Begin typing your search above and press return to search.

ఇంతకీ భారతీరాజాకి ఏమైంది?!

By:  Tupaki Desk   |   28 Aug 2022 8:33 AM GMT
ఇంతకీ భారతీరాజాకి ఏమైంది?!
X
తమిళనాట బాలచందర్ తరువాత వినిపించే పేరు భారాతీరాజా. దర్శకుడిగా తన కెరియర్ ను ఆయన కమల్ .. రజనీ .. శ్రీదేవి కాంబినేషన్లో మొదలు పెట్టడం .. తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని నమోదు చేయటం విశేషం. అలా 1977లో దర్శకుడిగా మొదలైన ఆయన ప్రయాణం రెండు దశాబ్దాలకి పైగా కొనసాగుతూ వచ్చింది. భారతీరాజా కథ .. స్క్రీన్ ప్లేను తయారు చేసుకోవడంలో సిద్ధహస్తుడు. ముందుగా హీరోను అనుకుని ఆయన చుట్టూ కథ అల్లడమనేది భారతీరాజాకు అలవాటు లేదు. తన కథకు తగిన హీరోలను మాత్రమే ఆయన ఎంచుకునేవారు.

అప్పటి స్టార్స్ కూడా భారతీరాజా దర్శకత్వంలో చేయాలంటే భయపడేవారు. కానీ ఆయన దర్శకత్వంలో చేస్తే కెమెరా ముందు ఎలా ఉండాలో తెలుస్తుందని ఆయనతో కలిసి పనిచేయడానికి ఆరాటపడేవారు. కథాకథనాలు .. పాత్రలను మలిచే విధానం .. తెరపై సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించేతీరు భారతీరాజా ప్రత్యేకతగా నిలిచాయి. ఆ ప్రత్యేకతనే సుదీర్ఘకాలం పాటు ఆయనను అగ్రస్థానంలో కూర్చోబెట్టింది. తెలుగులో ఆయన చేసిన 'సీతాకోకచిలుక' .. 'ఎర్రగులాబీలు' .. చిరంజీవి 'ఆరాధన' సినిమాలను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు.

వయసు పై బడటం వలన కొంతకాలంగా ఆయన దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. అడపా దడపా ముఖ్యమైన అతిథి పాత్రలలో మెరుస్తున్నారు. అలాంటి ఆయన ఇటీవల అనారోగ్యానికి గురైనట్టుగా వార్తలు వచ్చాయి. శుక్రవారం రోజున మెరుగైన వైద్యం కోసం అంటూ హడావిడికి ఒక హాస్పిటల్ నుంచి 'పోరూరు'లోని శ్రీరామచంద్రన్ హాస్పిటల్ లో ఆయనను చేర్పించారు. ఆయనకి అత్యంత సన్నిహితుడైన వైరముత్తు మాట్లాడుతూ, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మీడియాతో చెప్పారు.

శనివారం రోజున భారతీరాజా పేరుతో ఒక ప్రకటన వచ్చింది. తాను బాగానే ఉన్నానవీ .. డాక్టర్లు తనని ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నందు వలన కోలుకున్నానని చెప్పారు. ఇతరులకు అనుమతిలేని కారణంగా తనని చూడటానికి ఎవరూ హాస్పిటల్ కి రావొద్దని కోరారు. తన అనారోగ్య విషయం తెలియగానే ఎంతోమంది తనకోసం ప్రార్ధనలు చేశారని విన్నాననీ, వాళ్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అయితే అసలు ఆయనకి ఏమైంది? ఏ రకమైన ఆరోగ్య సమస్యతో ఆయన బాధపడుతున్నారు? అనే విషయాన్ని కుటుంబ సభ్యులుగానీ, వైద్యులు గాని వెల్లడించలేదు. దాంతో భారతీరాజా అనారోగ్యానికి కారణమేమిటి? అనేది అభిమానుల మధ్య చర్చకు దారితీసింది.