Begin typing your search above and press return to search.

మోహన్ బాబు జీవితం మలుపు తిరిగిన వేళ..

By:  Tupaki Desk   |   22 Nov 2015 5:30 PM GMT
మోహన్ బాబు జీవితం మలుపు తిరిగిన వేళ..
X
ఒక చిన్న మూమెంట్ జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పేయొచ్చు. ఇందుకు మోహన్ బాబు జీవితమే పెద్ద ఉదాహరణ. భక్తవత్సలం నాయుడు మోహన్ బాబుగా మారి.. 40 ఏళ్ల అద్భుత ప్రస్థానాన్ని సాగించి.. తెలుగులోని గొప్ప నటుల్లో ఒకడిగా ఎదిగి.. ఇప్పుడో పెద్ద వ్యవస్థనే నడిపిస్తున్నాడంటే అందుకు దాసరి నారాయణరావే కారణం. మోహన్ బాబును తెలుగ తెరకు పరిచయం చేస్తూ ఆయన తీసిన ‘స్వర్గం నరకం’ విడుదలై నేటికి సరిగ్గా 60 ఏళ్లు. ఈ సందర్భంగా మోహన్ బాబుకు తన సినిమాలో అనూహ్యంగా అవకాశం దక్కిన సందర్భం గురించి గర్తు చేసుకున్నారాయన. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘అందరూ కొత్త వాళ్లను పెట్టుకొని ‘స్వర్గం నరకం’ తీయడానికి నాకు ప్రేరణ ఇచ్చింది దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. కొత్త వాళ్లతో కలర్లో ఆయన ‘తేనెమనసులు’ తీస్తే.. నేను కూడా కొత్త వాళ్లతో బ్లాక్ అండ్ వైట్ లో ‘స్వర్గం నరకం’ తీసి ఆయనకు అంకితం చేశా. కొత్త నటీనటుల కోసం ఇచ్చిన ప్రకటన చూసి వేలమంది వచ్చారు. అందులోంచి మోహన్ బాబుతో పాటు కొంతమందిని ఎంచుకున్నా. ఐతే మోహన్ బాబు మీద కోపంతో నా సహాయ దర్శకుల్లో ఒకడు అతడికి సంబంధించిన వివరాల్ని దాచేశాడు. నేను అతడి గురించి మరిచిపోయా. మేమందరం షూటింగుకి బయల్దేరుతుంటే నా భార్య ఫోన్ చేసింది. మోహన్ బాబు తనను కలిశాడంది. ఐతే అప్పటికే మోహన్ బాబు వేయాల్సిన పాత్ర కోసం బోసుబాబు అనే కుర్రాడిని తీసుకున్నాం. రవిరాజా పినిశెట్టి కూడా మోహన్ బాబు గురించి చెప్పడంతో అతణ్ని తీసుకుని షూటింగ్ బస్సులో అతణ్ని కూడా ఎక్కించేశాం. అప్పటికి ఒంటి మీద వేసుకున్న బట్టలు తప్ప ఇంకో జత కూడా మోహన్ బాబుకు లేదు.

షూటింగ్ సమయంలో బోస్‌ బాబుకు జ్వరం వచ్చింది. పైగా క్లాప్ కొట్టగానే చెమటలు పట్టేశాయి. దీంతతో మోహన్‌ బాబే ఆ పాత్రకు ఖరారయ్యాడు. అతను వేసిన క్యారెక్టర్ పేరు మోహన్. దానికి బాబు జోడించి.. అతణ్ని మోహన్ బాబుని చేశా. ‘స్వర్గం నరకం’ నుంచి మోహన్‌ బాబుతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ద్రోణుడికి అర్జునుడి మీద ఎంత గురో.. నాకు అతని మీద అంత గురి. స్వర్గం నరకం తర్వాత నా ప్రతి కథలోనూ మోహన్ బాబుకు చోటిచ్చాను. కేటుగాడు సినిమాతో నేనే అతణ్ని హీరోగానూ పరిచయం చేశాను. అప్పట్లో అతడి ప్రతిభ - కమిట్ మెంట్ చూసి ఉన్నత స్థానానికి ఎదుగుతాడని ఊహించా. ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న నటడు మోహన్ బాబు’’ అని ముగించారు దాసరి.