సిరీస్ లో భాగంగా కొత్త సినిమా గురించి నిర్మాణ సంస్థ ప్రకటించింది. సినిమా టైటిల్.. దర్శకుడు.. కథాంశం గురించి చెప్పలేదు కానీ.. 2019 నవంబరు 8న ‘జేమ్స్ బాండ్’ సిరీస్ లో 25వ సినిమా విడుదలవుతుందని ప్రకటించింది. ఇందులో హీరో డేనియల్ క్రెయిగే అని కూడా స్పష్టం చేసింది. బహుశా ఈ ఒక్కసారికి బాండ్ గా నటించి.. ఆ తర్వాత టాటా చెప్పేస్తాడేమో క్రెయిగ్. జేమ్స్ బాండ్ పాత్రలు పోషించిన వాళ్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించుకున్నాడు క్రెయిగ్.