Begin typing your search above and press return to search.

చిరు తప్పు చేశారా? రూ.23 కోట్ల స్థలాన్ని రూ.3.8 కోట్లకే కొనేశారా?

By:  Tupaki Desk   |   1 May 2022 5:30 AM GMT
చిరు తప్పు చేశారా? రూ.23 కోట్ల స్థలాన్ని రూ.3.8 కోట్లకే కొనేశారా?
X
గడిచిన మూడు.. నాలుగు రోజులుగా ఒక వార్తాంశం ఒక వర్గం మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా పాత్రికేయం మారిన నేపథ్యంలో.. వివాదాలకు దూరంగా ఉండి.. తన పని తాను చేసుకునే మెగాస్టార్ చిరంజీవిపై కక్కుర్తి ఆరోపణలు చేయటం.. దానికి సంబంధించిన సాక్ష్యాల పేరుతో చూపిస్తున్న డాక్యుమెంట్లు.. లాంటి వాటితో అసలు నిజం ఏమిటన్న దానిపై 'తుపాకి' ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. తనకున్న పరిచయాలతో పాటు.. కొంతపాటి గ్రౌండ్ వర్కుచేసింది. ఇదంతా చూసిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఒకరిని టార్గెట్ చేసేందుకు మరొకరిని లక్ష్యంగా చేసుకునే వ్యూహాన్ని అమలు చేస్తుంటారు. తాజా ఎపిసోడ్ ఆ కోవకు చెందిందేనని చెప్పాలి.

జూబ్లీహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతంలో దగ్గర దగ్గర రూ.24 కోట్లు విలువైన భూమిని మెగాస్టార్ చిరంజీవి రూ.3.8 కోట్లకే సొంతం చేసుకున్నారా? ఇంత కక్కుర్తి పడ్డారా? దీనికి చాలానే పెద్ద తలకాయిల పాత్ర ఉందా? అన్న ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి.వీటికి సమాధానం వెతికితే.. తాజా ఆరోపణల్లో నిజం నలబై శాతం అయితే.. అబద్ధం అరవై శాతం ఉందని చెప్పాలి. ముందుగా ఉన్న ఆరోపణ.. జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో 595 గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నది. దీని విషయానికి వస్తే..

మెగాస్టార్ చిరంజీవికి జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 25లో ఫ్లాట్ నెంబరు 303-ఎన్ లో 3,333 గజాల స్థలంలో ఇల్లు ఉంది. దాన్ని అనుకొని ఉన్న వెనుక భాగంలో షేక్ పేట కొత్త సర్వే నంబరు 120లో హకీంపేట గ్రామంలోని సర్వే నెంబరు 102/1లో 595 గజాల స్థలం ఉంది. బహిరంగ మార్కెట్ లో దీని విలువ గజం రూ.4లక్షలకు పైనే. అయితే.. తాజాగా దీన్ని రూ.64 వేల చొప్పున రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో రూ.23.9 కోట్లు విలువ చేసే స్థలాన్ని కారుచౌకగా రూ.3.8కోట్లకే అప్పజెప్పారని.. కొంత భాగాన్ని సొసైటీలోని పెద్ద తలకాయలకు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటివరకు చెప్పిందంతా విన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి తప్పు చేసినట్లే కనిపిస్తుంది. కానీ.. అసలు విషయాన్ని చెప్పకుండా తమకు అనుకూలమైన వాదనను వినిపించేస్తూ కథనాలు వండేయటం చిరును దెబ్బ తీసే ప్రయత్నంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన పేరుమీద తాజాగా రిజిస్ట్రేషన్ జరిగిన 595 గజాలకు ఎలాంటి దారి లేదు. అంటే.. ప్రస్తుతం చిరంజీవి ఉన్నఇంటికి వెనుక ఉండే ఈ స్థలాన్ని చిరు తప్పించి మరెవరూ కొనలేరు. అలాంటి పరిస్థితి ఉంది.

ఇలాంటి వేళలో.. మార్కెట్ రేటు ప్రకారం కొనేందుకు తలకాయ మీద మెడకాయ ఉన్న వారెవరూ ఒప్పుకోరు. అందులోకి చిరంజీవికి 3333 గజాల్లో ఇల్లు ఉన్నప్పుడు.. తాజాగా వచ్చే 595 గజాలతో ఆయనకు ప్రత్యేకంగా కలిగే ప్రయోజనం లేదు. అలా అని.. దాన్ని వేరే వారికి అమ్మలేరు. ఇలాంటప్పుడు ఎంతకు కొన్నా చిరంజీవే కొనాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనమే ఉందామనుకుందాం. అప్పుడు ఎలా ఆలోచిస్తాం. ఎవరూ కొనలేని దాన్ని రూ.4 కోట్లకు (దగ్గర దగ్గర) కొనటమే ఎక్కువగా అనిపిస్తుంది. అలాంప్పుటు వార్తలు వండేసే వారు రూ.24 కోట్లు అని చెప్పినా లెక్కగానే తప్పించి వాస్తవంలో మాత్రం ఆ మొత్తానికి ప్రపంచంలో ఎవరూ కొనలేరు.

మరో ముఖ్యమైన విషయం ఏమంటే.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ మధ్యన పూర్తి అయినప్పటికీ.. దీనికి సంబంధించిన అగ్రిమెంట్.. ఇతర సాంకేతిక అంశాలన్ని ఏళ్ల కిందటే జరిగాయి.మరి.. ఇలాంటి విషయంలో చిరును ఎందుకు బద్నాం చేస్తున్నారంటే.. దీని వెనుక రెండు ప్రముఖ మీడియా సంస్థల శత్రుత్వమే కారణంగా చెబుతారు. అదేమంటే.. జూబ్లీహిల్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో రెండు బలమైన వర్గాలు ఉన్నాయి. అందులో ఒకటి 'ఎ' అయితే .. మరొకటి 'బి' వర్గం. మొన్నటి వరకు ఈ సొసైటీ ఒకరి అధిపత్యంలో ఉండేది. ఈ మధ్యన జరిగిన ఎన్నికల్లో అధికార బదిలీ చోటు చేసుకుంది. తాజాగా డీల్ పూర్తి అయ్యింది ప్రస్తుత సొసైటీతోనే.

అయితే.. దీనికి సంబంధించిన కసరత్తు.. ఇతరాలన్ని కూడా గతంలోనే జరిగాయి. ఆ మాటకు వస్తే గతంలో పవర్ లో ఉన్న వారు కూడా చిరంజీవికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పవర్ లో ఉన్న వారు డీల్ క్లోజ్ చేయటంతో.. వారి మీద ఉన్న శత్రుత్వంతో పాత బాడీకి చెందిన కొందరు చిరును బద్నాం చేసే ప్రయత్నంలో ఇప్పుడు అధికారంలో ఉన్న వారిని దెబ్బ తీయటం.. ఏదో తప్పు చేశారన్న భావన కలిగేలా చేస్తున్న పరిస్థితిగా చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే.. రెండు బలమైన వర్గాల మధ్య నడుస్తున్న అధిపత్య పోరులో చిరంజీవిని బలవంతంగా లాగి.. ఆయన్ను బద్నాం చేయటం ద్వారా.. ఇప్పుడున్న వారిని ఇరికించాలన్న ప్రయత్నం జరుగుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇద్దరు మీడియా అధిపతుల మధ్య నడుస్తున్న సొసైటీ అధిపత్య పోరును.. తెలివిగా చిరు మెడకు చుట్టేశారంటున్నారు.

దీంతో ఆయన్ను బద్నాం చేయటానికి సిద్ధంగా ఉండే వారు ఇప్పుడీ విషయాన్ని తెర మీదకు తెస్తున్నారన్న మాట వినిపిస్తోంది. అన్నింటికి మించి స్థలం రిజిస్ట్రేషన్ జరిగిన వైనంపై అభ్యంతరంతో పాటు.. దీన్ని ప్రభుత్వ స్థలంగా చెబుతున్నారు.అయితే.. ఈ వాదనలో అసలు వాస్తవమే లేదంటున్నారు. నిజంగానే ఈ భూమి ప్రభుత్వానిదైతే.. ఇంత వివాదం జరుగుతున్న వేళలో.. ప్రభుత్వ అధికారులు ఎంట్రీ ఇచ్చి.. ప్రభుత్వ స్థలమన్న బోర్డు పెట్టేసి ఉండేవారు కదా? అన్న క్వశ్చన్ వేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. లే ఔట్ స్థలాన్ని పరిశీలించకుండానే దీన్ని రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఈ ప్రచారంలోనూ నిజం పాళ్లు తక్కువగా చెబుతున్నారు. మొత్తంగా ఈ భూమి ఇష్యూలో చిరును వీలైనంతవరకు తప్పు చేసినట్లుగా ప్రచారం చేసే అవకాశమే ఎక్కువగా ఉందంటున్నారు. మరి.. మెగా క్యాంప్ ఈ అంశంపై ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.