Begin typing your search above and press return to search.

గ‌ళ్ల చొక్కాయ్ 'మ‌హ‌ర్షి' ఏంటి క‌థ‌?

By:  Tupaki Desk   |   7 March 2019 4:35 AM GMT
గ‌ళ్ల చొక్కాయ్ మ‌హ‌ర్షి ఏంటి క‌థ‌?
X
హిట్టు సినిమాలు వ‌చ్చిన నెల `మే`! అంటూ సెంటిమెంటు సెంటు కొట్టారు రాజు గారు... `మ‌హ‌ర్షి`కి ఈ సెంటిమెంట్ వ‌ర్క‌వుట‌వుతుందా? జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి .. మ‌హాన‌టి - ఆర్య `మే`లోనే రిలీజ్ కి వ‌చ్చాయ‌ని సెంటిమెంటును రాజేసే ప్ర‌య‌త్నం చేశారు దిల్ రాజు. రిలీజ్ తేదీ మారింద‌ని.. మే9 ఫిక్స్ చేసామ‌ని ప్ర‌క‌టిస్తూనే ఆయ‌న ఈ సెంటిమెంటును తెర‌పైకి తేవ‌డం వెన‌క లాజిక్ ఏంటో? హిట్టు కొట్టాలంటే హిట్టు సినిమాలొచ్చిన నెల‌లో రిలీజ్ చేస్తే స‌రిపోతుందా? ఇత‌ర క్యాలిక్యులేష‌న్ ఏదీ ఉండ‌దా? విక్ర‌మార్కా తెలిసీ జ‌వాబు చెప్ప‌క‌పోయావో నీ బుర్ర వెయ్యి చెక్క‌ల‌గును!!

మే నెల అంటేనే మండే ఎండ‌ల మంట అని అర్థం. పైగా ప‌రీక్ష‌ల గోల పూర్తిగా తొల‌గిపోదు. పైపెచ్చు ఎల‌క్ష‌న్ హీట్ కూడా రాజుకుంటోంది. మే తొలి వారంలోనే ఎల‌క్ష‌న్ ఉంటుంది. అది అయిపోయాకే మ‌హ‌ర్షిని తెస్తున్నాం.. అప్ప‌టికి పిల్ల‌ల ప‌రీక్ష‌లు అయిపోతాయ‌ని రాజుగారు కొత్త సూక్తి చెప్పారు. అయితే స‌రిగ్గా ఆ హ‌డావుడి పూర్తిగా మే తొలి వీకెండ్ నాటికే అయిపోయింద‌ని చెప్ప‌లేం. పార్ల‌మెంట్ ఎన్నిక‌లు అనంత‌రం ఏపీ హీటెక్కే స‌న్నివేశాలు చాలానే ఉన్నాయి. మార్చి నెల‌లోనే బెజ‌వాడ నుంచి వైజాగ్ వ‌ర‌కూ.. వైజాగ్ నుంచి తిరుప‌తి వ‌ర‌కూ అగ్నిగుండం మండుతోంది. అంటే ఏప్రిల్ - మేలో ఈ ఎండ‌లు ఎంత పీక్స్ కి చేర‌తాయో ఊహించ‌న‌ల‌వి కావు. అంటే సాయంత్రం చ‌ల్ల‌బ‌డ్డాక ఫ‌స్ట్ షోకి ప్లాన్ చేసే ఆడియెన్ పైనే ఆశ‌ల‌న్నీ అన్న మాట‌. ఇక‌పోతే మెట్రో సిటీల్లో త‌ప్ప టూటైర్ సిటీల్లో ఎక్కడా స‌రైన ఏసీ థియేట‌ర్లు కూడా లేని స‌న్నివేశం ఏపీ - నైజాంలో ఉంది. అందువ‌ల్ల ఆడియెన్ థియేట‌ర్ల‌కు ఎగేసుకొస్తార‌ని చెప్ప‌లేం. అస‌లే ఉక్క‌పోత‌.. ఆపై ఎండ‌ల బెంబేలు అన్న స‌న్నివేశం ఉంటుంది. దీనికి తోడు ఏ కాలేజ్ విద్యార్థికి ఎప్పుడు ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు ఉంటాయో చెప్ప‌లేని స‌న్నివేశం ఎన్నిక‌ల వ‌ల్ల ఉంటుంది.

ఇప్ప‌టికే ఏపీలో అధికార‌మే ల‌క్ష్యంగా.. అధికార‌ప‌క్షం- ప్ర‌తిప‌క్షం మ‌ధ్య వార్ ప‌రాకాష్ట‌కు చేరుకుంది. ఈ యుద్ధం పెను ప్ర‌కంప‌నాల‌కు తావిచ్చేట్టే క‌నిపిస్తోంది. ఇన్నేళ్ల‌లో తెలుగు రాష్ట్రాల్లో ఏనాడూ లేని కొత్త వార్ రాజ‌కీయాల్లో క‌నిపిస్తోంది. అందువ‌ల్ల ఏదీ స‌వ్యంగా కుదిరేట్టు క‌నిపించ‌డం లేదని విశ్లేషిస్తున్నారు. ఈ ఎండ‌ల్లో సినిమాల రాక అంతగా క‌లిసొస్తుందా? అంటే ట్రేడ్ లోనూ సందేహం క‌నిపిస్తోంది. ఇక మ‌హ‌ర్షి క‌థ విష‌యానికి వ‌స్తే.. పోకిరి - శ్రీ‌మంతుడు లైన్ లో క‌థ ఉంటుంద‌ని రాజుగారు అన్నారు.. దీంతో అస‌లేంటి క‌థ‌? పాత క‌థ‌ల్ని తిప్పి తీస్తే చూస్తారా? ఎన్నారై.. స్నేహం.. రైతు అంటూ సెంటిమెంటును రాజేస్తే స‌రిపోతుందా? రాజుగారి లెక్క‌లేంటి? అంటూ ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. మాస్ .. ఫ్యామిలీల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించిన సినిమాల్ని స్ట‌డీ చేసి ఈ సినిమా తీశారా? ఆ జోన‌ర్ లోనే ఉండాలి అని వంశీతో క‌లిసి రాజుగారు లెక్క‌లు వేసారా? అంటూ మాట్లాడుకుంటున్నారు. క్రియేటివ్ ఒరిజిన‌ల్ స్ట‌ఫ్ ఉంట‌నే జ‌నాద‌ర‌ణ ద‌క్కుతున్న రోజులివి. అలాంటిది ఇలా తిప్పి తీస్తే క‌ష్ట‌మేమో! అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. జెంటిల్‌ మేన్ రేంజు యాక్ష‌న్ తో చూపించాల్సిన `ఎవ‌డు` చిత్రాన్ని తేలిగ్గా తీసిపారేసింది ఇదే కాంబో. వంశీ పైడిప‌ల్లి ఆ సినిమా యాక్ష‌న్ ని హై రేంజులో ప్లాన్ చేస్తే రాజుగారు బ‌డ్జెట్ ప‌రిమితులు విధించ‌డంతో యాక్ష‌న్ సీన్స్ తేలిపోయాయి. కానీ ఈసారి `మ‌హ‌ర్షి` విష‌యంలో రాజీకి రాకుండా తెర‌కెక్కిస్తున్నామ‌ని రాజుగారు అన్నారు. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.