Begin typing your search above and press return to search.

డార్లింగ్స్ ట్రైల‌ర్: కిడ్నాప్ చేసి హింసించే త‌ల్లీకూతుళ్ల‌ క‌థ‌!

By:  Tupaki Desk   |   25 July 2022 9:25 AM GMT
డార్లింగ్స్ ట్రైల‌ర్: కిడ్నాప్ చేసి హింసించే త‌ల్లీకూతుళ్ల‌ క‌థ‌!
X
RRR లాంటి పాన్ ఇండియా సంచ‌ల‌నంతో అలియా భట్ సౌత్ కి ప‌రిచ‌య‌మైంది. ఈ సినిమాతో త‌న ఇమేజ్ ద‌క్షిణాదినా అమాంతం పెరిగింది. ఇలాంటి స‌మ‌యంలో వ‌రుస‌గా త‌ను న‌టించిన రెండు సినిమాలు రిలీజ్ ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. బ్ర‌హ్మాస్త్ర సెప్టెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. ఇంత‌లోనే షారూక్ ఖాన్ నిర్మించిన డార్లింగ్స్ తో ఆలియా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. డార్లింగ్స్ ట్రైల‌ర్ తాజాగా విడుద‌లై ఆక‌ట్టుకుంది.

ఆలియా భ‌ట్- షెఫాలీ షా- విజయ్ వర్మ త‌దిత‌రులు న‌టించిన‌ డార్క్ కామెడీ మూవీ డార్లింగ్స్. బోలెడంత ఫ‌న్.. థ్రిల్స్..సీక్రెట్స్.. గ‌ట్సీ డ్రామాతో ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. 'డార్లింగ్స్' ని గౌరీ ఖాన్- అలియా భట్ -గౌరవ్ వర్మ నిర్మించారు. జస్మీత్ కె రీన్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. డార్లింగ్స్ టీజర్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత ట్రైలర్ పైనా ఆస‌క్తి పెరిగింది. దానికి త‌గ్గ‌ట్టే ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో 2022 ఆగస్టు 5న ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.

నిజ‌మైన ప్రేమ కోసం వెతుకుతూ.. సంఘంలోని రాక్షసులతో పోరాడుతూ.. ముంబైలో కాలు మోపిన తల్లీ కూతుళ్ల జీవితాల్లో ఏం జ‌రిగింది? అనే ఆస‌క్తిక‌ర‌ క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఇందులో ముస్లిమ్ యువ‌తిగా ఆలియా న‌టిస్తోంది.

త‌న‌తో జీవితం పంచుకుంటున్న యువ‌కుడిని మ‌రీ అలా కిడ్నాప్ చేసి చిత్ర‌హింస‌ల‌కు ఎందుకు గురి చేస్తోంది? త‌న‌కు అత‌డు చేసిన అన్యాయం ఏమిటో తెర‌పైనే చూడాలి. ముస్లిమ్ యువ‌తి అయినా మోడ్ర‌న్ యువ‌తి వేష‌ధార‌ణ‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూ ఆలియా పాత్ర‌లో ర‌క‌ర‌కాల షేడ్స్ క్యూరియాసిటీని పెంచాయి.

అలియా భట్ ఈ చిత్రంతో తన సొంత బ్యాన‌ర్ ఎటర్నల్ సన్ షైన్ ని ప్రారంభించింది. ఆలియా మాట్లాడుతూ.. డార్లింగ్స్ నాకు వెరీ స్పెషల్.. నేను స్క్రిప్ట్ చదివిన క్షణం న‌టిగానే కాకుండా పెద్ద‌గా ఇంకేదైనా చేయాల‌నుకున్నాను. ఇలాంటి ప్రత్యేకమైన కథలను ప్రేక్షకులకు అందించడంలో మా అంద‌రి పాత్ర ఉంది. కొంతమంది అద్భుతమైన సహ-నటులు.. భాగస్వామ్య‌ నిర్మాతలు .. ద‌ర్శ‌కుడు జస్మీత్ ల కృషిని గుర్తు చేసుకోవాలి. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ విడుద‌ల‌వుతోంది'' అని తెలిపారు.

రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ సీవోవో గౌరవ్ వర్మ మాట్లాడుతూ-''టీజర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. సంగీతం.. సాంకేతిక నిపుణులు నటీనటులు రచయితలు ఇత‌ర అంశాల‌ పరంగా డార్లింగ్స్ కోసం పరిశ్రమలోని అత్యుత్తమ నిపుణులతో పని చేయడం అద్భుతమైన అనుభవం. అలియా భట్ ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో జస్మీత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీని చేసాం. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని ప్రసారం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది'' అని తెలిపారు.