Begin typing your search above and press return to search.

కథ అలా ఉంది.. కాబట్టి తప్పదు

By:  Tupaki Desk   |   1 Feb 2018 8:30 AM GMT
కథ అలా ఉంది.. కాబట్టి తప్పదు
X
ఈమధ్య కాలంలో అత్యంత వివాదాల్లో కూరుకుపోయి ఎట్టకేలకు దాని నుంచి బయటపడి విజయాన్ని దక్కించుకున్న చిత్రం పద్మావత్. రిలీజుకు ముందే చరిత్రను వక్రీకరించారని.. రాజపుత్రుల గౌరవానికి ప్రతీకగా భావించే రాణి పద్మావతిని అవమానకరంగా చూపించారంటూ ఆందోళనలు చెలరేగాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా వేసుకుని చివరకు సుప్రీం కోర్టు వరకు వెళ్లి అన్ని అడ్డంకులను దాటి ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సినిమా రిలీజై సక్సెస్ ఫుల్ గా నడుస్తుండటంతో సినిమా యూనిట్ తో పాటు యాక్టర్లంతా హ్యాపీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మరోరకంగా దాడి మొదలైంది. సినిమా చివరిలో రాణి పద్మావతి సతీ సహగమనం చేస్తుంది. నవ్వుతూ చితిమంటలోకి అడుగుపెట్టే సన్నివేశంలో హీరోయిన్ దీపిక పదుకునే నటనకు ప్రేక్షకుల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే టైంలో సతీ సహగమనంలాంటి దురాచారాన్ని ప్రోత్సహించేలా సినిమా తీశారంటూ ఫెమినిస్టులు ఫైరయిపోతున్నారు. సినిమాలో ఇదే సీన్ హైలైట్ అయ్యేలా తీయడంతో వాళ్ల విమర్శల్లో పదును పెంచారు.

ఈ విమర్శలకు హీరోయిన్ దీపిక పదుకునే ఆన్సరిచ్చింది. పద్మావతి అనేది జరిగిన కథ. దానిని తెరకెక్కించినప్పుడు కథానుసారం అలా తీశారు తప్ప తాము సతీ సహగమనాన్ని ప్రోత్సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. అసలు తమకు అలాంటి ఉద్దేశమే లేదని క్లారిటీ ఇచ్చింది. సినిమాను విమర్శించాలి అనుకునే వారు పనిగట్టుకుని అనడం తప్ప అసలు దీపికా లాంటి న్యూ ఏజ్ మోడ్రన్ గర్ల్ ఆనాటి పాత సిద్ధాంతాలను ఏ రకంగా ఎంకరేజ్ చేస్తుంది? ఆమె నటించిన రేస్.. లవ్ ఆజ్ కల్ లాంటి సినిమాలు మరోసారి చూస్తే వాళ్ల డౌట్లు కచ్చితంగా తీరిపోతాయి .