Begin typing your search above and press return to search.

చిరంజీవికి జగన్ ఎలివేషన్ ఇచ్చినట్లేనా ?

By:  Tupaki Desk   |   11 Feb 2022 4:11 AM GMT
చిరంజీవికి జగన్ ఎలివేషన్ ఇచ్చినట్లేనా ?
X
చిరంజీవికి కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్ ఇవ్వటం ఏమిటని అనుకుంటున్నారా ? హీరోగా కాదులేండి సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా ఎలివేషన్ ఇచ్చినట్లే ఉంది. దాసరి నారాయణరావు తర్వాత పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరనే చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.

కొందరు చిరంజీవే అని ప్రచారం చేశారు కూడా. అయితే పరిశ్రమకు పెద్ద దిక్కంటు ఎవరు లేరని మోహన్ బాబు ప్రకటించారు. ఆ తర్వాత ఏదో సందర్భంగా మాట్లాడుతూ తాను పరిశ్రమకు పెద్ద దిక్కు కాదంటు స్వయంగా చిరంజీవే ప్రకటించుకున్నారు.

ఈ నేపధ్యంలోనే తాజాగా జగన్ తో పరిశ్రమ ముఖ్యుల సమావేశం తర్వాత చిరంజీవే పెద్ద దిక్కనే క్లారిటీ వచ్చినట్లుగా ప్రచారం మొదలైంది. పైగా జగన్ తో భేటీ అయిన మహేష్, ప్రభాస్, రాజమౌళి, నారాయణమూర్తి మాట్లాడుతూ చిరంజీవి చొరవ వల్లే సమస్యలు పరిష్కారమైనట్లు చెప్పారు. రాజమౌళి అయితే ఒకడుగు ముందుకేసి చిరంజీవిని పరిశ్రమకు పెద్దదిక్కుగా చెప్పేశారు. సమావేశం సందర్భంగా జగన్ మాట్లాడుతూ పరిశ్రమలోని సమస్యలు, పరిష్కారాలపై తనతో చిరంజీవి చాలాసార్లు మాట్లాడినట్లు చెప్పారు.

సో, జరుగుతున్నది చూసిన తర్వాత పరిశ్రమకు కొత్త పెద్దదిక్కు చిరంజీవే అంటూ ప్రచారం ఊపందుకుంది. నాగార్జున లాంటి సీనియర్లతో సన్నిహితం ఉండటం, జూనియర్లయిన మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వాళ్ళు కూడా చిరంజీవికే మద్దతుగా నిలబడేట్లున్నారు.

ఇక దర్శకుడు రాజమౌళి, కొరటాల శివతో పాటు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కూడా మద్దతుగానే ఉంటారు. కాబట్టి చిరంజీవి పెద్దదిక్కే అని అంటే మోహన్ బాబు లాంటి ఒకరిద్దరు తప్ప బాహాటంగా వ్యతిరేకించే వాళ్ళే ఉండరు.

నిజానికి సినీ పరిశ్రమకు పెద్దదిక్కనేది అదేమీ కిరీటం కాదు. ముళ్ళ కిరీటమనే చెప్పాలి. ప్రతి పంచాయతీ కూడా పెద్ద దిక్కు అన్న వాళ్ళ ముందుకే వస్తుంది. పంచాయతీకి వచ్చే వాళ్ళకు ముందు పెద్దదిక్కుగా వ్యవహరించే వ్యక్తిపై పూర్తి గౌరముండాలి. లేకపోతే పంచాయతీ ఎంతకీ తెగదు. పైగా పెద్దదిక్కుకు ఏమాత్రం మర్యాదివ్వరు. ఈ విషయం తెలుసు కాబట్టే పెద్దదిక్కనే బాధ్యత తనకొద్దంటు చిరంజీవి స్వచ్చంధంగా తప్పుకున్నారు.