Begin typing your search above and press return to search.

నిహారిక తప్పు చేసిందా? తేలకుండా ఈ బురద జల్లుడేంది?

By:  Tupaki Desk   |   4 April 2022 4:35 AM GMT
నిహారిక తప్పు చేసిందా? తేలకుండా ఈ బురద జల్లుడేంది?
X
పబ్ లో డ్రగ్స్ వినియోగం జరుగుతుందన్న పక్కా సమాచారంతో భారీ ప్లాన్ వేసి మరీ లోపలకు వెళ్లిన టాస్కు ఫోర్సు పోలీసులు షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చేలా చేశారు. ఆ విషయంలో వారిని అభినందించకుండా ఉండలేం. కానీ.. ఆ క్రమంలో పడిన తప్పటడుగుల గురించి ఎవరూ మాట్లాడకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్న. పబ్ లో తనిఖీలు.. అక్కడ కొందరు డ్రగ్స్ వినియోగించిన విషయం వెల్లడి కావటం.. దాని సంగతి తేల్చేందుకు అందరిని పోలీస్ స్టేషన్ కు తరలించటం.. అది కాస్తా సంచలనంగా మారింది. ఇక.. స్టేషన్ కు తరలించిన మిగిలిన వారిలో సెలబ్రిటీలుగా ఉన్న ఇద్దరు.. ముగ్గురు కనిపించటంతో మీడియాలో అది హైలెట్ అయ్యింది.

నాగబాబు కుమార్తె నిహారిక పేరు రావటం.. దీంతో మీడియా అటెన్షన్ పెరిగింది. ఈ కేసు సంచలనంగా మారింది. ఇదంతా నాణెనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు.. నిజంగానే నిహారిక డ్రగ్స్ వినియోగించారా? లేదా? అన్నది ప్రశ్న.

ఆ విషయంలో ఆమె ఎలాంటి తప్పు చేయకుంటే.. ఆమెకు జరిగిన డ్యామేజ్ ను బాధ్యత ఎవరు వహిస్తారు? తప్పు చేయకుండానే తప్పు చేసిన భావన కలిగించేలా పోలీసుల చర్యను ప్రశ్నించాల్సిన అవసరం లేదా? అన్నది మరో ప్రశ్న. అయితే.. ఇలాంటివేమీ జరగలేదు. నాగబాబు కుమార్తె నిహారిక.. మరికొందరు ప్రముఖులు పబ్ లో ఉన్నారన్న విషయం బయటకు రాగానే మీడియాలో దాన్ని హైలెట్ చేసేశారు.

తప్పు చేశారా? లేదా? అన్నది పట్టించుకోకుండా బుదర జల్లటమే పనిగా పెట్టుకున్నట్లుగా వ్యవస్థలు పని చేయటం ఏమిటి? డ్రగ్స్ వినియోగం పబ్ లో జరిగిందన్న విషయం అర్థమయ్యాక.. దాన్ని వినియోగించిన వారెవరు? అన్నది ముఖ్యం కదా? అది వదిలేసి.. తనిఖీల పేరుతో వంద మందికి పైనే స్టేషన్ కు తీసుకొచ్చేసి.. వారిని గంటల తరబడి అలానే ఉంచేయటం ఏమిటి? ఈ వార్తల్ని అడ్డుపెట్టుకొని డ్రగ్స్ క్వీన్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లు పెట్టేసి బుదర జల్లటం దేనికి నిదర్శనం? మనలోని వికారాల్ని ఎదుటోడి మీద నెట్టేయటం సరైన పద్దతా? అన్నది మరో ప్రశ్న.

ఒక ప్రదేశంలో నేరం జరిగినప్పుడు.. ఆ ప్రదేశంలో ఉన్న వారంతా నేరస్తులు అయిపోరు. కేవలం అనుమానితులు మాత్రమే అవుతారు. రాడిసన్ బ్లూ పబ్ ఎపిసోడ్ విషయంలో.. అక్కడున్న వారంతా అనుమానితులు అనే కన్నా.. నేరం జరిగిన ప్రాంతంలో ఉన్న వారు మాత్రమే అవుతారు. ఇలాంటి వారికి కూడా హక్కులు ఉంటాయన్నది మర్చిపోకూడదు.

కానీ.. అదేమీ పట్టనట్లుగా.. నిహారికతో పాటు మరికొందరు ప్రముఖుల పిల్లల పేర్లను ప్రస్తావించి.. ఏదో జరిగిన భావన కలిగేలా చేయటం దేనికి నిదర్శనం? నిహారిక తప్పు చేసిందా? లేదా? అన్నది ఎప్పటికో తేలనుంది. కానీ.. ఆమెకు శిక్ష మాత్రం ఇప్పుడే పడిపోయింది. ఇదంతా చూసినప్పుడు ఇదెక్కడి న్యాయం? అన్న సందేహం మదిలో మెదలక మానదు.