Begin typing your search above and press return to search.

‘పద్మావతి’ గొడవలోకి దావూద్ ను తీసుకొచ్చారు

By:  Tupaki Desk   |   31 Dec 2017 5:56 AM GMT
‘పద్మావతి’ గొడవలోకి దావూద్ ను తీసుకొచ్చారు
X
‘పద్మావతి’ సినిమా పేరును ‘పద్మావత్’గా మార్చమని సూచించడంతో పాటు ఈ సినిమాకు ఏకంగా 26 కట్స్ చెప్పి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసింది కేంద్ర సెన్సార్ బోర్డు. దీంతో ‘పద్మావతి’ విడుదలకు మార్గం సుగమం అయినట్లే అని అంతా భావిస్తుండగా.. ఈ చిత్రాన్ని ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కర్ణి సేన మాత్రం ఏమాత్రం పట్టు విడిచే ప్రసక్తే లేదని తేల్చేసింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి పచ్చ జెండా ఊపిన కొన్ని గంటలకే కర్ణి సేన మళ్లీ బెదిరింపులకు దిగింది. ఈ సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగలబెట్టడం ఖాయమని స్పష్టం చేసింది. సినిమా విడుదల అనంతరం జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాజ్ పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్ దేవ్ హెచ్చరించాడు.

‘పద్మావతి’ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన సినిమా అని.. దేశంలో అల్లర్లు సృష్టించేందుకే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారని.. దేశంలోని హిందువుల మధ్య చిచ్చు పెట్టాలన్న కుట్రపూరిత ఆలోచనతో దావూద్ ఇబ్రహీం సెన్సార్ బోర్డుపై ఒత్తిడి తీసుకొచ్చి.. ఈ సినిమాను విడుదల చేయించేందుకు మార్గం సుగమం చేశాడని సుఖ్ దేవ్ ఆరోపించాడు. ‘పద్మావతి’ సినిమా రిలీజయ్యే ప్రతి థియేటర్ నూ తాము తగలబెడతామని.. దీని వల్ల జరిగే ఆస్తి.. ప్రాణ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అతనన్నాడు. ‘పద్మావతి’ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే చిత్ర దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ మీద కర్ణిసేన కార్యకర్తలు భౌతిక దాడికి దిగడం.. ఆ తర్వాత ఈ చిత్రం కోసం వేసిన సెట్టింగ్ ను తగలబెట్టడం తెలిసిందే. మరి తాజా హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.