Begin typing your search above and press return to search.

'గ‌ని' క్లైమాక్స్ కు అన్ని రోజులు ప‌ట్టిందా?

By:  Tupaki Desk   |   6 April 2022 2:30 AM GMT
గ‌ని క్లైమాక్స్ కు అన్ని రోజులు ప‌ట్టిందా?
X
'బాహుబ‌లి' త‌రువాత మ‌న తెలుగు సినిమాకు దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా వున్న ప్రేక్ష‌కులు మ‌న నుంచి సినిమా వ‌స్తోందంటే ప్ర‌త్యేక ఆస‌క్తిని చూపిస్తున్నారు. దీంతో మ‌న వాళ్లు కూడా స్టోరీ డిమాండ్ ని బ‌ట్టి ఎలాంటి ప్రయోగాలు చేయ‌డానికైనా వెనుకాడ‌టం లేదు. అంతే కాకుండా ఇందు కోసం ఎక్కువ స‌మ‌యంతో పాటు భారీ ఖ‌ర్చుకి కూడా వెనుకాడ‌టం లేదు. ప‌ర్ ఫెక్ష‌న్ కోసం ఎక్కువ టైమ్ తీసుకుని మ‌రీ ప‌క్కాగా పూర్తి ప‌ర్ ఫెక్ష‌న్ తో కీల‌క ఘ‌ట్టాల‌ని తెర‌కెక్కిస్తున్నారు.

'గ‌ని' టీమ్ కూడా క్లైమాక్స్ స‌న్నివేశాల కోసం స‌రిగ్గా ఇదే ప‌ని చేసింద‌ని తెలిసింది. వివ‌రాల్లోకి వెళితే.. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం 'గ‌ని'. బాక్సింగ్ డ్రామా నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రంలో హీరో బాక్స‌ర్ గా న‌టించారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుత‌న్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల చేస్తున్నారు. బాలీవుడ్ సుంద‌రి స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

సిద్దు ముద్ద‌తో క‌లిసి స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు బాబీ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ క్లైమాక్స్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం టీమ్ 60 రోజులు కేటాయించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ట్రిపుల్ ఆర్ లోని ఇంట‌ర్వెల్ సీన్ కోసం రాజ‌మౌళి దాదాపు 65 రోజుల‌ స‌మ‌యం తీసుకుంటే 'గ‌ని' క్లైమాక్స్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌కు 60 రోజులు కేటాయించ‌డం హాట్ టాపిక్ గా మారింది. క్లైమాక్స్ మొత్తం బాక్సింగ్ రింగ్ లోనే సాగుతుంద‌ట‌.

అయితే 30 రోజులు ప్ర‌త్యేక శిక్ష‌ణ కోసం కేటాయించిన చిత్ర బృందం ఆ త‌రువాత షూటింగ్ కోసం మ‌రో 30 రోజులు కేటాయించ‌డం విశేషం. ట్రిపుల్ ఆర్ త‌రువాత ఓ కీల‌క ఘ‌ట్టం చిత్రీక‌ర‌ణ కోసం 60 రోజులు కేటాయించిన చిత్రంగా 'గ‌ని' రికార్డు సాధించింద‌ని, హీరో వ‌రుణ్ ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకుని మ‌రీ న‌టించిన క్లైమాక్స్ ఘ‌ట్టాలు సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

హీరో వ‌రుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా నిల‌వ‌నున్న ఈ చిత్రంలోని క్లైమాక్స్ కోసం మొత్తం ఏడు ఫైట్ ల‌ని డిజైన్ చేశార‌ట‌. నాలుగు ఫైట్స్ బాక్సింగ్ రింగ్ లో వుండ‌గా, మ‌రో మూడు కామ‌న్ ఫైట్స్ గా చెబుతున్నారు.

హెవీ యాక్ష‌న్ సీన్స్ కార‌ణంగానే టీమ్ కి 30 రోజులు ట్రైనింగ్ కోసం, మ‌రో 30 రోజులు ఫైట్స్ షూటింగ్ కోసం ప‌ట్టింద‌ని, ఇవి సినిమాకు ప్ర‌ధాన హైలైట్స్ గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు. కాగా బాక్సింగ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం కోసం హీరో వ‌రుణ్ తేజ్ కంప్లీట్ స్పోర్ట్స్ మెన్ బాక్స‌ర్ గా త‌న‌ని తాను మార్చుకుని న‌టించ‌డం విశేషం.