Begin typing your search above and press return to search.

దిల్ రాజు.. రైటర్ అయ్యాడు

By:  Tupaki Desk   |   23 July 2018 6:37 AM GMT
దిల్ రాజు.. రైటర్ అయ్యాడు
X
దిల్ రాజు నిర్మాతగా.. డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే అందరికీ తెలుసు. ఐతే ఆయన ఈసారి రైటర్ అవతారం కూడా ఎత్తాడట. తన ప్రొడక్షన్లో రాబోతున్న కొత్త సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’లో రచనలో ఆయన కూడా భాగం అయ్యాడట. ఈ విషయాన్ని దిల్ రాజే స్వయంగా వెల్లడించాడు. గత ఏడాది సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘శతమానం భవతి’ పెద్ద హిట్టయ్యాక ఏం సినిమా చేద్దామని అతడిని అడిగితే.. పెళ్లి మీద చేద్దాం అన్నాడట. ఒక లైన్ అనుకున్న తర్వాత తాను తిరుమలకు వెళ్లానని.. అక్కడ శ్రీవారి ఆలయంలో ఉన్నపుడు ఈ సినిమాకు సంబంధించి తనకు ఆలోచనలు తన్నుకొచ్చాయని రాజు చెప్పాడు. చాలా ఎగ్జైట్ అయిన తాను గుడి నుంచి బయటికి వచ్చాక వెంటనే సతీశ్ కు ఫోన్ చేసి తన ఆలోచనలు చెప్పినట్లు రాజు వెల్లడించాడు.

తనతో పాటు ఇద్దరు అసిస్టెంట్లు.. సతీశ్ తో పాటు ఇంకో ఇద్దరు అసిస్టెంట్లు కలిసి చాలా రోజుల పాటు చర్చించుకుని ఈ కథను ఒక కొలిక్కి తెచ్చినట్లు రాజు వెల్లడించాడు. ఒక వ్యక్తి జీవితంలో పుట్టుక.. చావు గురించి అతడికి తెలియదని.. కేవలం పెళ్లి మాత్రమే సంతోషంగా చేసుకుంటాడని.. దాని విశిష్టతను సినిమాలో చెబుతున్నామని రాజు చెప్పాడు. తాను తన కూతురు పెళ్లి చేశానని.. అలాగే తన మనవడు పుట్టినపుడు చాలా సంతోషించానని.. భార్య చనిపోయినపుడు చాలా బాధపడ్డానని.. ఈ మూడు ఉదంతాల నేపథ్యంలో కథ ఉండాలని ఐడియా ఇచ్చి ఈ కథ తయారు చేయించానని రాజు తెలిపాడు. ఒక సందర్భంలో రాజు మాట్లాడుతూ.. ‘మేం ఎంత రాసినప్పటికీ..’ అనే మాటను వాడటం విశేషం. అంటే ఆయన ఈ సినిమాతో రైటర్ అయిపోయినట్లే స్పష్టంగా చెబుతున్నాడన్నమాట.