Begin typing your search above and press return to search.

మీడియాపైనా దాసరి మార్కు చురకలు!

By:  Tupaki Desk   |   18 Oct 2016 10:22 AM GMT
మీడియాపైనా దాసరి మార్కు చురకలు!
X
తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడున్న అతిపెద్ద దిక్కు ఆయన... 100 కుపైగా సినిమాలు తీసిన చరిత్ర ఆయన సొంతం... అయినా కూడా ఆయనతోపాటు 100 సినిమాలు తీసినిన డైరెక్టర్లు సైతం గురువుగారు అని సంబోదిస్తారు. అవును... ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి గురువు గారు. ఇది దాసరి నారాయణరావు గురించి చెప్పే అతి చిన్న పరిచయ వాక్యాల్లో ఒకటి. అయితే ఈ మధ్యకాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, సినిమా ఫంక్షన్స్ లోనూ ఆడియో ఫంక్షన్స్ - సక్సెస్ మీట్లలోనూ దాసరి నిత్యం కనిపిస్తూనే ఉంటారు. ఆ సందర్భంగా నేటి తరానికి ఉపయోగపడేవి, రేపటి తరానికి అవసరమయ్యేవీ అయిన నాలుగు మాటలు మాట్లాడతారు. ఈ సమయంలోనే ఒకరిద్దరికి ఆ మాటలు నేరుగా వెళ్లి తగులుతాయి కూడా. అయితే గురువుగారు వారిని పొగిడారా లేక తిట్టారా అనే విషయం మాత్రం పూర్తిగా వినేవాడికి క్లారిటీ ఉండకపోయినా, ఎవరినైతే అన్నారో వారికి మాత్రం సూటిగా వెళ్లి తగులుతుంది! తాజాగా ఒక ఆడియో ఫంక్షన్ లో మాట్లాడిన దాసరి ఈ సారి ఎప్పటిలాగానే చిన్న సినిమాలపై తన ఆవేదనను వ్యక్తపరుస్తూ బాహుబలి - మీడియాలపై కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఫిల్మ్ నగర్ లో ఇప్పుడు ఇవి హాట్ టాపిక్!!

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు నాలుగురోజులు ఆడటం కష్టమైపోయిన రోజులివి. సినిమా తీయడానికి ఎంత ఖర్చవుతుందో - దాన్ని విడుదల చేయడానికి అంతకు మించి ఖర్చవుతుంది అంటూ ఆవేదన చెందారు దాసరి నారాయణరావు. ఇదే సమయంలో మీడియాకు కూడా తనదైన మార్కు చురకలు అంటించిన దాసరి... పెద్ద సినిమాలకిచ్చినంత ప్రయారిటీ - పబ్లిసిటీ చిన్న సినిమాలకివ్వడంలో మీడియా పక్షపాతం చూపిస్తోందని, చిన్న సినిమాల గురించి చానెళ్లు - వాటి యాజమాన్యాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంలో పబ్లిసిటీ విషయంలోనూ విడుదలకు నోచుకోవడంలోనూ పెద్ద సినిమాలకు ఆ డోకా లేదని అన్న ఆయన... తనకు తెలిసి బాహుబలి సినిమా పబ్లిసిటీకి రాజమౌళి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి ఉండడు అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వెబ్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోన్నాయి. ఇంతకూ రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఆ స్థాయి పబ్లిసిటీ సంపాదించుకున్నాడని, మీడియా మేనేజ్ మెంట్ అంత బాగా చేశాడని రాజమౌళిని పొగిడినట్లా... లేక పెద్ద సినిమాల వల్ల పరోక్షంగా ఏదో ప్రతిఫలం పొంది వాటికి అవసరమైన పబ్లిసిటీలు ఆయా మీడియా సంస్థలు చేస్తున్నాయని చెప్పినట్లా? ప్రస్తుతం దీనికి సమాధానం సంపాదించడం పైనే ఫిల్మ్ నగర్ వర్గాలు తెగ చర్చోప చర్చలు నడిపేస్తున్నాయట!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/