Begin typing your search above and press return to search.

నా అజ్ఞాన ప్రశ్నలకు సమాధానమే 'రిపబ్లిక్‌'

By:  Tupaki Desk   |   29 Sep 2021 3:30 AM GMT
నా అజ్ఞాన ప్రశ్నలకు సమాధానమే రిపబ్లిక్‌
X
చేసినవి కొన్ని సినిమాలే అయినా కూడా ఒక ప్రత్యేకత ఇతడిలో ఉంది అని అందరితో అనిపించుకున్న దర్శకుడు దేవ కట్టా. ఈయన తాజాగా తెరకెక్కించిన చిత్రం 'రిపబ్లిక్‌'. కమర్షియల్ గా ఈ సినిమా ఫలితం గురించి పక్కన పెడితే ప్రతి ఒక్క సామాన్యుడికి ఒక మంచి సందేశంను ఈ సినిమాతో ఆయన ఇవ్వబోతున్నాడు. రిపబ్లిక్ దేశం అయిన ఇండియాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించడంతో పాటు ఈ సమయంలో ప్రజలు.. ప్రజా వ్యవస్థలు.. అధికారులు చేయాల్సిన విధులు ఏంటీ అనేది ఆయన చెప్పబోతున్నాడు. ఒక మంచి నేపథ్యంతో రూపొందిన 'రిపబ్లిక్‌' మూవీ ని అక్టోబర్ 1న థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్దం చేశారు. ఈ సినిమా లో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ట్రైలర్‌ ను చిరంజీవి ఆవిష్కరించగా.. ప్రీ రిలీజ్ వేడుకలో పవన్‌ కళ్యాణ్ పాల్గొనడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి.

సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు దేవ కట్టా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.. నా చినప్పటి నుండి ఈ రాజకీయాలు ఏంటీ.. రాజకీయ నాయకులు ఏం చేస్తారు.. ఈ సోషలిజం అంటే ఏంటీ.. కమ్యూనిజం అంటే ఏంటీ అనే విషయాలు తెలిసేవి కావు. ఆ విషయాల్లో చాలా అజ్ఞానంతో ఆలోచించేవాడిని. నా అజ్ఞానంతో ఆలోచించిన సమయంలో నాలో వచ్చిన ప్రశ్నలకు సమాధానమే ఈ రిపబ్లిక్‌. చాలా మంది సోషలిజం.. కమ్యూనిజం.. రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. కాని ఎంత మందికి వీటన్నింటి గురించి తెలుసు అనేది ఇక్కడ ప్రశ్న. మనం వ్యవస్థలో ఎక్కడ ఉన్నాం.. మన పరిస్థితి ఏంటీ అనే విషయాలను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. చదువుకున్న నాకే ఈ విషయాలు అర్థం కానప్పుడు సామాన్యులకు ఈ వ్యవస్థ గురించి ఎలా అర్థం అవుతుంది. అందరికి అర్థం అయ్యేలా చేసే ఉద్దేశ్యంతో నేను చాలా స్టడీ చేశాను. ఆ సమయంలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. న్యాయ వ్యవస్థ... బ్యూరోక్రసీ... లెజిస్లేటివ్ అనే మూడు గుర్రాల బండినే ప్రజాస్వామ్యం. ఈ మూడు గుర్రాల్లో ఏ గుర్రం గతి తప్పినా కూడా రెండు గుర్రాలు ఆ గుర్రంను గాడికి లాగాలి అనేది రిపబ్లిక్ కథా నేపథ్యం అన్నాడు.

ఒక రోజు తేజూ జిమ్‌ లో కలిసిన సమయంలో ఈ ఐడియాను అతడితో పంచుకున్నాను. ఇంకా అప్పటికి కథ కూడా పూర్తి చేయలేదు. అప్పుడే అతడికి కాన్సెప్ట్‌ చాలా నచ్చి తప్పకుండా సినిమా చేద్దాం అన్నాడు. ఈ కాన్సెప్ట్ తో సినిమా ను నాతోనే చేయాలని నా నుండి ప్రామీస్ తీసుకున్నాడు. కథ కూడా పూర్తి కాకుండా సినిమాను చేసేందుకు సిద్దం అయిన అతడి నిర్ణయం నాకు నచ్చింది. ఒక కామన్ మ్యాన్ గా కాన్సెప్ట్‌ విని సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈ కథ ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది.. ప్రతి ఒక్కరి ప్రశ్నలకు ఈ సినిమా సమాధానం అవుతుందనే నమ్మకంను దేవ కట్టా చెప్పుకొచ్చాడు. సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ తో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేక పోతున్నాడు. అయినా కూడా సినిమాకు మంచి బజ్ క్రియేట్‌ చేయడంలో యూనిట్‌ సభ్యులు సఫలం అయ్యారు. చిరంజీవి మరియు పవన్‌ ల ఎంట్రీతో రిపబ్లిక్ గురించి జనాలు చర్చిస్తున్నారు. అలాగే సినిమా లో చూపించబోతున్న అంశాలను ముందుగానే రివీల్‌ చేయడం వల్ల కూడా సాదారణ జనాలు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.