Begin typing your search above and press return to search.

సూపర్ మచ్చి.. ఆయన మీసం మెలేశాడు

By:  Tupaki Desk   |   14 Feb 2016 11:30 AM GMT
సూపర్ మచ్చి.. ఆయన మీసం మెలేశాడు
X
తెలుగులోనే కాదు.. ఇండియా మొత్తంలో కూడా ఐటెం సాంగ్స్ చేయాలంటే దేవిశ్రీ ప్రసాద్ తర్వాతే ఎవరైనా. ‘ఆర్య’లో అ అంటే అమలాపురం దగ్గర్నుంచి మొన్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో సూపర్ మచ్చి వరకు అదిరిపోయే ఐటెం సాంగ్స్ చేశాడు దేవి. ఇందులో కొన్ని పాటలు దేవినే స్వయంగా రాశాడు కూడా. ఐతే తాను స్వయంగా రాసి, మ్యూజిక్ కంపోజ్ చేసి, పాడిన ‘సూపర్ మచ్చి’ పాట తనకు చాలా ప్రత్యేకమని.. తన తండ్రి సత్యమూర్తికి కూడా ఆ పాట చాలా నచ్చడమే దానికి కారణమని అంటున్నాడు దేవిశ్రీ ప్రసాద్.

‘‘నేను ఏ పాట కంపోజ్‌ చేసినా నాన్నకు తప్పనిసరిగా వినిపించేవాడిని. తప్పొప్పులేవైనా ఉంటే చెప్పేవారు. పాట రాస్తే మాత్రం ముందు నాన్నకు చూపించాకే కంపోజింగ్ కు వెళ్లేవాడిని. ‘సూపర్‌ మచ్చి..’ పాట వినిపిస్తే ఆయన మీసం మెలేశారు. ‘ఇంత తెలుగు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా’ అని మెచ్చుకుంటూనే.. మా అమ్మను చూసి ‘చూడవే.. చూడవే... బ్లడ్‌.. నా బ్లడ్‌’ అని మురిసిపోయారు’’ అని దేవి చెప్పాడు.

తన పాటల్లో తన తండ్రికి నచ్చిన మిగతా వాటి గురించి చెబుతూ.. ‘‘నా పాటల్లో నాన్నకి నచ్చినవి చాలా వున్నాయి. అయితే అన్నింట్లోకి బెస్ట్ అంటే ‘నువ్వొస్తానంటే నేనొద్దానంటానా’లో ఘల్‌ ఘల్‌.. పాట. అది ఆయనకు చాలా చాలా ఇష్టం. ఎప్పుడూ ఆ పాట గురించి ఎక్కువగా చెబుతూ ఉంటారు. పాడుకుంటూ ఉంటారు. ఏదైనా నచ్చకపోతే బాలేదుగా అని చెప్పేస్తారు. ఏంటిరా అందరూ బాగుందంటున్నారు.. ఆ పాటలో అంత లేదురా అనేవారు. ఈ మధ్య ‘కుమారి 21’లో ‘మేఘాలు లేకున్నా...’ పాట చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఆయనకు సహజంగా మెలోడీలంటే బాగా ఇష్టం. ‘పౌర్ణమి’లో మువ్వలా నవ్వకలా, ‘మిస్టర్‌ పర్ఫెక్ట్‌’లో చలిచలిగా అల్లింది... కూడా ఇష్టం’’ అని దేవి చెప్పాడు.