Begin typing your search above and press return to search.

'భారతీయుడు' ఫంక్షన్ కి వెళితే బయటే ఆపేశారు!

By:  Tupaki Desk   |   31 May 2022 4:58 PM GMT
భారతీయుడు ఫంక్షన్ కి వెళితే బయటే ఆపేశారు!
X
కమలహాసన్ కథానాయకుడిగా 'విక్రమ్' సినిమా రూపొందింది. కమల్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ .. నరేన్ ముఖ్యమైన పాత్రలలో నటించగా, ఒక ప్రత్యేకమైన పాత్రలో సూర్య కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా కమల్ లుక్ .. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు అందరిలో ఉత్కంఠను పెంచుతోంది.

ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ రిలీజ్ చేస్తున్నాడు. తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ - శిల్పకళా వేదికలో నిర్వహించారు. వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. "కమల్ హాసన్ గురించి చెప్పాలంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావడం లేదు. 'ఆకలి రాజ్యం' గురించి చెప్పాలా? 'సాగరసంగమం' గురించి చెప్పాలా? ఒక 'భారతీయుడు' .. ఒక 'స్వాతి ముత్యం' గురించి చెప్పాలా? ఆయన గురించి చెప్పడానికి భాష సరిపోదు. ఇండియన్స్ అంతా కూడా మాకు కమల్ ఉన్నారు అని గర్వంగా చెప్పుకుంటారు.

కమల్ గారు వెస్ట్ లో పుట్టి ఉంటే ఇప్పుడు వచ్చిన క్రేజ్ కి ఇంకా వందరెట్లు వచ్చి ఉండేదేమోనని అనిపిస్తోంది. అక్కడ పుట్టకపోవడం మీ దురదృష్టం .. ఇక్కడ పుట్టడం ఇండియా చేసుకున్న అదృష్టం. నేను 'గబ్బర్ సింగ్' సినిమా చేసేటప్పుడు షూటింగులో ఎప్పుడూ కూడా శ్రుతి హాసన్ గారిని కమల్ హాసన్ గారిని గురించే అడుగుతూ ఉండేవాడిని. ఆయన అలవాట్లు .. అభిరుచులు ఎలా ఉంటాయి? అని అడుగుతూ ఉండేవాడిని. కమల్ గారు ఎన్ని సినిమాల్లో ఉన్నారనే విషయం పక్కన పెడితే, ప్రతి తెలుగువారి గుండెల్లో ఆయన ఉన్నారు. సినిమాలు చూడాలనే ఒక ఇంట్రెస్ట్ నాకు 'సాగర సంగమం'తో కలిగితే, సినిమాలు చేయాలనే ఆలోచన రావడానికి కారణం 'భారతీయుడు'.

'భారతీయుడు' ఆడీయో ఫంక్షన్ కి నేను వచ్చాను గానీ ... గేటు బయటే ఆపేశారు. అలాంటిది ఈ రోజు మీ ఎదురుగా స్టేజ్ పై మాట్లాడేవరకూ వచ్చాను. ఈ జర్నీకి కారణం కమల్ గారే. 'ఆకలి రాజ్యం' సినిమాలో ఎలాగో అలా బ్రతకాలంటే ఎలాగైనా బ్రతకొచ్చు .. కానీ ఇలాగే బ్రతకాలంటే .. ఇలాగే బ్రతకాలని అనుకున్నాను కాబట్టి ..ఇలా బ్రతుకుతున్నానని ఒక డైలాగ్ ఉంటుంది. కమల్ గారు ఎలా బ్రతకాలనుకున్నారో అలాగే బ్రతుకుతున్నారు .. ఆయన ఇలా ఉన్నంత కాలం ఇలాగే ఉంటారు. ఆయన మా అందరికీ ఆదర్శం .. ఆయన మా అందరికీ స్ఫూర్తి .. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను " అంటూ చెప్పుకొచ్చాడు.