Begin typing your search above and press return to search.

'జోంబీ రెడ్డి' టైటిల్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్...!

By:  Tupaki Desk   |   13 Aug 2020 7:15 AM GMT
జోంబీ రెడ్డి టైటిల్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్...!
X
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'అ!' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. న్యూ కాన్సెప్ట్‌ తో తీసిన ఫస్ట్ సినిమా 'అ!' విమర్శకుల మెప్పు పొందడమే కాకుండా ప్రేక్షకులను కూడా అలరించింది. ఈ క్రమంలో రాజశేఖర్‌ తో తీసిన 'కల్కి' ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు మూడో సినిమాని రెడీ చేసే పనిలో ఉన్నాడు. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని వణికిస్తున్న వైరస్ నేపథ్యంలో మరో వైవిధ్యమైన కథాంశంతో మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. ఇటీవలే ఈ సినిమాకి ''జోంబీ రెడ్డి'' విభిన్న త‌ర‌హా టైటిల్ ప్ర‌క‌టించారు. ఇది తెలుగులో రూపొందుతున్న ఫస్ట్ జోంబీ సినిమా అని చెప్తూ త‌న‌దైన స్టైల్‌ తో ప్ర‌శాంత్‌ ఆ టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకి ఓ సామాజిక వర్గానికి చెందిన పేరుని టైటిల్ లో వాడటంపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వైరస్ కి 'రెడ్డి'కి ఏమి సంబంధం ఉందని 'జోంబీ రెడ్డి' అనే టైటిల్ పెట్టారని ప్రశ్నించారు. అయితే 'జోంబీ రెడ్డి' టైటిల్‌ ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారంటూ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ స్వయంగా వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ''ఇటీవ‌ల నా థర్డ్ ఫిలిం టైటిల్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ట్విట్ట‌ర్‌ లో నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయ్యింది. టైటిల్ చాలా బాగుందంటూ చాలా కాల్స్‌ మెసేజ్‌స్ వ‌చ్చాయి. సినిమాకు అది యాప్ట్ టైటిల్‌. యానిమేష‌న్ కి మంచి పేరొచ్చింది. మూడు నెల‌ల‌కు పైగా టీమ్ ప‌డిన క‌ష్టానికి వ‌చ్చిన రిజ‌ల్ట్‌ తో మేమంతా హ్యాపీగా ఉన్నాం. అయితే కొంత‌మంది మాత్రం టైటిల్‌ ను త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నారు'' అని చెప్పుకొచ్చారు. ''సినిమాలో ఎవ‌రినీ త‌క్కువ చేసి చూపించ‌డం.. ప్ర‌త్యేకించి ఒక క‌మ్యూనిటీని త‌క్కువ చేసి చూపించ‌డం ఉండ‌దు. ఇదొక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్‌. ప్ర‌స్తుతం మ‌నం చూస్తున్న క‌రోనా పరిస్థితుల చుట్టూ జరిగే కథ. నా ప్రీవియస్ ఫిలిం ఎలాగైతే తెలంగాణాలో సెటప్ అయిందో ఈ మూవీ రాయలసీమలోని క‌ర్నూలు ప్లేస్ లో కథ జరుగుతుంది. హాలీవుడ్‌ లో ఈ టైపు ఎపిడెమిక్ ఫిలిమ్స్ చూస్తుంటాం. అక్క‌డ న్యూయార్క్ లాంటి సిటీస్ లో ఆ క‌థ జ‌రిగిన‌ట్లు చూపిస్తుంటారు. నేను ఇక్కడ క‌ర్నూలును నేపథ్యాన్ని ఎంచుకున్నాను'' అని ప్రశాంత్ పేర్కొన్నాడు. అంతేకాకుండా ''క‌ర్నూలులో ఇలాంటి ఎపిడెమిక్ జరిగితే.. అక్క‌డి ప్ర‌జ‌లు ఎలా ఫైట్ చేసి దానిని ఆపి ప్ర‌పంచాన్నంతా ఎలా కాపాడ‌తార‌న్న‌ది ఇందులోని మెయిన్ ఐడియా. సినిమా చూస్తే క‌ర్నూలును క‌థ ఎంత హైలైట్ చేస్తుందో తెలుస్తుంది. ద‌య‌చేసి ఈ టైటిల్‌ ను ఎవరూ త‌ప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏ కమ్యూనిటీని త‌క్కువ‌ చేసి చూపించ‌డం అనేది క‌చ్చితంగా ఈ సినిమాలో ఉండ‌దు. సినిమా చూసిన తర్వాత మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. నా ఫ‌స్ట్ సినిమాకి నేషనల్ వైడ్ గుర్తింపు ఎలా వచ్చిందో.. ఈ సినిమాకు అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను. అప్పుడు మీరందరూ గర్వంగా ఫీల్ అవుతారు. నన్ను నమ్మండి" అని ప్రశాంత్ వర్మ తెలిపారు.