Begin typing your search above and press return to search.

సర్కారు వారిని మైత్రీ మేకర్స్ పట్టించుకోవడం లేదా..?

By:  Tupaki Desk   |   23 April 2022 1:30 PM GMT
సర్కారు వారిని మైత్రీ మేకర్స్ పట్టించుకోవడం లేదా..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు చివరగా 2020 సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ''సర్కారు వారి పాట'' చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు.

పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

SVP సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. సమ్మర్ కానుకగా మే 12న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అంటే యూఎస్ ప్రీమియర్స్ పడటానికి 18 రోజులు మాత్రమే ఉంది.

అయితే సర్కారు వారి రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా మేకర్స్ అగ్రిసివ్ గా ప్రమోషన్స్ చేయడం లేదని సూపర్ స్టార్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

'సర్కారు వారి..' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ పతాకాలపై రూపొందిస్తున్నారు. ఈ సినిమాను సరైన రీతిలో ప్రమోట్ చేయడం లేదని మొదటి నుంచీ ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ ని ట్రోల్ చేస్తూ నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ తో పలుమార్లు ట్రెండ్ చేశారు కూడా. అయినప్పటికీ నిర్మాతల్లో చలనం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు వారాల్లో రిలీజ్ అయ్యే SVP సినిమాని వదిలేసి.. తర్వాత విడుదలయ్యే చిత్రాలని ప్రమోట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

మైత్రీ నిర్మాతలు ఆ మధ్య 'పుష్ప' సినిమాకు జోరుగా ప్రమోషన్స్ చేశారు.. జూన్ 10న వచ్చే 'అంటే.. సుందరానికీ!' చిత్రానికి కూడా దూకుడుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ మధ్యలో రాబోయే 'సర్కారు వారి..' ప్రమోషన్స్ ను పట్టించుకోవడం లేదనేది మహేశ్ అభిమానుల వాదన.

ఈ క్రమంలో 'పుష్ప' మరియు 'అంటే సుందరానికి' చిత్రాలు మైత్రీ నిర్మాతల సోలో ప్రొడక్షన్స్ కావడంతో.. వాటిపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని.. SVP లో 14 రీల్స్‌ ప్లస్ వారితో సహ నిర్మాతలుగా ఉన్నారు కాబట్టే సినిమాను ప్రమోట్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదనిపిస్తోందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

'శ్రీమంతుడు' సినిమాతో తమ నిర్మాణ సంస్థను విజయవంతంగా లాంచ్ చేసిన మహేష్ బాబు మూవీ పట్ల ఇలా వ్యవహరించడం తగదని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా ఇక నుంచైనా 'సర్కారు వారి పాట' సినిమాని అగ్రిసివ్ గా ప్రమోట్ చేయాలని మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇప్పటి వరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ బజ్ క్రియేట్ చేసింది కాబట్టి.. రాబోయే రోజుల్లో బాగా ప్రమోట్ చేస్తే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ గ్యారంటీ అని MB అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మహేష్ సినిమాకు ప్రమోషన్స్ అవసరం లేదని.. ఆయన పేరే జనాలను థియేటర్లకు నడిపిస్తుందని అంటున్నారు.