Begin typing your search above and press return to search.

వీఐపీ-2.. అత్యాశకు పోయి

By:  Tupaki Desk   |   24 Aug 2017 6:00 AM GMT
వీఐపీ-2.. అత్యాశకు పోయి
X
తెలుగులో మార్కెట్ సంపాదించుకోవాలని తమిళ స్టార్ హీరో ధనుష్ చాలా ఏళ్ల పాటు ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు. ఐతే రెండేళ్ల కిందట అతడి ‘వీఐపీ’ సినిమా తెలుగు వెర్షన్ ‘రఘువరన్ బీటెక్’ తెలుగులో సర్ప్రైజ్ హిట్టయి.. అతడికి మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. థియేటర్లలో కంటే కూడా టీవీల్లో ఈ సినిమా చాలా బాగా ఆడింది. ఇప్పుడు ఈ సినిమా వచ్చినా కూడా జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ‘రఘువరన్ బీటెక్’ సినిమాను స్రవంతి మూవీస్ లాంటి పెద్ద బేనర్ తీసుకుని చక్కగా ప్రమోట్ చేసి.. రిలీజ్ చేయడం కలిసొచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన ధనుష్ సినిమాలేవీ కూడా తెలుగులో ఆడలేదు. ‘రఘువరన్ బీటెక్’కు సీక్వెల్ అనగానే మన ప్రేక్షకుల్లోనూ ఆసక్తి కలిగింది.

కానీ సరైన ఆలోచన లేకపోవడం.. అత్యాశకు పోవడం వల్ల ‘వీఐపీ-2’ తెలుగులో ఏమాత్రం అంచనాల్లేకుండా విడుదల కావాల్సిన పరిస్థితి తలెత్తింది. తెలుగు వెర్షన్‌ టైటిల్లో ‘రఘువరన్’ అనే పేరు లేకపోవడం పెద్ద తప్పయితే.. ఈ సినిమాను సరైన బేనర్ చేతిలో పెట్టకపోవడం.. అత్యాశకు పోయి చాలా ఎక్కువ రేటు చెప్పి సరైన సమయంలో బిజినెస్ పూర్తి చేయకపోవడం చేటు అయ్యాయి. అలాగే ముందు అనుకున్నట్లుగా జులై 28న తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి రిలీజ్ చేస్తే బాగుండేది. కానీ సినిమాను వాయిదా వేసేశారు. ఆగస్టు 11న తమిళం వరకే రిలీజ్ చేశారు. అక్కడ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు వెర్షన్ మీద ఆశలు పోయాయి. ఇక్కడ సరిగా బిజినెస్ కూడా జరగలేదు. చివరికి రెండు వారాలు ఆలస్యంగా.. ‘అర్జున్ రెడ్డి’కి పోటీగా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. దీంతో సినిమాపై ఇప్పుడు మన జనాల్లో ఏమాత్రం ఆసక్తి కనిపించడం లేదు. బుకింగ్స్ కూడా ఏమాత్రం ఆశాజనకంగా కనిపించట్లేదు. మొత్తానికి సరైన ప్లానింగ్ లేకపోవడం.. అత్యాశకు పోవడం వల్ల ‘వీఐపీ-2’కు తెలుగులో పెద్ద పంచే పడేలా ఉంది.