Begin typing your search above and press return to search.

ఇన్ని పేర్లెందుకయ్యా క్రిష్!

By:  Tupaki Desk   |   6 Oct 2018 7:35 AM GMT
ఇన్ని పేర్లెందుకయ్యా క్రిష్!
X
దర్శకుడు క్రిష్ సినిమాల పరంగానే కాదు చాలా రకాలుగా ప్రత్యేకతను సంతరించుకుంటున్నాడు. 2019 జనవరి ఒకే నెలలో కథానాయకుడు-మహానాయకుడు-మణికర్ణిక సినిమాల విడుదలతో ఎవరికి సాధ్యం కానీ ఒక అరుదైన ఘనతను అందుకోబోతున్న క్రిష్ తన పేరు విషయంలో మాత్రం కొంత అయోమయానికి గురవుతున్నట్టు కనిపిస్తుంది. సాధారణంగా క్రిష్ టైటిల్ కార్డ్స్ తన పూర్తి పేరు ను వేసుకోడు. గౌతమిపుత్ర శాతకర్ణి దాకా క్రిష్ అనే ఉంటుంది.

కానీ మణికర్ణిక ట్రైలర్ ప్రమోషన్స్ లో రాధాకృష్ణ జాగర్లమూడి అని పూర్తి పేరు ఉపయోగిస్తుండగా మనవైపు ఎన్టీఆర్ పోస్టర్లలో క్రిష్ జాగర్లమూడి అని పెట్టిస్తున్నారు. ఇంటి పేరు రెండిట్లో ఉన్నా రాధాకృష్ణ అనే పూర్తి పేరు మణికర్ణికలో ఉంటే బయోపిక్ లో క్రిష్ అనే కనిపిస్తోంది. ఇది క్రిష్ సూచనల మేరకు జరిగిందా లేక ఎవరికి వారు నిర్మాతలు క్రిష్ పేరుని అలా వేసుకున్నారా అనేది ఆయనకే తెలుసు.

దీనిని ప్రస్తావించడానికి కారణం లేకపోలేదు. ఇలా ఒక బాషలో క్రిష్ అని మరోభాషలో రాధాకృష్ణ అని వేసుకుంటే ఇద్దరు వేర్వేరు అని నార్త్ ప్రేక్షకులు భావించే అవకాశం ఉంది. అలాంటప్పుడు మూడు భారీ సినిమాలు ఒకే నెలలో విడుదలైన రికార్డు గురించి అందరికి అవగాహన రాదు. మన ప్రేక్షకులకు సమస్య లేదు. క్రిష్ అన్నా రాధాకృష్ణ అన్నా అర్థం చేసుకుంటారు. కానీ హిందీ ఆడియన్స్ కు క్రిష్ కొత్త. టాగోర్ రీమేక్ గబ్బర్ తో పరిచయమైనప్పటికీ దానికి మాత్రం క్రిష్ అని ఉంటుంది. దీని బదులు అన్నిచోట్లా ఒకేపేరు పెట్టొచ్చుగా అని కోరుతున్నారు అభిమానులు.

ఎన్టీఆర్ రెండు భాగాల షూటింగ్ తో పాటు మణికర్ణిక పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో క్రిష్ తలమునకలై ఉన్నాడు. ఇవి కాకుండా వరుణ్ తేజ్ అంతరిక్షంలో కూడా క్రిష్ నిర్మాణ భాగస్వామి. అది కూడా డిసెంబర్ విడుదల టార్గెట్ పెట్టుకుంది. ఇలాంటి ఒత్తిడి వృత్తిలో సహజమే కానీ ఈ పేర్ల సంగతి క్రిష్ తేల్చేస్తే బెటర్.