Begin typing your search above and press return to search.

లైఫ్ లో అన్నీ చూసే వచ్చాను: దిల్ రాజు

By:  Tupaki Desk   |   17 July 2022 4:45 AM GMT
లైఫ్ లో అన్నీ చూసే వచ్చాను: దిల్ రాజు
X
నిర్మాతగా దిల్ రాజుకి గల అనుభవాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. కథాకథనాలపై ఆయనకి మంచి అవగాహన ఉంది. ఆయన అంచనాలు తప్పిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా ఆయన నిర్మించిన 'థ్యాంక్యూ' ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజాగ్ లో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ .. "నేను సినిమాల్లో రావడానికి ముందు నుంచి నాకు వైజాగ్ తో అనుబంధం ఉంది. ఈ కథను వినగానే నా జర్నీని నేను చెక్ చేసుకున్నాను.

నా వయసు ఇప్పుడు 51 .. చాలావరకూ జీవితాన్ని చూసివచ్చినవాడిని నేను. మనం రోజూ ఓ పదిసార్లైనా 'థ్యాంక్స్ అనే పదం వాడతాము. జీవితంలో మనం ఎప్పటికప్పుడు ఎదుగుతూ వస్తాము. అలా నేను ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే 50 సినిమాలను పూర్తిచేశాను. ఒక సాధారణ కుటుంబం నుంచి నేను ఇక్కడి వరకూ రావడానికీ .. ఇంతటి గౌరవాన్ని సంపాదించుకోవడానికి వెనుక ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరికీ నేను థ్యాంక్స్ చెబుతున్నాను. నా ఫెయిల్యూర్స్ లో అండగా నిలిచిన నా వైఫ్ అనితకి థ్యాంక్స్ చెబుతున్నాను.

'దిల్' నుంచి ఈ రోజు వరకు ఇండస్ట్రీలోని దర్శకులు .. స్టార్ హీరోలు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేశారు. ప్రభాస్ .. ఎన్టీఆర్ .. మహేశ్ .. చరణ్ .. బన్నీ .. పవన్ .. నాని .. చైతూ .. ఇలా చెప్పుకుంటూపోతే ఎంతోమంది హీరోలు నా ఎదుగుదలకి కారణమయ్యారు. నన్ను ఇక్కడి వరకూ తీసుకుని వచ్చారు. వాళ్లందరికీ ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా చూసిన తరువాత నా ఎమోషన్ మీకు అర్థమవుతుంది.

ఈ సినిమా ఒక అందమైన ప్రేమకథ. కాలేజ్ స్టోరీ ఉంటుంది .. లైఫ్ స్టోరీ ఉంటుంది. మూడు వేరియేషన్లలో చైతూ ఈ సినిమాలో కనిపిస్తాడు. ఇలాంటి ఒక సినిమాలకి పాటలను .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను తమన్ మాత్రమే బాగా చేయగలడు. మంచి ఫీల్ ఉన్న సినిమాలు ఎక్కువ రోజులు నిలబడతాయి. విక్రమ్ ఈ సినిమాను ఒక అందమైన పెయింటింగ్ మాదిరిగా తీర్చిదిద్దగలిగాడు. ముగ్గురు హీరోయిన్స్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ. మూడేళ్ల మా కష్టం ఈ నెల 22న .. సరసమైన ధరలోనే ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది" అంటూ చెప్పుకొచ్చారు.