Begin typing your search above and press return to search.

క్రిష్ క్రెడిబిలిటీ ఏం కావాలి?

By:  Tupaki Desk   |   14 Sep 2018 9:05 AM GMT
క్రిష్ క్రెడిబిలిటీ ఏం కావాలి?
X
నందమూరి తారక రామారావు జీవిత కథతో సినిమా అనగానే ఇందులో.. ఎన్టీఆర్ అల్లుడే ఆయనకు వెన్ను పోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకుని మానసిక వ్యధికు గురి చేసిన ఉదంతాన్ని చూపిస్తారా లేదా అన్న చర్చ మొదలైంది. ఐతే చంద్రబాబుతో వియ్యం కలుపుకుని తెలుగు దేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్న బాలయ్య అంతటి సాహసం చేస్తాడని ఎవ్వరూ భావించట్లేదు. చంద్రబాబులోని ఈ నెగెటివ్ కోణాన్ని చూపించనపుడు.. అంతకముందు వ్యవహరాల్ని కూడా చూపించడం సమంజసం కాదు. అసలు ఈ చిత్రంలో చంద్రబాబు పాత్రే లేకుంటే బావుంటుందని.. ఒక వేళ ఉన్నా కూడా ఊరికే ఇలా మెరిసి అలా మాయమైతే సరిపోతుందని.. ఆ పాత్రను ఎస్టాబ్లిష్ చేయకుండా వదిలేస్తే సమతూకం పాటించినట్లు ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

చంద్రబాబు పాత్రపై చర్చ జరగకుండా ఉండాలంటే అదే శ్రేయస్కరం కూడా. కానీ చిత్ర బృందానికి అలాంటి ఉద్దేశమేదీ ఉన్నట్లు లేదు. రానా దగ్గుబాటిని చంద్రబాబు పాత్రకు ఎంచుకోవడం.. అతడితో కీలక సన్నివేశాలు చిత్రీకరించి.. పోస్టర్లు కూడా వదలడం చూస్తుంటే.. సినిమాలో ఈ పాత్ర కీలకంగానే ఉండేట్లుంది. దీన్ని బట్టి చూస్తే వెన్ను పోటు వ్యవహారాన్ని దాచేసి.. కేవలం చంద్రబాబును ఎన్టీఆర్ తన అల్లుడిగా చేసుకోవడం.. తెలుగుదేశం పార్టీలో బాబు కీలకంగా మారడం.. ఇలా పాజిటివ్ కోణాల్ని మాత్రమే చూపించి బాబును చాలా పాజిటివ్‌ గా ప్రొజెక్ట్ చేసేలా కనిపిస్తోంది. ఐతే అసలు వాస్తవం ఏంటన్నది జనాలందరికీ తెలిశాక బాబును సినిమాలో ఇలా చూపిస్తే వాళ్ల ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పేదేముంది?

అయినా బాలయ్య బాబుకు బావ కాబట్టి సినిమాలో ఆయన పాత్ర పాజిటివ్ గా ఉండాలని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడ దర్శకుడిగా క్రిష్ క్రెడిబిలిటీ ఎంత దెబ్బ తింటుందన్నది కూడా కీలకమే. క్రిష్ తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్నవాడు. అతడి చేతికి ‘ఎన్టీఆర్’ పగ్గాలు అందాక సినిమా కొంచెం న్యూట్రల్ గా ఉంటుందని.. మరీ ఏకపక్షంగా చూపించరని జనాలు ఆశించారు. కానీ వ్యవహారం చూస్తుంటే బాలయ్య చేతిలో క్రిష్ కీలుబొమ్మ అయిపోయాడేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. వాస్తవాల్ని దాచేసి కేవలం భజన మాత్రమే ఉండేట్లయితే క్రిష్ లాంటి విలక్షణ దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంలో అర్థం లేదు కదా?