Begin typing your search above and press return to search.

ఇంటర్వ్యూల పేరుతో దర్శకుడి చౌకబారు చర్యలు..!

By:  Tupaki Desk   |   28 July 2022 3:30 AM GMT
ఇంటర్వ్యూల పేరుతో దర్శకుడి చౌకబారు చర్యలు..!
X
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'కుచ్ కుచ్ హోతా హై' అనే హిందీ చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు కరణ్. ఓవైపు దర్శకుడిగా మరోవైపు నిర్మాతగా గత రెండు దశాబ్దాలుగా బాలీవుడ్ ని ఏలుతున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇప్పటికే అనేకమంది నెపోటిజమ్ కిడ్స్ ని లాంచ్ చేసిన కరణ్.. ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను బాలీవుడ్ కు పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు.

ఇకపోతే కరణ్ జోహార్ హోస్ట్ గానూ ప్రత్యేకతను చాటుకున్న సంగతి తెలిసిందే. ''కాఫీ విత్ కరణ్'' అనే సెలబ్రిటీ టాక్ షోని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులను కరణ్ కాస్త ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతుంటాడు. వ్యక్తిగత జీవితంతో పాటుగా సెక్స్ - ఎఫైర్స్ వంటి అభ్యంతరకరమైన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు.

మొదటి సీజన్ నుంచీ కరణ్ అదే రీతిలో షోను నడిపిస్తున్నాడు. ఈ షోలో పాల్గొనే గతంలో పలువురు ప్రముఖులు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆరు సీజన్లని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో.. ఇప్పుడు 7వ సీజన్ లో అడుగుపెట్టింది. కాకపోతే ఈసారి ఓటీటీ వేదికగా ప్రసారం అవుతోంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'కాఫీ విత్ కరణ్ - 7' షోకి మంచి వ్యూయర్ షిప్ వస్తోంది. సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదొక విధంగా ఈ షో ట్రెండింగ్ టాపిక్ గా ఉంటోంది. ఫస్ట్ ఎపిసోడ్ కు బాలీవుడ్ స్టార్స్ అలియా భట్ మరియు రణవీర్ సింగ్ గెస్టులుగా హాజరవ్వగా.. రెండో ఎపిసోడ్ లో అక్షయ్ కుమార్ & సమంత రూత్ ప్రభు కలిసి సందడి చేశారు.

మూడో ఎపిసోడ్ కు 'లైగర్' హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే హాజరయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో విజయ్ ను ఉద్దేశిస్తూ చివరిసారిగా ఎప్పుడు సెక్స్ చేసావు.. అతను *త్రీ సమ్) ముగ్గురిని ఇష్టపడుతున్నాడా? మీకు చీజ్ అంటే నిజంగా ఇష్టమా? అంటూ కొన్ని అసభ్యకరమైన డబుల్ మీనింగ్ ప్రశ్నలను కరణ్ అడిగినట్లు తెలుస్తోంది.

నార్త్ ఆడియన్స్ ఇది ఉత్తేజకరమైనదిగా భావించినప్పటికీ.. సౌత్ జనాలు మాత్రం ఈ ప్రశ్నలు కరణ్ జోహార్ చౌకబారుతనాన్ని తెలియజేస్తున్నాయని విమర్శిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ ను ఇలాంటి ప్రశ్నలు అడగడం అతనికి సాధారణమయ్యుండొచ్చు కానీ.. దక్షిణాది సెలబ్రిటీలు భిన్నంగా ఉంటారు కాబట్టి వారితో కాస్త మెరుగ్గా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి కరణ్ జోహార్ గత సీజన్లలో రాజమౌళి - ప్రభాస్ మరియు రానా దగ్గుబాటి వంటి సౌత్ సెలబ్రిటీలతో చాలా డీసెంట్ గా మాట్లాడాడు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం ఓపెన్ గా అలాంటి ప్రైవేట్ ప్రశ్నలు అడగడం హాట్ టాపిక్ అయింది. ఇది ప్రముఖ ఓటీటీ వేదికపై VD కి అసౌకర్యం కలిగిస్తుందని.. ఇబ్బంది కలిగించేలా ఉంటుందని రౌడీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి చవకబారు ప్రశ్నలతో కరణ్ తమ అభిమాన హీరోని అంతగా ఇబ్బంది పెట్టడాన్ని వీడీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు కరణ్ ఇదంతా విజయ్ దేవరకొండ కు బాలీవుడ్ లో క్రేజ్ తీసుకొచ్చే ప్లాన్ లో భాగంగానే చేస్తున్నాడనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

జాన్వీ కపూర్ - సారా అలీఖాన్ పాల్గొన్న ఎపిసోడ్ లో విజయ్ గురించి ప్రస్తావన వచ్చేలా చేయడం.. అతనితో బాలీవుడ్ భామలు డేటింగ్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేయడం వంటివి.. 'లైగర్' స్టార్ ని హిందీలో పాపులర్ చేయడం కోసమే చేశారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ - అనన్య పాండే జంటగా నటించిన 'లైగర్' సినిమా రిలీజ్ రెడీ అయింది. ఆగస్ట్ 25న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. కరణ్ జోహార్ - పూరీ - ఛార్మీ కౌర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్ కు కూడా కలిసొస్తుందని.. ఇప్పుడు కరణ్ తన టాక్ షోకి వీడీ ని తీసుకొచ్చినట్లు టాక్ ఉంది. కాకపోతే ఇంటర్వ్యూల పేరుతో దర్శకుడు ఇలాంటి చౌకబారు ప్రశ్నలు అడగడమే దక్షిణాది ప్రేక్షకులకు నచ్చడం లేదని తెలుస్తోంది.