Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ధృవ

By:  Tupaki Desk   |   9 Dec 2016 8:56 AM GMT
మూవీ రివ్యూ : ధృవ
X
‘ధృవ’ రివ్యూ

నటీనటులు: రామ్ చరణ్-అరవింద్ స్వామి-రకుల్ ప్రీత్ సింగ్-నవదీప్-పోసాని కృష్ణమురళి-నాజర్-షాయాజి షిండే-మధు తదితరులు
సంగీతం: హిప్ హాప్ తమిళ
ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్
మాటలు: వేమారెడ్డి
నిర్మాతలు: అల్లు అరవింద్-ఎన్వీ ప్రసాద్
కథ: మోహన్ రాజా
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేందర్ రెడ్డి

ఓవైపు ఫెయిల్యూర్లు.. మరోవైపు రొటీన్ సినిమాలు చేస్తున్నాడన్న విమర్శలు.. ఈ రెండు ఇబ్బందుల్నీ అధిగమించడానికి తమిళ బ్లాక్ బస్టర్ ‘తనీ ఒరువన్’ రీమేక్ ‘ధృవ’ను ఎంచుకున్నాడు రామ్ చరణ్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ ప్రయత్నం ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ: ధృవ (రామ్ చరణ్) ఐపీఎస్ ట్రైనీగా ఉండగానే తన సహచరులతో కలిసి సొసైటీలో జరిగే నేరాలపై పోరాటం మొదలుపెడతాడు. ఐతే ధృవ అండ్ కో ఎంతో కష్టపడి చాలామంది నేరస్థుల్ని పట్టుకున్నా.. వాళ్లందరూ కేసుల నుంచి బయటపడి సమాజంలో దర్జాగా తిరిగేస్తున్నారని తర్వాత తెలుస్తుంది. దీంతో ధృవ మొత్తం నేర ప్రపంచం మీద దృష్టిపెడతాడు. గొప్ప సైంటిస్టుగా చలామణి అవుతూ.. పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్న సిద్ధార్థ్ అభిమన్యు (అరవింద్ స్వామి) ఈ నేరాలన్నింటికీ సూత్రధారి అని తెలుసుకున్న ధృవ.. అతణ్ని టార్గెట్ చేస్తాడు. వీళ్లిద్దరి మధ్య పోరు ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది.. ఈ పోరాటంలో ఎవరు గెలిచారు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: హీరో అతి సామాన్యుడిగా ఉంటాడు. అసామాన్యమైన పనులు చేస్తూ ఉంటాడు. విలన్ ఎంత పెద్దవాడైనా సరే.. హీరో ముందు నిలవలేడు. అతడి చేతిలో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాడు. మన కమర్షియల్ సినిమాల్లో ఇది సర్వ సాధారణం. అందుకే అలాంటి సినిమాలు సాధారణంగా అనిపిస్తాయి. అలాంటి సినిమాల మధ్య ‘ధృవ’ ప్రత్యేకంగా నిలుస్తుంది. సినిమాలో ఒక చోట హీరో.. నీ శత్రువు ఎంత గట్టివాడు అన్నదాన్ని బట్టి నీ కెపాసిటీ తెలుస్తుంది అంటాడు. విలన్ పాత్ర బలంగా ఉంటే.. సినిమా కూడా బాగా తయారవుతుంది అనడానికి ‘ధృవ’ నిదర్శనంగా నిలుస్తుంది.

మైండ్ బ్లోయింగ్ గా అనిపించే విలన్ పాత్ర.. దానికి దీటైన హీరో క్యారెక్టర్.. బలమైన కథ.. బిగువైన స్క్రీన్ ప్లే ‘ధృవ’కు ప్రధాన ఆకర్షణలు. నిడివి కాస్త ఎక్కువైనా.. వృథా సన్నివేశాలకు తావు లేకుండా కథతో పాటు ప్రేక్షకుల్ని ట్రావెల్ చేయించే సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ ధృవ. తమిళ బ్లాక్ బస్టర్ ‘తనీ ఒరువన్’కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చాలా వరకు మాతృకకు కట్టుబడింది. సురేందర్ రెడ్డి తెలుగు నేటివిటీ అనో.. దర్శకుడిగా తన ముద్ర ఉండాలననో.. ‘తనీ ఒరువన్’ స్క్రిప్టును చెడగొట్టలేదు. చాలా వరకు మాతృకనే ఫాలో అయిపోయాడు. పొరబాట్లకు తావివ్వకుండా ఒరిజినల్ కు మరింత క్వాలిటీ జోడించి ‘ధృవ’ను ఆకర్షణీయంగానే మలిచాడు.

‘ధృవ’ నిజానికి ధృవ చుట్టూ తిరిగే కథ కాదు. సిద్ధార్థ్ అభిమన్యు చుట్టూ తిరిగే కథ. ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టేది కూడా ఈ అంశమే. టిపికల్ గా సాగే విలన్ పాత్రే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇలాంటి బలమైన విలన్ క్యారెక్టర్లు గతంలోనూ చూసి ఉంటాం కానీ.. సిద్ధార్థ్ అభిమన్యు పాత్ర మాత్రం నభూతో అని చెప్పాలి. అంత యునీక్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్. పాత్రను తీర్చిదిద్దిన తీరు ఒక ఎత్తయితే.. ఆ పాత్రలో అరవింద్ స్వామి అభినయం మరో ఎత్తు. సిద్ధార్థ్ పాత్రకు తొలి సన్నివేశం నుంచి చివరి సీన్ వరకు అలా కళ్లప్పగించి చూస్తుండిపోయేలా ఉంటుంది ఆ క్యారెక్టర్. సొసైటీలో గొప్పవాడిగా చెలామణి అవుతూ.. తెరవెనుక అఘాయిత్యాలు చేసే వైట్ కాలర్ క్రిమినల్ గా కనిపించే విలన్ పాత్రతో ప్రేక్షకులు కనెక్టవుతారు. ఆసక్తికరంగా సాగే ఈ పాత్రే సినిమాను ముందుకు తీసుకెళ్తుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసమనో.. ఇంకో కారణమో చెప్పి సినిమాకు అత్యంత కీలకమైన అరవింద్ పాత్రను తగ్గించేయకపోవడం అభినందించాల్సిన విషయం.

సినిమాలో హీరో పాత్రకు అనవసర బిల్డప్ ఇచ్చే ప్రయత్నమేమీ జరగలేదు. హీరో పాత్ర పరిచయంలోనూ అతి ఏమీ కనిపించదు. ఆ సన్నివేశం కూడా కథకు రిలేట్ అయ్యే ఉంటుంది. విలన్ పాత్ర ఎంటరయ్యే వరకు సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా సాగుతాయి కానీ.. ఆ పాత్ర కథలోకి ప్రవేశించాక ఆసక్తి పెరుగుతుంది. హీరో-విలన్ మధ్య ఎత్తులు పైఎత్తులతో సాగే పోరాటం ఉత్కంఠ రేపుతుంది. ముఖ్యంగా విలన్ కు చెక్ పెట్టడానికి హీరో ప్రయత్నం చేసి.. తనే దెబ్బ తినే ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది. ఇంటర్వెల్ ముంగిట అది చక్కటి మలుపు. ముందు హీరోనే దెబ్బ తినడం.. విలన్ అతడికి సవాలు విసురుతూ సాగడంతో.. దీన్ని హీరో ఎలా ఛేదిస్తాడన్న ఉత్కంఠ పెరుగుతుంది. ఐతే ద్వితీయార్ధంలో హీరో ఛార్జ్ తీసుకునేసరికి ఆలస్యమైపోతుంది. మధ్యలో కథనం కొంచెం సాగతీతగా అనిపించి ప్రేక్షకుడిని ఇబ్బంది పెడతుుంది. విలన్ తన ఒంట్లో పెట్టిన డివైజ్ తాలూకు రహస్యాన్ని హీరో ఛేదించి.. అదే సమయంలో హీరోయిన్ కు తన ప్రేమను వ్యక్త పరిచే సన్నివేశం బాగా పండింది. ప్రథమార్ధం మాదిరి ద్వితీయార్ధం క్రిస్ప్ గా లేకపోవడంతో చివరికి వచ్చేసరికి ‘ధృవ’ మీద ఇంప్రెషన్ తగ్గుతుంది.

క్లైమాక్సులో ఫైట్లు గట్రా ఏమీ పెట్టకుండా.. ఇదొక ఇంటలిజెంట్ మూవీ అన్న ఫీలింగ్ తోనే బయటికి పంపించడం ప్రేక్షకుల్ని మిశ్రమానుభూతికి గురి చేయొచ్చు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్ని ఈ క్లైమాక్స్ నిరాశ పరచొచ్చు. ఇక ‘ధృవ’ నరేషన్ కూడా రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఆ వర్గం ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం. ఈ కథ సాగే తీరు చూశాక ఇందులో ఎంటర్టైన్మెంట్ లేదని కంప్లైంట్స్ చేయలేం. కమర్షియల్ విలువలు కూడా తక్కువే. పాటలు ఉన్నాయి కానీ.. టైటిల్ సాంగ్ మినహాయిస్తే మిగతావి సినిమాకు అడ్డం పడ్డాయి తప్ప వాటి వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. ఇంటలిజెంట్ స్క్రీన్ ప్లేతో సాగే సినిమాలో కొన్ని చోట్ల చిన్న చిన్న లాజిక్స్ మిస్సయ్యాయి. వాటిని మన్నించొచ్చు. సినిమా నిడివి కొంచెం ఎక్కువ కావడం.. సినిమా చాలా వరకు సీరియస్ గా సాగడం అందరికీ రుచించకపోవచ్చేమో. థ్రిల్లర్లను.. సీరియస్ సినిమాల్ని ఇష్టపడేవారికి మాత్రం ‘ధృవ’ మంచి ఛాయిస్.

నటీనటులు: రామ్ చరణ్ కెరీర్లో ‘ధృవ’ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇలాంటి కథలో అతణ్ని చూడటమే కొత్తగా అనిపిస్తుంది. పాత్రకు తగ్గట్లుగా చరణ్ తనను తాను మలుచుకున్న తీరు ఆకట్టుకుంటుంది. తెరమీద అతడి కష్టం కనిపిస్తుంది. అతడి లుక్.. ఫిజిక్ బాగున్నాయి. ధృవ పాత్రకు అతను బాగా సూటయ్యాడు. మామూలుగా చరణ్ సీరియస్ సన్నివేశాల్లో బాగా చేస్తాడు. ‘ధృవ’ కథ.. పాత్ర కూడా ఆ తరహావే కావడంతో ఎక్కడా పెద్దగా ఇబ్బంది పడలేదు. పాత్రకు తగ్గట్టుగా నటించాడు. ఎప్పట్లాగే యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఇక అరవింద్ స్వామి గురించి చెప్పేదేముంది. సినిమా చూశాక అతను వెంటాడతాడు. చాలా కాలం గుర్తుంటాడు. అతడి లుక్.. బాడీ లాంగ్వేజ్.. కాస్ట్యూమ్స్.. నటన.. అన్నీ చాలా రిఫ్రెషింగ్ గా.. ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఇషికా పాత్రలో రకుల్ ప్రీత్ కూడా బాగా చేసింది. చలాకీ నటనతో ఆకట్టుకుంది. ఓ పాటలో ఆమె గ్లామర్ విందు చేసింది. ఐతే ఐపీఎస్ ట్రైనీగా ఆమె ప్రవర్తించే తీరు కొంచెం చిత్రంగా ఉంటుంది. ఇక్కడ పాత్ర ఔచిత్యం దెబ్బ తింది. గౌతమ్ పాత్రలో నవదీప్ ఆకట్టుకున్నాడు. పోసాని పాత్ర బాగుంది. అక్కడక్కడా ఆ పాత్ర నవ్విస్తుంది. ఐతే చివర్లో ఆ పాత్రను మరీ వెర్రి వెంగళప్పను చేసేశారు. నాజర్.. షాయాజి షిండే.. వీళ్లంతా ఓకే.

సాంకేతిక వర్గం: హిప్ హాప్ తమిళ పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. టైటిల్ సాంగ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశారు. ప్రతి సన్నివేశానికీ నేపథ్య సంగీతం బలంగా నిలిచింది. సినిమాలోని ఉత్కంఠను మరింత పెంచేలా పర్ఫెక్ట్ ఆర్.ఆర్ ఇచ్చారు హిప్ హాప్ తమిళ. పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం కూడా సినిమాకు అస్సెట్ అయింది. తమిళ వెర్షన్ కు.. తెలుగు వెర్షన్ కు తేడా ఇక్కడే కనిపిస్తుంది. విజువల్స్ మరింత రిచ్ గా ఉంటాయి. నిర్మాణ విలువలు కూడా గీతా ఆర్ట్స్ ప్రమాణాలకు తగ్గట్లుగా ఉన్నాయి. మిగతా సాంకేతిక విభాగాలు కూడా బాగా పని చేశాయి. వేమారెడ్డి డైలాంగ్స్.. సింపుల్ గా.. క్రిస్ప్ గా.. సన్నివేశాలకు తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడు సురేందర్ రెడ్డికి మాతృకను చెడగొట్టకపోవడంలోనే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. ఈ విషయంలో అతడి జడ్జిమెంట్ కు కితాబివ్వాలి. తమిళంలో పోలిస్తే తెలుగు వెర్షన్ మరింత స్టైలిష్ గా.. క్వాలిటీతో తెరకెక్కడంలో సురేందర్ రెడ్డి ప్రతిభ కనిపిస్తుంది.

చివరగా: ధృవ.. ‘శత్రువే’ అతడి బలం

రేటింగ్- 3/5