Begin typing your search above and press return to search.

670 కోట్లు ఇస్తామన్నా సినిమా చేయనన్నాడు

By:  Tupaki Desk   |   22 May 2016 1:30 PM GMT
670 కోట్లు ఇస్తామన్నా సినిమా చేయనన్నాడు
X
ప్రపంచంలో ఏ నటుడైనా ఒక సినిమాకు రూ.670 కోట్లు పారితోషకం అందుకుంటాడా..? మరి అంత పారితోషకం ఇచ్చినా ఓ నటుడు తాను సినిమా చేయనని అన్నాడంటే విస్తుపోవాల్సిందే కదా. జేమ్స్ బాండ్ హీరో డేనియల్ క్రెయిగ్ ఇదే పని చేశాడు. జేమ్స్ బాండ్ సిరీస్ కొత్త సినిమాలో నటించేందుకు అంత భారీ స్థాయిలో పారితోషకం ఆఫర్ చేసినా అతను తిరస్కరించడం విశేషం.

దాదాపు దశాబ్దం కిందట ‘క్యాసినో రాయల్’తో మొదలుపెట్టి ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సిరీస్ లో నాలుగు సినిమాలు చేశాడు డేనియల్ క్రెయిగ్. ఈ సినిమాలు చేయడానికి ముందు క్రెయిగ్ కు మరీ గొప్ప గుర్తింపేమీ లేదు. జేమ్స్ బాండ్ అయ్యాక అతడికి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఫాలోయింగ్ వచ్చింది. వందల కోట్ల పారితోషకం అందుకున్నాడు. ఐతే కారణమేంటో కానీ.. ఇకపై తాను జేమ్స్ బాండ్ సినిమాలు చేయనని తెగేసి చెప్పేశాడు క్రెయిగ్. గత ఏడాది ‘స్పెక్టర్’ సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ.. జేమ్స్ బాండ్ సినిమాల్లో నటించడం కన్నా చనిపోవడం మేలని వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచాడు. ఇకపై ఈ సినిమాలు చేయననేశాడు.

కానీ జేమ్స్ బాండ్ సినిమాలు తీసే ఎంజీఎం సంస్థ మాత్రం అతడినే బాండ్ క్యారెక్టర్లో కొనసాగించాలని కోరుకుంటోంది. తర్వాతి సినిమాకు కనీవినీ ఎరుగని స్థాయిలో 99 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.670 కోట్లు) రెమ్యూనరేషన్ కింద ఆఫర్ చేసింది. అయినా డేనియల్ క్రెయిగ్ ఈ సినిమా చేయడానికి ససేమిరా అనేశాడు. మరి ఎంజీఎం సంస్థ అతణ్ని ఒప్పించగలుగుతుందా లేక కొత్త జేమ్స్ బాండ్ ను చూసుకుంటుందా అనేది చూడాలి.