Begin typing your search above and press return to search.

దిల్ రాజు జడ్జిమెంట్ అదిరిందిగా..

By:  Tupaki Desk   |   6 Sep 2016 5:30 PM GMT
దిల్ రాజు జడ్జిమెంట్ అదిరిందిగా..
X
దిల్ రాజు నిర్మాతగా కంటే.. డిస్ట్రిబ్యూటర్ గా బిజీ. ఏటా కనీసం అరడజను సినిమాల్నయినా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడాయన. ఐతే ఆయన ఎంచుకునే సినిమాల లెక్క వేరుగా ఉంటుంది. కొన్నిసార్లు పెద్ద సినిమాలపై కర్చీఫ్ వేస్తారు.. కొన్నిసార్లు చిన్న-మీడియం సినిమాలపై ఫోకస్ పెడతారు. ఐతే పెద్ద సినిమాల విషయంలో వేలం వెర్రిగా వెంటపడే తరహా కాదు రాజు. అన్నీ లెక్కలు బేరీజు వేసుకుని పెట్టుబడి పెడుతుంటాడు రాజు. తాజాగా ఆయన ‘జనతా గ్యారేజ్’ హక్కుల కోసం భారీ రేటు పెట్టారు. రూ.15 కోట్లు పెట్టి నైజాం ఏరియా రైట్స్ తీసుకున్నారు. ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ ఏరియాకు ఇది అత్యధిక రేటు. ఇది చూసి రాజు రిస్క్ చేస్తున్నారేమో అనుకున్నారు.

కానీ దిల్ రాజు లెక్క తప్పలేదు. ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే రూ.13.5 కోట్ల దాకా షేర్ రాబట్టడం విశేషం. తొలి రోజే రూ.5.5 కోట్ల దాకా వసూలయ్యాయి నైజాం ఏరియాలో. తర్వాతి నాలుగు రోజుల్లోనూ కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. సగటున రూ.2 కోట్ల చొప్పున కలెక్షన్లు వచ్చాయి. దీంతో సోమవారం నాటికే సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరువగా వచ్చేసింది. రెండో వీకెండ్ అయ్యేసరికి రాజు లాభాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాతో మరోసారి దిల్ రాజు జడ్జిమెంట్ స్కిల్స్ ఏంటన్నది రుజువైంది. ఆయన భారీ పెట్టుబడి పెట్టినా అంచనా సరిగ్గానే ఉంటుందంటూ చర్చించుకుంటున్నారు ఇండస్ట్రీలో. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా ‘జనతా గ్యారేజ్’ బాగానే ఆడుతోంది. బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.