Begin typing your search above and press return to search.

సాయిపల్లవి తప్ప ఆ పాత్రను ఎవరూ చేయలేరు!

By:  Tupaki Desk   |   19 Dec 2021 4:07 AM GMT
సాయిపల్లవి తప్ప ఆ పాత్రను ఎవరూ చేయలేరు!
X
దర్శకుడిగా రాహుల్ సాంకృత్యన్ మొదటి సినిమా అయిన 'టాక్సీవాలా'తోనే హిట్ కొట్టాడు. ఆ తరువాత సరైన కథ కోసం వెయిట్ చేసిన ఆయన, 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను రూపొందించాడు. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా కథానాయికలుగా సందడి చేయనున్నారు. ఈ నెల 24వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. దర్శకుడు రాహుల్ ఈ వేదికపై మాట్లాడుతూ .. " ఒక గొప్ప చిత్రం వెయ్యి కొత్త సినిమాలను తీసే శక్తిని ఇస్తుంది. థియేటర్ కి వచ్చి డబ్బు పెట్టి చూసే ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వొచ్చు. ఐదు సంవత్సరాలు కష్టపడి ఒక 'బాహుబలి'ని చూపించవచ్చు.

ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి తాపత్రయపడే ప్రతి ఫిల్మ్ మేకర్ కి నా జోహార్లు. అలాంటి మరో ప్రయత్నమే ఈ 'శ్యామ్ సింగ రాయ్'. ఈ సినిమా లైన్ తీసుకుని సత్యదేవ్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు .. నేను ఎందుకు ఎగ్జైట్ అయ్యానంటే కథ బెంగాలి వెళుతుంది. బెంగాలీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి కారకులు సినిమాటో గ్రాఫర్ సానూ గారు .. 'జెర్సీ'లో మీరు చూసే ఉంటారు .. ఆ సినిమాను విజువల్ గా ఆయన స్టోరీ టెల్లింగ్ చేశారు. అలాంటి ఒక కథను .. అలాంటి ఒక కలర్ తో ఈ సినిమాను కూడా ఆయన చెప్పారు. ఆయనతో వర్క్ చేసి నేను చాలా విషయాలను నేర్చుకున్నాను.

ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ చాలా వెరైటీ ఆల్బమ్ ఇచ్చాడు. ఈ సినిమాకి ముందుగా నేను అనుకున్నది ఏఆర్ రెహ్మాన్ గారిని .. ఆయన లభించకపోవడం వలన నెక్స్ట్ ఆప్షన్ గా మిక్కీని తీసుకున్నాను. ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ గారు ఈ సినిమా కోసం 'అంతర్ మహల్' అనే ఒక సెట్ వేశారు. ఆ సెట్ కి ఆయన ప్రాణం పోశారు .. అక్కడి నుంచి తిరిగిరావడానికి మాకు చాలా బాధ అనిపించింది. మేమందరం కష్టపడి చీమల్లా ఒక్కో రాయిని పేర్చి గుడి కట్టాము .. ఆ గుడిలోకి ఈ నెల 24వ తేదీన మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఆ గుడి కట్టే అవకాశం మాకు ఇచ్చినందుకు వెంకట్ బోయనపల్లిగారికి థ్యాంక్స్ చెబుతున్నాను.

ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో పాటలు రాయించుకోవడానికి మొదట్లో నాకు ధైర్యం సరిపోలేదు. ఆయన దగ్గరికి వెళ్లి పాట సందర్భం చెప్పి .. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థాయి నాకు లేదనే విషయం నాకు తెలుసు. ఒక రెండు షెడ్యూల్స్ పూర్తయిన తరువాత ఆయన దగ్గరికి వెళ్లే ధైర్యం వచ్చింది. ఆయన రాశారు .. అద్భుతంగా రాశారు .. ప్రాణం పెట్టి రాశారు. పాట రాయడానికి కొన్ని విజువల్స్ చూశారు. సాయిపల్లవి కళ్లు చూసి లైన్స్ రాశారు .. చెంపలు చూసి లైన్స్ రాశారు .. ఆమె నవ్వు చూసి లైన్స్ రాశారు. నాని గారి మీసం చూసి లైన్స్ రాశారు .. కాస్ట్యూమ్స్ చూసి లైన్స్ రాశారు.

మూడు గంటల చిత్రాన్ని మనసులో పెట్టుకుని 5 నిమిషాల పాట రాస్తారు .. అందుకే ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి అయ్యారు. ఆ మహానుభావుడు తన చివరి పాటను మాకు ఇచ్చి వెళ్లిపోయారు. శాస్త్రి గారు ఈ ఈవెంట్ కి వస్తానని అన్నారు .. కానీ ఆయన రాసిన పాట రూపంలో ఇక్కడే ఉన్నారు. నా జీవితంలో పిరికితనాన్ని పాతరేసిన గురువు ఆయన. ఆయన నాతో ఒక మాట చెప్పారు. 'ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని పాట రాసిన నాకు భయపడే హక్కు లేదు. 'శ్యామ్ సింగ రాయ్' వంటి క్యారెక్టర్ ను ప్రపంచానికి చెబుతున్న నీకు భయపడే అవసరం లేదు' గుర్తుపెట్టుకో అన్నారు. ఇలా మాట్లాడే ధైర్యం ఆయన వల్లనే వచ్చింది.

మడోన్నా చాలా స్వీట్ పర్సన్ .. తాను చాలా బాగా చేసింది. కొత్త మడోన్నాను చూస్తారు మీరు. కృతి శెట్టి చిన్న పిల్ల ఎలా చేస్తుందో అనుకున్నాను .. కానీ ఆమెను చూడగానే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ పాత్రను చేయడానికి ఆమె ఎంత కష్టపడిందో నాకు తెలుసు. సాయిపల్లవి విషయానికి వస్తే .. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర నాకు తెలిసి ఎవరూ చేయలేరు. ఆమె తప్ప నాకు మరో ఆప్షన్ కూడా లేదు. ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ నటీమణులలో సాయిపల్లవి ఒకరు. గుర్తుపెట్టుకోండి .. నెక్స్ట్ జనరేషన్స్ కి ఆమె లెజెండ్. ఈ సినిమాలో ఆమె చేసిన మేజిక్ ను మీరు ఈ నెల 24న థియేటర్లలో చూడండి" అని చెప్పుకొచ్చారు.