Begin typing your search above and press return to search.

ఆర్జీవీకి ఏపీ ప్రభుత్వ పెద్దలు వార్నింగ్ ఇచ్చారా..?

By:  Tupaki Desk   |   1 Feb 2022 5:30 AM GMT
ఆర్జీవీకి ఏపీ ప్రభుత్వ పెద్దలు వార్నింగ్ ఇచ్చారా..?
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా టికెట్ ధరల అంశం మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య కొన్ని రోజులు ఏపీ సర్కారును టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టారు.. మీడియాలో తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు.

ఏపీ ప్రభుత్వాన్ని కరోనా వైరస్ తో పోల్చడమే కాకండా.. సినిమా టికెట్ విషయంలో సర్కారు తీరును ఎండగట్టే ప్రయత్నం చేసారు ఆర్జీవీ. అంతేకాదు రేకుల షెడ్డు థియేటర్ - మల్టీఫ్లెక్స్ లలో సినిమా టికెట్స్ ఒకేలా ఉండాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కాకా హోటల్ - ఫైవ్ స్టార్ హోటల్ ధరలతో పోలుస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో లాజిక్స్ - ఎకనామిక్స్ మాట్లాడి మంత్రులను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.

ఓ రాత్రి వోడ్కా తాగుతూ వైయస్సార్సీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో పలు ప్రశ్నలు వేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సత్తా ఉంటే సీఎం జగన్ - సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్నినాని మరియు మిగతా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ - కొడాలి నాని కలిసి రాజమౌళి కంటే గొప్ప సినిమా తీయాలని.. దాన్ని పేద ప్రజలకు ఫ్రీగా చూపించాలని ప్రభుత్వం మీద సెటైర్స్ వేశారు వర్మ.

వైసీపీ పరిపాలన నచ్చలేదని ఓటేసిన వాడు అంటే వెంటనే మీరు దిగిపోతారా? అని వర్మప్రశ్నించారు. ఆర్జీవీ సంధించిన పది ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని స్పందించడంతో, ఒకానొక దశలో ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. ఈ క్రమంలో మంత్రి అపాయింట్మెంట్ ఇస్తే సినిమా టికెట్ అంశం మీద వివరణ ఇస్తానని చెప్పడం.. దీనికి పేర్ని నాని ఓకే అనడం వెంట వెంటనే జరిగిపోయాయి.

అమరావతిలో సినిమాటోగ్రఫీ మంత్రితో భేటీ అయిన ఆర్జీవీ.. సినిమా టికెట్ మీద తన వెర్షన్ కు ప్రభుత్వానికి వినిపించానని చెప్పారు. మంత్రి పేర్ని నానితో సమావేశం పూర్తిగా సంతృప్తికరంగా సాగిందని రాంగోపాల్ వర్మ మీడియాకు తెలియజేశారు. ఒక ఫిల్మ్ మేకర్‌‌ గా మాట్లాడడానికి వచ్చానని.. ఇతరులు ఏం మాట్లాడినా తనకు సంబంధం లేదని.. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిదని అన్నారు.

అయితే ఏపీ సర్కారుతో భేటీ తర్వాత రోజు కూడా టికెట్ ధరల అంశం మీద ట్వీట్లు పెట్టాడు వర్మ. RRR టిక్కెట్ ధరను రూ. 2200/-కి విక్రయించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.. అదే రాజమౌళి సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రూ. 200/-కి అమ్మడానికి కూడా అనుమతించకపోవడం 'కట్టప్పను ఎవరు చంపారు?' అనే అస్తిత్వ ప్రశ్నను లేవనెత్తుతుందని పేర్కొన్నారు.

దీంతో పేర్ని నానితో ఆర్జీవీ సమావేశం ఆశాజనకంగా జరగలేదేమో అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలో ఏపీ సర్కారుని సర్కార్ డైరెక్టర్ అంత ఈజీగా వదిలేలా లేడని అందరూ అనుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఆర్జీవీ అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మళ్ళీ ట్వీట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ పెద్దల నుంచి రాంగోపాల్ వర్మకు వారింగ్స్ వచ్చాయని.. అందుకే సైలెంట్ అయిపోయాడని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వివాదాస్పద దర్శకుడిగా పేరు పొందిన ఆర్జీవీ.. సాధారణంగా ఏ విషయాన్ని అంత సులభంగా వదిలి పెట్టడని అందరూ అంటూ ఉంటారు. సినీ రాజకీయాలను టార్గెట్ చేస్తూ తన అభిప్రాయాలను నిర్భయంగా నిక్కచ్చిగా చెప్పడం అనేక సందర్భాల్లో చూసాం. వారిని టార్గెట్ చేస్తూ సినిమాలు కూడా తీసిన సంగతి విధితమే. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ లోని పెద్దల వార్నింగ్ కి వెనక్కి తగ్గారని అనుకుంటున్నారు. మరి వర్మ సైలెంట్ వెనుక అసలు కారణం ఇదేనా లేదా ఇంకేమైనా ఉందా అనేది ఆయనకే తెలియాలి.