Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ప్రేమకై పోరాడే కామ్రేడ్

By:  Tupaki Desk   |   11 July 2019 6:11 AM GMT
ట్రైలర్ టాక్: ప్రేమకై పోరాడే కామ్రేడ్
X
అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేపుతున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా డియర్ కామ్రేడ్ ట్రైలర్ ఇందాక రిలీజ్ చేశారు. రెగ్యులర్ ట్రెండ్ కి భిన్నంగా బాలీవుడ్ స్టైల్ లో ఏకంగా 3 నిముషాల ట్రైలర్ కట్ చేయడం విశేషం. కథను కూడా చాలా క్లియర్ గా రివీల్ చేసే ప్రయత్నం చేశారు. చైతన్య అలియాస్ బాబీ(విజయ్ దేవరకొండ)ఆవేశం నిండిన విద్యార్ధి. కాలేజీలో రాజకీయాలు ఉండకూడదని కోరుకునే నవతరం ప్రతినిది. అయితే తనమీద తనకు కంట్రోల్ లేకపోవడం వల్ల ఇబ్బందులు గొడవలు తెచ్చుకుంటూ ఉంటాడు.

ఆ సమయంలోనే లిల్లీ(రష్మిక మందన్న)ఎంటరవుతుంది. చిన్నప్పుడు కలిసి ఆడుకున్న లిల్లీతో బాబీ పరిచయం ప్రేమగా మారుతుంది. కొన్ని తీవ్రమైన సంఘటనల తర్వాత ఇద్దరు విడిపోయే పరిస్థితులు వస్తాయి. తన ప్రేమను గెలిపిస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సమాజంతో యుద్ధం చేసే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో ప్రేమికులు మూడేళ్ళ పాటు దూరంగా ఉంటారు. మరి ఈ లవ్ కామ్రేడ్ లైఫ్ అండ్ లవ్ వార్ ఎలా గెలిచాడు అనేదే అసలు కథ

ట్రైలర్ లో మంచి ఇంటెన్సిటీని నింపారు. విజయ్ దేవరకొండ సెంటర్ అఫ్ ది అట్రాక్షన్ గా నిలుస్తూ మూడు షేడ్స్ లో ఉండే పాత్రలో కొత్త ఛాలెంజ్ తీసుకున్నట్టున్నాడు. కాలేజీ విద్యార్ధిగా ఓసారి చదువు పూర్తయ్యాక ఇంకో రూపంలో ప్రేమ దూరమయ్యాక భగ్న ప్రేమికుడిగా ఇలా త్రీ వేరియేషన్స్ ని బాగా క్యారీ చేశాడు. రష్మిక మందన్నలో క్యుట్ నెస్ కంటే నటనకు స్కోప్ ఎక్కువగా ఉన్న పాత్ర దొరికింది. ఎమోషనల్ గా తనముద్ర వేసేందుకు ప్రయత్నించింది.

కాలేజీ డ్రామాతో పాటు ఓ ఆవేశపరుడి లైఫ్ జర్నీని కాన్సెప్ట్ గా తీసుకున్న భరత్ కమ్మ అంచనాలు నిలబెట్టుకునేలా ట్రైలర్ ఉండటం విశేషం. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సుజిత్ సారంగ్ ఛాయాగ్రహణం సినిమా థీమ్ కు తగ్గట్టు బాగా ఎలివేట్ అయ్యాయి ట్రైలర్ చివర్లో నన్ను భయపెట్టాలని మీరు భయపడుతున్నారు అని విజయ్ దేవరకొండతో చెప్పించడం క్లిక్ అయ్యింది. ఫైనల్ గా డియర్ కామ్రేడ్ సీరియస్ లవ్ అండ్ ఎమోషనల్ స్టూడెంట్ స్టోరీలో విజయ్ దేవరకొండను కొత్తగా ప్రెజెంట్ చేయనున్నట్టు అర్థమైపోయింది