Begin typing your search above and press return to search.

పావు గంట పాత్రకు రూ. 14 కోట్ల పారితోషికం

By:  Tupaki Desk   |   14 Jun 2019 8:27 AM GMT
పావు గంట పాత్రకు రూ. 14 కోట్ల పారితోషికం
X
బాలీవుడ్‌ లో ఈమద్య కాలంలో బయోపిక్‌ లు వరుసగా వస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ బయోపిక్‌ ల క్రమంలో కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ ను కూడా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో '83' అనే చిత్రం రూపొందుతుంది. 1983లో టీం ఇండియా ప్రపంచ కప్‌ ను గెలిచిన తీరును చిత్రంలో చూపించబోతున్నారు. ఆ సమయంలోని ఆటగాళ్ల ఆట తీరు మరియు వారి భావోద్వేగాలను చూపించేందుకు దర్శకుడు స్క్రిప్ట్‌ ను సిద్దం చేసుకున్నాడు.

త్వరలోనే పట్టాలెక్కబోతున్న ఈ చిత్రంలో కపిల్‌ దేవ్‌ పాత్రను బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణవీర్‌ సింగ్‌ చేయబోతున్నాడు. ఇప్పటికే రణవీర్‌ సింగ్‌ క్రికెట్‌ మెలుకువలు నేర్చుకోవడంతో పాటు కపిల్‌ కు చెందిన పలు విషయాలను తెలుసుకున్నాడు. ఇక కపిల్‌ దేవ్‌ భార్య పాత్రను ఎవరితో చేయిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా ఆ పాత్రకు దీపిక పదుకునేను ఎంపిక చేసినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందట. అయినా కూడా దీపిక పదుకునే అనగానే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

కేవలం పావు గంట నిడివి కలిగిన పాత్రను చేసేందుకు దీపిక పదుకునే ఏకంగా 14 కోట్ల రూపాయల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. దీపిక పదుకునే సినిమాలో ఉంటే సినిమాకు వచ్చే క్రేజ్‌ ముందు ఆమెకు ఇస్తున్న పారితోషికం పెద్ద మ్యాటర్‌ కాదని నిర్మాతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం పావు గంట నిడివి పాత్రకు ఏకంగా 14 కోట్ల రూపాయల పారితోషికంను అందుకోబోతున్న దీపిక పదుకునే స్టార్‌ డం ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.