Begin typing your search above and press return to search.

ఆర్య సినిమా.. ఒక్క రోజులో 46 షాట్లు

By:  Tupaki Desk   |   28 Feb 2016 9:30 AM GMT
ఆర్య సినిమా.. ఒక్క రోజులో 46 షాట్లు
X
ఒక పెద్ద నిర్మాత.. ఒక కొత్త దర్శకుడిని నమ్మి పెట్టుబడి పెట్టడమంటే చిన్న విషయం కాదు. అతడి టాలెంటు మీద బలమైన నమ్మకం ఏర్పడితే తప్ప అవకాశం ఇవ్వడం కష్టం. కేవలం మంచి కథ తయారు చేసి.. దాన్ని బాగా నరేట్ చేసినంత మాత్రాన నిర్మాతకు ఆ భరోసా వచ్చేస్తుందనడానికేమీ లేదు. ఆ దర్శకుడి టాలెంట్ నేరుగా గమనిస్తేనే గురి కుదురుతుంది. నిర్మాత దిల్ రాజు.. అలా నేరుగా పరిశీలించకుండా, పనితీరును గమనించకుండా కొత్త వాళ్లకు అవకాశమివ్వడు అంటారు. ఈ విషయంలో ఆయన పరిచయం చేసిన ప్రతి కొత్త దర్శకుడి వెనుకా ఒక్కో కథ ఉంది. దిల్ రాజు బేనర్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అనదగ్గ ‘బొమ్మరిల్లు’ తీసిన భాస్కర్ కథేంటో తెలుసుకుందాం పదండి.

భాస్కర్ మీద దిల్ రాజుకు గురి కుదరడానికి కారణం ‘ఆర్య’ సినిమా షూటింగ్ సందర్భంగా అతను చూపించిన చొరవేనట. ‘ఆర్య’ షూటింగ్ కోసమని యూనిట్ సభ్యులందరినీ తీసుకుని కేరళ వెళ్లాడట రాజు. ఐతే షెడ్యూల్ చివరికి వచ్చేసరికి కొంచెం హడావుడి అయి.. ఒక్క రోజులో 46 షాట్లు తీయాల్సిన అవసరం వచ్చిందట. ఆ రోజు ఆ పనంతా పూర్తవకపోతే.. మొత్తం అందరికీ బుక్ చేసిన టికెట్లన్నీ వేస్టవుతాయి. దిల్ రాజు అప్పటికి ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ కాదు. అంత నష్టం అంటే ఆయనకు ఇబ్బందే. ఐతే ఒక్క రోజులో 46 షాట్లు పూర్తి చేయడం ఎలా అని టెన్షన్ పడుతుంటే.. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న భాస్కర్ వచ్చి ఆయన టెన్షన్ తగ్గించాడట. నేను, సుకుమార్ ముందు రోజు రాత్రే దీని గురించి డిస్కస్ చేసి.. ప్లాన్ చేశాం.. మీరు కంగారు పడకండి అని భరోసా ఇచ్చాడట. తర్వాత సుక్కు - భాస్కర్ కలిసి అన్నట్లుగానే ఒక్క రోజులో 46 షాట్లు పూర్తి చేసి ఆశ్చర్యపరిచారట. ఆ సందర్భంగా భాస్కర్ టాలెంట్, అతడి చురుకుదనం చూసి ఫ్లాటైపోయి.. నీ డైరెక్షన్ లో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘బొమ్మరిల్లు’ సినిమాకు బీజం పడింది.