Begin typing your search above and press return to search.

దిల్ రాజు మాస్టర్ ప్లాన్

By:  Tupaki Desk   |   5 Jan 2017 6:22 AM GMT
దిల్ రాజు మాస్టర్ ప్లాన్
X
ఓవైపు మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా.. మరోవైపు నందమూరి బాలకృష్ణ 100వ సినిమా సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఆ రెండు సినిమాల మీదా అంచనాలు మామూలుగా లేవు. అయినప్పటికీ దిల్ రాజు తన నిర్మాణంలో తెరకెక్కిన మీడియం రేంజి సినిమా ‘శతమానం భవతి’ని ధైర్యంగా సంక్రాంతి రేసులో నిలబెట్టేశాడు. తన సినిమా మీద ఆయనకున్న భరోసా అది. ఐతే ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ రిలీజ్ విషయంలో స్ట్రాటజిగ్గా లేకపోతే కష్టం. ఈ విషయంలో దిల్ రాజు పక్కా ప్రణాళికతో అడుగులేస్తున్నాడు. చిరు.. బాలయ్యల సినిమాల సాధ్యమైనంత ముందుగా విడుదలవుతాయని తెలిసే ఆయన జనవరి 14కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు.

తెలంగాణలో మెజారిటీ థియేటర్లు దిల్ రాజు చేతిలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అలాగని చిరు.. బాలయ్యల సినిమాలు వస్తుంటే అన్ని థియేటర్లనూ అట్టిపెట్టుకోలేడు. ఇక్కడే దిల్ రాజు ప్రత్యేకత కనిపిస్తుంది. ఉన్న థియేటర్లలో పరిమితంగానే థియేటర్లను తన సినిమా కోసం ఉంచుకున్నాడు కానీ.. అవన్నీ కూడా ప్రైమ్ థియేటర్లే. అటు ఏపీలో కూడా తనకున్న పరిచయాలతో మంచి థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నాడట. మరోవైపు అమెరికాలోనూ తన సినిమాను వ్యూహాత్మకంగా రిలీజ్ చేస్తున్నాడు రాజు. మామూలుగా కొత్త సినిమాలకు టికెట్ రేట్లు 20 డాలర్లకు తక్కువ ఉండవు. ‘శతమానం భవతి’కి కూడా ఈజీగా ఫస్ట్ వీకెండ్లో 20 డాలర్ల రేటు పెట్టేయొచ్చు. కానీ రాజు సినిమాకు అలా చేయట్లేదు. నిర్ణయం ఎవరిదో కానీ.. ఫస్ట్ వీకెండ్లోనే అక్కడ 12 డాలర్లకే సినిమాను అందిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలపై ఉన్న భారీ అంచనాల వల్ల వాటికి ఎలాగూ భారీ రేట్లు నిర్ణయిస్తారు. దీంతో బడ్జెట్లో సినిమాలు చూడాలనుకునేవాళ్లంతా తక్కువ రేటున్న ‘శతమానం భవతి’ వైపు చూస్తారు. పైగా ఈ చిత్రం యుఎస్ ఆడియన్స్ టేస్టుకు తగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం కలిసొచ్చే అంశం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/