Begin typing your search above and press return to search.

దాసరి పదేళ్లు బతికేవాడంటున్న శిష్యుడు

By:  Tupaki Desk   |   1 July 2017 9:46 AM GMT
దాసరి పదేళ్లు బతికేవాడంటున్న శిష్యుడు
X
దర్శకరత్న దాసరి నారాయణరావు మరణాన్ని ఇండస్ట్రీ జనాలే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తెలుగు వారిపై వేసిన ముద్ర అలాంటిది. ఏకంగా 150 సినిమాలు తీసి చరిత్ర సృష్టించడమే కాదు.. వందల మందికి జీవితాన్నిచ్చి.. అందరి సమస్యల్ని పరిష్కరిస్తూ.. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారాయన. ఆయన లేని లోటు స్పష్టంగా తెలిసొస్తోంది టాలీవుడ్ లో. దాసరి శిష్య బృందం ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతోంది. దాసరి ప్రియ శిష్యుల్లో ఒకరైన రేలంగి నరసింహారావు గురువు మరణంపై తీవ్ర మనో వేదన చెందుతున్నాడు. బరువు తగ్గే సర్జరీ కోసం ప్రయత్నించి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి రెండోసారి వైద్యం విషయంలో తొందరపడకుండా ఉంటే ఇంకో పదేళ్లు బతికేవారని ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో రేలంగి అన్నారు.

బరువు తగ్గడం కోసం దాసరి మొదట కడుపులో బెలూన్ వేసుకున్నారని.. దాని వల్ల ఆరేడు కిలోల బరువు తగ్గారని.. ఇది సత్ఫలితాన్నిస్తుండటంతో రెండోసారి సర్జరీకి వెళ్లి బెలూన్ వేసుకున్నారని.. అదే ఆయన ప్రాణం తీసిందని చెప్పారు. మళ్లీ సర్జరీకి వెళ్లడమే దాసరి చేసిన తప్పు అన్నారు. ఆ సమయంలో తప్పు జరిగిందని.. ఐతే దాన్ని సవరించి దాసరిని ఇంటికి పంపించారని చెప్పారు. సర్జరీ అనంతరం దాసరి పైప్ ద్వారా ద్రవాహారం తీసుకుంటూ జీవనం సాగించాల్సి వచ్చిందని.. అలా కాకుండా నోటి ద్వారా మామూలు ఆహారాన్ని తీసుకునేందుకు వీలుగా శస్త్రచికిత్స చేయించుకోవాలని భావించి మళ్లీ ఆసుపత్రికి వెళ్లారని.. అదే ఆయన ప్రాణం తీసిందన్నారు. సర్జరీకి వెళ్లకుండా ముందులాగే ద్రవాహారం తీసుకోవడం కొనసాగించి ఉంటే దాసరి మరో పదేళ్లు బతికి ఉండేవారని అన్నారు.దాసరి ఉంటే సినీ పరిశ్రమకు అండగా ఉండేవారని.. ఎంతోమందికి మేలు జరిగి ఉండేదని.. విధి వక్రీకరించి ఆయన వెళ్లిపోయారని రేలంగి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/