Begin typing your search above and press return to search.

టికెట్ల రేట్లపై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   20 May 2022 3:29 AM GMT
టికెట్ల రేట్లపై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
X
దేశం మొత్తంలో తెలుగు ప్రేక్షకులకు ఉన్నంత సినిమా అభిమానం ఇంకెవరికీ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. కొత్త సినిమా రిలీజైతే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే యువత.. వారాంతంలో ఇంట్లో వాళ్లంతా కలిసి కొత్త సినిమా చూడాలనుకునే ఫ్యామిలీస్ చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉంటాయి. కానీ ఈ మధ్య థియేటర్లకు వచ్చి సినిమా చూసే జనాల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్నారు.

దీనికి కొవిడ్‌తో పాటు బాగా పెరిగిపోయిన టికెట్ల ధరలు కూడా కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో సాధారణ స్థాయిలోనే రేట్లు బాగా పెరిగిపోగా.. పెద్ద సినిమాలకు అదనంగా వడ్డించేస్తు్నారు. ఆంధ్రాలోనూ ఇటీవలే రేట్లు పెరిగాయి. పెద్ద సినిమాలకు ఈ వడ్డింపు తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ఫుట్ ఫాల్స్ అంతకంతకూ తగ్గిపోతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. టాలీవుడ్ నిర్మాతలు అత్యాశకు పోవడంతో అసలుకే మోసం వస్తోందన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ విషయమై స్పందించారు. ప్రధానంగా దిల్ రాజు రిలీజ్ చేసిన సినిమాలకు నైజాంలో రేట్లు ఎక్కువగా పెంచారనే విమర్శలపై ఆయన స్పందించారు. తాను ఒక బ్రాండ్ కాబట్టి తన ద్వారా రిలీజైన సినిమాలకు తానే రేట్లు పెంచారని అందరూ అనుకుని తనను నిందించారని.. కానీ ఆ సినిమాలకు నిర్మాత, హీరో ఉంటారని, వాళ్లు కూడా నిర్ణయంలో భాగమై ఉంటారని ఎవరూ ఎందుకు ఆలోచించరని రాజు ప్రశ్నించారు.

ఆరు నెలలుగా తాను సినిమాల పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నానని.. ఒక వర్గం ప్రేక్షకులకు థియేటర్లకు దూరం అవుతున్నారని స్పష్టంగా తెలుస్తోందని, ఇందుకు టికెట్ల ధరలు కూడా పరోక్షంగా ఒక కారణం కావచ్చని రాజు అభిప్రాయపడ్డారు. దీనిపై ఇండస్ట్రీ ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇక తన నిర్మాణంలో తెరకెక్కిన 'ఎఫ్-3' సినిమాకు రీజనబుల్ రేట్లే ఉంటాయని.. అదనంగా పెంపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రీమియం మల్టీప్లెక్సుల్లో 250 ప్లస్ జీఎస్టీ, మిగతా మల్టీప్లెక్సుల్లో జీఎస్టీతో కలిపి 250 రేటు ఉంటుందని.. సింగిల్ స్క్రీన్లలో సాధారణ రేట్లు కొనసాగుతాయని చెప్పారు.