Begin typing your search above and press return to search.

గురువుగారి మాట‌ల్ని మ‌ర్చిపోకూడ‌దు మ‌రి!

By:  Tupaki Desk   |   1 Jun 2017 4:39 AM GMT
గురువుగారి మాట‌ల్ని మ‌ర్చిపోకూడ‌దు మ‌రి!
X
దాస‌రి మ‌ర‌ణంతో ఒక శ‌కం ముగిసిన‌ట్టైంది. అంద‌రికీ పెద్ద‌దిక్కుగా ఉంటూ వ‌చ్చిన గురువుగారు లేని ప‌రిశ్ర‌మ ఎలా ఉండబోతోందో ఇక చూడాలి. ఆయ‌న శిష్యుల్లో చాలామంది ఇంకా శోక సంద్రం నుంచి బ‌య‌టికి రావ‌డం లేదు. కొద్దిమంది మాత్రం `గురువుగారి ఆశ‌యాల్ని కొన‌సాగిస్తాం` అంటూ ఆయ‌న బాట‌లో అడుగులేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. సినిమా రంగంతో పాటు దాస‌రికి ఇత‌ర‌త్రా అనేక రంగాల్లో ప్ర‌వేశం ఉంది. కానీ ఆయ‌న ఎన్ని ప‌నులు చేసినా, ఎక్క‌డికెళ్లినా దృష్టంతా సినిమాపైనే ఉండేది. ట్రెండ్ ప‌రంగా ఎన్ని మార్పులొచ్చినా ఓ కంట క‌నిపెడుతూనే ఉండేవారు. వేడుక‌ల‌కి వ‌చ్చిన‌ప్పుడు వాట‌న్నింటి గురించి పూస‌గుచ్చిన‌ట్టుగా మాట్లాడేవారు. అందుకే ఆయ‌న మేటి ద‌ర్శ‌కుడిగా నిలిచారు.

ప‌రిశ్ర‌మ విష‌యంలో ఆయన వెలిబుచ్చే అభిప్రాయాలు వింటున్న‌ప్పుడు `ముమ్మాటికీ నిజం` అనిపించేది. ముఖ్యంగా చిన్న సినిమా గురించి, క‌థ‌ల గురించి ఆయ‌న గొప్ప‌గా చెప్పేవారు. గురువుగారి ఆశ‌యాల్ని కొన‌సాగిస్తాం అంటున్న‌వాళ్లంతా కూడా దాస‌రి గారు బ‌తికున్న‌ప్పుడు చెప్పిన విష‌యాల్ని ఓసారి మ‌న‌నం చేసుకోవ‌ల్సిందే. `క‌థ‌లు డీవీడీల్లోంచి కాకుండా స‌మాజంలో నుంచి పుట్టాల‌`ని ద‌ర్శ‌కుల‌ని సుతిమెత్త‌గానే హెచ్చ‌రించేవారు. సినిమాకి సామాజిక బాధ్య‌త ఉంద‌ని, వీలైనప్పుడ‌న్నా ఓ మంచి సందేశం ఇవ్వాల‌ని సూచించేవారు. అలాగే టెక్నిక్‌ పైనే ఆధార‌ప‌డ‌కుండా క‌థ‌ని కూడా న‌మ్మాల‌ని, తెర‌పై దానికీ చోటివ్వాల‌ని ప్ర‌తి వేదిక‌పైనే వెల్ల‌డించేవారు. ద‌ర్శ‌కులంతా ఆ విష‌యాల్ని గ‌మ‌నించాల్సిందే. ఇక నిర్మాత‌ల గురించి కూడా దాస‌రి గారు మాట్లాడేవారు. `బ‌డ్జెట్టు ఎంత అని కాకుండా, క‌థేంటి అని అడిగి సినిమా నిర్మాణానికి పూనుకోవాల‌`ని చెప్పేవారు. నిర్మాత‌లు ఆ విష‌యాన్ని గుర్తు పెట్టుకొంటే గురువుగారి ఆశ‌యాల్ని కొన‌సాగించిన‌ట్టే.

అలాగే చిన్న సినిమా విష‌యంలో దాస‌రికి నిర్దుష్ట‌మైన అభిప్రాయాలుండేవి. అగ్ర ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందిన‌ప్ప‌టికీ.. ల‌క్ష రూపాయాల‌తో నీడ‌లాంటి చిన్న సినిమాల్ని తీసిన ఘ‌నత దాస‌రిది. అందుకే ద‌ర్శ‌క‌నిర్మాత‌లంతా కూడా అలాంటి చిత్రాల్ని తీయాల‌ని చెప్పేవారు దాస‌రి. చిన్న చిత్రాలు ఆడాలంటే వాటికి స‌రైన ఎగ్జిబిష‌న్ సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని, రోజులో ఒక ఆట చిన్న సినిమాకోసం కేటాయించాల‌ని చెప్పేవారు. గురువుగారు చెప్పిన ఆ మాట‌లు అక్ష‌ర స‌త్యం. మ‌రి వాటిని ప్ర‌భుత్వాలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎంత వ‌ర‌కు ప‌ట్టించుకొంటార‌న్న‌ది చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/