Begin typing your search above and press return to search.

టికెట్ల పెంపుపై మంట పుట్టిస్తున్న‌ దిల్ రాజు మాట!

By:  Tupaki Desk   |   8 May 2019 5:30 PM GMT
టికెట్ల పెంపుపై మంట పుట్టిస్తున్న‌ దిల్ రాజు మాట!
X
అభిమానాన్ని ఆదాయంగా మార్చుకోవ‌టం త‌ప్పు కాదు. కానీ.. శృతిమించిన రీతిలో టికెట్ల ధ‌ర‌ల్ని పెంచేయ‌టంపై పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను ముందే గ‌మ‌నించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి టికెట్ల పెంపున‌కు తాము ఎలాంటి అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేయ‌టం దీనికి నిద‌ర్శ‌నంగా చెప్పాలి. ఇదిలా ఉంటే.. భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన చిత్రాలు స‌రైన వ‌సూళ్లు సాధించాలంటే థియేట‌ర్ యాజ‌మాన్యాలు టికెట్ల ధ‌ర‌లు పెంచ‌క త‌ప్ప‌టం లేదంటూ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు అభిప్రాయంపై ఇప్పుడు మండిపాటు వ్య‌క్త‌మ‌వుతోంది.

పైడిప‌ల్లి వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌హ‌ర్షి సినిమా రేపు (గురువారం) ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. దాదాపు రెండు వేల‌కు పైగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న ఈ సినిమా టికెట్ల ధ‌ర‌ల్ని రెండు వారాల‌పాటు పెంచుతూ కోర్టు నుంచి అనుమ‌తి తీసుకున్నారు.

ప్ర‌స్తుతం సినిమా అంటే నాలుగు రోజుల ముచ్చ‌టేన‌ని.. ఆ నాలుగు రోజుల్లోనే పెట్టిన పెట్టుబ‌డి వెన‌క్కి ర‌ప్పించుకోవాల్సి వ‌స్తోంద‌ని.. అందుకే ధ‌ర‌లు పెంచిన‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ‌లోనే కాదు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ టికెట్ల ధ‌ర‌లు పెంచిన‌ట్లు వెల్ల‌డించారు. భారీ బ‌డ్జెట్ అంటున్న దిల్ రాజు.. ఆ బ‌డ్జెట్ మాట‌కు అర్థం చెప్పాలంటున్నారు. ఎడాపెడా ఖ‌ర్చులు పెట్టేసి.. ఖ‌ర్చు పెరిగింది కాబ‌ట్టి.. దాని భారం ప్రేక్ష‌కుల మీద అన‌టంలో ఏ మాత్రం స‌రికాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

హీరోల మీద ప్ర‌జ‌ల్లో ఉండే అభిమానాన్ని సొమ్ము చేసుకునేలా నిర్మాత‌ల తీరు ఉందే త‌ప్పించి.. మ‌రింకేమీ కాదంటున్నారు. హీరోల రెమ్యున‌రేష‌న్లు భారీగా పెంచేస్తున్నార‌ని.. ఆ భారం ప్రేక్ష‌కుడి మీద వేయ‌టంలో అర్థం లేదంటున్నారు. ఈ ధోర‌ణి ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని.. ఇలా పెంచుకుంటూ పోవ‌టం ఏ మాత్రం మంచిది కాదన్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. టికెట్ల ధ‌ర‌ల పెంపును స‌మ‌ర్థిస్తున్న దిల్ రాజు మాట‌లు స‌గటు ప్రేక్ష‌కుల‌కు మంట పుట్టిస్తున్నాయి.

తాజా ధ‌ర‌ల పెంపు కార‌ణంగా.. కుటుంబం మొత్తం సినిమాకు వెళ్లాలంటే దాదాపు రూ.300 వ‌ర‌కు అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని.. ఒక్కో కుటుంబానికి త‌క్కువ‌లో త‌క్కువ రూ.1200 వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని. ఇలా అయితే చిన్న సినిమాల మీద ప్ర‌భావం ప‌డుతుందంటున్నారు. త‌మ వ్యాపారం త‌ప్పించి.. ఇండ‌స్ట్రీ మంచిచెడ్డ‌ల గురించి ఆలోచించే వారు క‌ర‌వు అవుతున్నార‌ని.. దానికి నిద‌ర్శ‌న‌మే తాజా టికెట్ల ధ‌ర‌ల పెంపు అన్న మాట వినిపిస్తోంది.