Begin typing your search above and press return to search.

ఆల్బమ్ రివ్యూ: హైలీ ఎమోషనల్ కామ్రేడ్

By:  Tupaki Desk   |   23 July 2019 3:01 PM GMT
ఆల్బమ్ రివ్యూ: హైలీ ఎమోషనల్ కామ్రేడ్
X
విజయ్ దేవరకొండ హీరోగా మొదటిసారి నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న డియర్ కామ్రేడ్ మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. యూనిట్ చేసిన విస్తృతమైన ప్రమోషన్ తో పాటు ఒక్కొక్కటిగా విడుదల చేసిన ఆడియో సింగిల్స్ కు మంచి పేరు రావడంతో హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఫుల్ ఆల్బమ్ ని రిలీజ్ చేశారు. మొత్తం ఎనిమిది పాటలు ఉన్న ఈ మూవీలో వీటి నిడివే అరగంటకు పైగా ఉండటం గమనార్హం. ఇదో ఎమోషనల్ లవ్ స్టోరీ అనే ఫీలింగ్ బలంగా కలిగేలా జస్టిన్ ప్రభాకరన్ ఇచ్చిన ట్యూన్స్ చాలా కూల్ గా ఉన్నాయి.

మొదటి సాంగ్ కామ్రేడ్ యాంతం బీట్స్ తో సాగుతూ ఆవేశం నిండిన విద్యార్ధి నాయకుడి మనోగతాన్ని ప్రతిబింబించేలా చైతన్య ప్రసాద్ సాహిత్యంలో ఉద్వేగభరితంగా సాగుతుంది. ఎటు పోనే అంటూ సాగే రెండో పాట కాలభైరవ గాత్రంలో వచ్చే స్వీట్ మెలోడీ. విరహాన్ని బాధను మిళితం చేస్తూ కేకే రాసిన లిరిక్స్ బాగున్నాయి. మూడో పాట కడలల్లే ఇప్పటికే చార్ట్ బస్టర్ అయ్యింది. సిద్ శ్రీరామ్ - ఐశ్వర్య రవిచంద్రన్ గాత్రాలు చాలా రోజులు వెంటాడుతాయి. నీలి నీలి కన్నుల్లోనా మరో చక్కని స్లో ట్యూన్. గౌతమ్ భరద్వాజ్ వాయిస్ అద్భుతంగా అమరింది.

ఓ కలలా కథలా అంటూ సత్య ప్రకాష్ -చిన్మయి శ్రీపాద పాడిన పదాల గారడీ ఇంకో హిట్ ట్రాక్ అని చెప్పొచ్చు. మామ చూడరా ఆల్బమ్ మొత్తంలోకెల్లా హుషారైన ఫాస్ట్ బీట్ రిథమిక్ సాంగ్. ఇన్స్ ట్రుమెంటేషన్ కూడా ప్రత్యేకంగా ఉంటూ కాలు కదుపుతూ జోష్ ఇచ్చేలా ఉంది. నరేష్ అయ్యర్ గాత్రం మంచి కిక్ ఇచ్చేలా సాగింది. ఇక పెళ్లి బ్యాక్ డ్రాప్ లో హీరోయిన్ వెంటపడుతూ హీరో పాడుకునే గిరగిరా సాంగ్ యామిని-గౌతమిల వాయిస్ లో రిపీట్ మోడ్ కు వెళ్లేలా చేస్తుంది. ఇక ఇప్పటికే వైరల్ అయిన కాలేజీ క్యాంటీన్ సాంగ్ నిడివి చిన్నదే అయినా ఫుల్ కిక్కిచ్చేలా సాగడం ఆడియోలో కొసమెరుపు. మొదటి రెండు మినహాయించి అన్ని పాటలకు రెహమాన్ లిరిక్స్ రాశారు.

ఫుల్ ఆల్బమ్ ద్వారా డియర్ కామ్రేడ్ లో ఎంత బలమైన ప్రేమ ఎమోషన్స్ ఉన్నాయో మరోసారి తేటతెల్లం చేశారు. గత కొంత కాలంగా ఇంత డెప్త్ ఉన్న మ్యూజిక్ ఆల్బమ్ ఇదే అంటే అతిశయోక్తి కాదు. జస్టిన్ ప్రభాకర్ సంగీతం స్లో పాయిజన్ లాగా ఒక్కసారి కనెక్ట్ అయితే అందులో నుంచి బయటపడలేనట్టుగా ఉంది. ట్రెండ్ పేరుతో అవసరం లేని అర్థం లేని బీట్స్ తో హడావిడి చేయకుండా సబ్జెక్టు డిమాండ్ చేసిన విధంగా దర్శకుడు భరత్ కమ్మ అవుట్ ఫుట్ రాబట్టుకోవడం విశేషం. 26న భారీ ఎత్తున థియేటర్లలో అడుగు పెడుతున్న డియర్ కామ్రేడ్ ఆల్బమ్ అంచనాలు పెంచేసిందనే చెప్పాలి