Begin typing your search above and press return to search.

యాక్సిడెంట్ బాధితుడికి బాబీ క్ష‌మాప‌ణ‌లు!

By:  Tupaki Desk   |   26 May 2018 7:18 AM GMT
యాక్సిడెంట్ బాధితుడికి బాబీ క్ష‌మాప‌ణ‌లు!
X

యాక్సిడెంట్ వివాదంలో చిక్కుకున్న ప్ర‌ముఖ టాలీవుడ్‌ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ)కి ఊర‌ట ల‌భించే అవ‌కాశం క‌నిపిస్తోంది. తాజాగా, ఆ యాక్సిడెంట్ బాధితుడు హ‌ర్మీంద‌ర్ కు బాబీ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో ఈ వివాదం స‌ద్దుమ‌ణిగేలా క‌నిపిస్తోంది. నిన్న త‌న ఇంటికి వ‌చ్చిన‌ బాబీ....ఆ రోజు జ‌రిగిన దానికి తనకు క్షమాపణ చెప్పారని హర్మిందర్ త‌న ఫేస్‌ బుక్ ఖాతాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. దాంతోపాటు త‌న భవిష్యత్ బాగుండాలని త‌న‌ తల్లి దీవెనలు తీసుకొన్నార‌ని హ‌ర్మీంద‌ర్ పోస్ట్ చేశారు. ఈ వివాదంలో త‌న‌కు స‌హ‌క‌రించిన‌ మీడియా - సోషల్ మీడియా - స్నేహితులకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ విష‌యంలో న్యాయం జ‌రిగినందుకు చాలా సంతోషిస్తున్నానని హర్మిందర్ అన్నారు. హ‌ర్మింద‌ర్ కు బాబీ క్షమాపణ చెప్ప‌డంతో ఆయ‌న త‌న పిటిషన్ వాపసు తీసుకునే అవ‌కాశం ఉంది. దీంతో, ఈ కేసు నుంచి బాబీ బ‌య‌ట‌ప‌డేందుకు మార్గం సుగ‌మ‌మైంద‌ని తెలుస్తోంది. అయితే, హ‌ర్మీంద‌ర్ కేసు వాప‌సు తీసుకుంటున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు బాబీపై ఈ నెల 21న యాక్సిడెంట్ కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. 20వ తేదీ రాత్రి త‌మ కారును బాబీ ఢీకొట్టి వెళ్లిపోయాడ‌ని హైద‌రాబాద్ లోని అమీర్ పేట్ కు చెందిన హ‌ర్మీంద‌ర్ సింగ్ జుబ్లిహిల్స్ పోలీసు స్టేష‌న్ లో కేసు న‌మోదు చేశారు. ఆ స‌మ‌యంలో బాబీ మ‌ద్యం సేవించి ఉన్నార‌ని....యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుండ‌గానే అక్క‌డ నుంచి వెళ్లిపోయాడ‌ని ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని త‌న ఫేస్ బుక్ ఖాతాలో హ‌ర్మీంద‌ర్ సింగ్ పోస్ట్ చేశాడు. క‌నీసం బాబీ క్ష‌మాప‌ణ కూడా చెప్ప‌కుండా వెళ్లిపోయార‌ని ఆరోపించారు. ఆ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం రాత్రి జుబ్లిహిల్స్ పోలీసు స్టేష‌న్ లో బాబీ లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. తాజాగా, బాధితుడు హ‌ర్మింద‌ర్ కు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో ఆయ‌న ఈ కేసు వాప‌సు తీసుకునే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి.