Begin typing your search above and press return to search.

సిద్ వాయిస్ దేవికి నచ్చలేదా..?

By:  Tupaki Desk   |   20 March 2020 2:30 AM GMT
సిద్ వాయిస్ దేవికి నచ్చలేదా..?
X
ప్రస్తుతం దక్షిణ భారతదేశాన్ని ఉర్రూతలూపుతున్న సింగర్ ఎవరైనా ఉన్నారంటే అది సిద్ శ్రీరామ్ మాత్రమే. ఏఆర్ రెహమాన్ పరిచయం చేసిన సిద్ శ్రీరామ్ మ్యాజికల్ వాయిస్ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు ఏ సినిమా తీసినా దర్శక నిర్మాతలు ఖచ్చితంగా సిద్ శ్రీరాంతో ఒక్కపాటైనా వారి ఆల్బంలో పాడించాలని పూనుకుంటున్నారు. తన మాధుర్య గానంతో అంతలా ఆకట్టుకుంటున్నాడు మరి. అతను పదాలను స్పష్టంగా పలికే తీరుకి - అతని పాటలోని మాధుర్యానికి తెలుగు అభిమానులు సిద్ శ్రీరాంను విశేషంగా అభిమానిస్తున్నారు. దాదాపు కొత్త సంగీత దర్శకుల దగ్గరనుండి సీనియర్ల వరకు అందరి సంగీతాలకు తన గాత్రాన్ని అందించాడు.

తెలుగులో 'నువ్వుంటే నా జతగా' - 'ఇంకేం ఇంకేం కావాలి' - 'మాటే వినదుగా' - 'ఉండిపోరాదే' - 'సామజవరాగమనా'.. లాంటి అనేక పాటలతో సంగీత ప్రియులకు చేరువయ్యాడు. అయితే తెలుగులో మణిశర్మ - థమన్ - గోపిసుందర్ - యువన్ శంకర్ రాజా - అనూప్ రూబెన్స్ ఇలా అందరితోనూ సిద్ శ్రీరాం పనిచేసాడు. కానీ ఇంతవరకు సిద్ శ్రీరాంతో పాట పాడించని సంగీత దర్శకుడు ఒక్కడే అతనే రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్. గీతగోవిందం నుండి మొన్నటి రాహు వరకు సిద్ పాడుతూనే ఉన్నాడు. కానీ దేవి మాత్రం ఇంతవరకు ఒక్కపాట కూడా పాడించలేదు. ఎన్నో కొత్త గాత్రాలను పరిచయం చేసిన దేవి అసలు సిద్ గురించి ఆసక్తి చూపించకపోవడంతో సినీ వర్గాలలో అనుమానాలు మొదలయ్యాయి. సిద్ తో కొత్తగా ట్రెండ్ సృష్టించడానికి చూస్తున్నాడా.. లేక సిద్ వాయిస్ లో దేవి ఏం కోరుతున్నాడో.. అంటూ చర్చించుకుంటున్నారు. కారణాలు ఏవైనా దేవి కంపోసిషన్ లో సిద్ గానం వినాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారట.