Begin typing your search above and press return to search.

దేవిశ్రీ.. అదరగొట్టేశాడుగా

By:  Tupaki Desk   |   16 Jan 2017 9:39 AM GMT
దేవిశ్రీ.. అదరగొట్టేశాడుగా
X
ప్రస్తుతం తెలుగు సినిమా సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ మకుటం లేని మహారాజు. గత ఏడాది నేను శైలజ.. నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్.. సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో సత్తా చాటాడు దేవి. ఈ ఏడాది ‘ఖైదీ నెంబర్ 150’తో శుభారంభం చేశాడు. ఆ సినిమా పాటల విషయంలో కొత్తదనం ఏమీ లేదంటూ కొన్ని విమర్శలు వ్యక్తమైనప్పటికీ ఆడియో సూపర్ హిట్టయింది. ఇప్పుడు ‘నేను లోకల్’తో మ్యూజికల్ లవర్స్ ను ఊపేయడానికి వచ్చాడు దేవి. తొలిసారి నాని సినిమాకు సంగీతాన్నందించిన దేవి.. అంచనాల్ని అందుకున్నాడు. సినిమాకు తగ్గట్లుగా ట్రెండీగా.. యూత్ ఫుల్ గా ఉండే పాటలతో తన ప్రత్యేకత చాటుకున్నాడు.

నెక్స్ట్ ఏంటి అనే పాట ఆల్రెడీ ఆడియో విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసింది. చంద్రబోస్ భలే సరదాగా ఈ పాటను రాస్తే.. సాగర్ అంతే సరదాగా పాడాడు. క్యాచీగా ఉన్న ఈ పాట జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. ఆడియోలోని మిగతా నాలుగు పాటలూ శ్రీమణినే రాశాడు. వీటిలో ఎక్కడ ఎక్కడ అంటూ సాగే పాట సూపర్బ్ మెలోడీ. నరేష్ అయ్యర్.. మనీషా చాలా శ్రావ్యంగా ఈ పాట పాడారు. లిరిక్స్ ఎంత బాగున్నాయో.. ట్యూన్.. పాడిన తీరు కూడా అంతే ఆకట్టుకుంటాయి. పృథ్వీ చంద్ర పాడిన డిస్టర్బ్ చేస్తా నిన్ను పెప్పీ నెంబర్. సరదాగా సాగుతుంది. సైడ్ ప్లీజ్.. పాటలో దేవిశ్రీ మార్కు కనిపిస్తుంది. జావెద్ అలీ ఈ పాటను చలాకీగా పాడాడు. చంపేసావె నిన్నూ పాట కొంచెం ఫాస్ట్ బీట్ తరహాలో సాగే మెలోడీ. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉందీ పాట. మొత్తంగా ఆడియోలోని ఐదు పాటలూ వేటికవే భిన్నంగా ఉంటూ.. యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. తెరమీద ఈ పాటలు మరింత ఆకర్షణీయంగా అనిపించొచ్చు. యూత్ ఫుల్ సినిమాలకు దేవిశ్రీ ఎంత మనసు పెట్టి పాటలు చేస్తాడో చెప్పడానికి ‘నేను లోకల్’ రుజువుగా నిలుస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/