Begin typing your search above and press return to search.

‘డీజే’ యావరేజ్ అని ఒప్పుకున్నట్లేగా..

By:  Tupaki Desk   |   18 Dec 2017 6:01 AM GMT
‘డీజే’ యావరేజ్ అని ఒప్పుకున్నట్లేగా..
X
ఇంతకుముందు దిల్ రాజు సినిమాలకు సంబంధించి వసూళ్ల విషయంలో ఎప్పుడూ వివాదం నెలకొన్నది లేదు. ఐతే తొలిసారిగా ‘దువ్వాడ జగన్నాథం’ విషయంలో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. ‘డీజే’ వసూళ్లు వంద కోట్లు దాటాయని.. ‘ఖైదీ నంబర్ 150’ కలెక్షన్లను కూడా ఈ సినిమా దాటేసిందని ఆయన అప్పట్లో చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. ఐతే దీనిపై ఆ తర్వాత ఆయన వివరణ ఇస్తూ చిరు అభిమానుల్ని ఊరడించే ప్రయత్నం చేశారు. ఐతే ఈ సినిమా గ్రాస్ వసూళ్ల సంగతలా ఉంచి.. షేర్ లెక్కలు తీస్తే మాత్రం చాలామంది బయ్యర్లు నష్టపోయిన మాట వాస్తవం. కానీ ‘డీజే’ బృందం మాత్రం ఆ విషయాన్ని అంగీకరించలేదు. ఈ సినిమా హిట్ అని.. బ్లాక్ బస్టర్ అని చెప్పుకుంది.

దీనిపై మీడియాలో.. సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో చాలా చర్చ జరిగింది. తర్వాత అందరూ ఈ విషయం మరిచిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు దిల్ రాజు మళ్లీ ఇప్పుడు ‘డీజే’ వసూళ్ల గురించి మాట్లాడాడు. ‘డీజే’ విషయంలో అప్పట్లో అనవసరంగా గొడవలు జరిగాయని.. అలా ఎందుకు జరిగిందో కానీ జరిగిపోయిందని ఆయన అన్నారు. ‘డీజే’ సినిమా తమ సంస్థకు అత్యధిక లాభాలు అందించిన మాట వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. కొన్ని ఏరియాల్లో బయ్యర్లు నష్టపోయారని.. ఐతే వాళ్లందరికీ ‘ఫిదా’ సినిమా ద్వారా నష్టం భర్తీ చేశామని.. ఆ సినిమాకు బయ్యర్లు తక్కువ డబ్బులు కట్టి ఎక్కువ లాభాలు అందుకున్నారని రాజు అన్నాడు. తనకు.. తన డిస్ట్రిబ్యూటర్లకు మధ్య బంధం ఒక సినిమాతో అయిపోయేది కాదని.. ఇదో పెద్ద సైకిల్ అని.. ఏడాది చివరికి వచ్చాక చూసుకుంటే తన డిస్ట్రిబ్యూటర్లందరూ మంచి లాభాలతో ఉంటారని రాజు చెప్పాడు. ఎలాగైతేనేం ‘డీజే’ తనకు లాభాలు.. బయ్యర్లకు నష్టాలు తెచ్చిపెట్టిందని రాజు చెప్పడం ద్వారా ఆ సినిమా యావరేజ్ అని పరోక్షంగా ఒప్పుకున్నట్లేగా?