Begin typing your search above and press return to search.

‘బాహుబలి’పై కృష్ణవంశీ ఏమన్నాడంటే..

By:  Tupaki Desk   |   9 May 2017 9:07 AM GMT
‘బాహుబలి’పై కృష్ణవంశీ ఏమన్నాడంటే..
X
తెలుగులో స్టార్ హీరోల వెంట పడకుండా తనదైన శైలిలో సినిమాలు చేసి.. దర్శకుడికి ఒక ప్రత్యేకమైన గౌరవం తెచ్చిన వాళ్లలో కృష్ణవంశీ ఒకడు. కేవలం ఆయన పేరు చూసి ఎంతోమంది థియేటర్లకు వెళ్తారు. గత కొన్నేళ్లలో కృష్ణవంశీ ట్రాక్ రికార్డు ఏమంత బాగా లేకున్నా.. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో ఆయన మీద గౌరవం పోలేదు. ఆయన మాటలకు కూడా అందరూ ఎంతో విలువ ఇస్తారు. అలాంటి దర్శకుడు ‘బాహుబలి’ గురించి మాట్లాడితే ఆసక్తి రేకెత్తడం ఖాయం. తన కొత్త సినిమా ‘నక్షత్రం’ ప్రమోషన్లలో భాగంగా కృష్ణవంశీ ‘బాహుబలి’పై స్పందించాడు. ఆయనేమన్నారంటే..
‘‘ఏ సినిమా అయినా సరే.. దానికి సంబంధించిన క్రెడిట్ అంతా ప్రధానంగా దర్శకుడికే చెందుతుంది. సినిమా అంటేనే దర్శకుడిది. ఆ విషయాన్నే ఇప్పుడు రాజమౌళి మరోసారి రుజువు చేశాడు. ఐతే దర్శకుడు తన ఆలోచనల్ని తెరమీదికి తేవడానికి స్టార్లు.. ఆర్టిస్టులు.. టెక్నీషియన్లు కావాలి. బడ్జెట్ అనేది సినిమాకు ఎప్పుడూ అడ్డంకి కాకూడదు. అది సినిమా భవితవ్యాన్ని నిర్దేశించకూడదు. బడ్జెట్ గురించే ఆందోళన చెందితే మనం గర్వించే ‘బాహుబలి’ సినిమా వచ్చేది కాదు. నా సినిమా విషయానికి వస్తే.. నాకు ఏది అవసరమో అది నిర్మాతల్ని అడుగుతాను. మిగతాదంతా నేను చూసుకుంటాను. నేను ఏదో సాధించాలని.. ఏదో పేరు రావాలని ఎప్పుడూ సినిమాలు చేయను. నేను నమ్మిన ఐడియాల్ని తెరమీదికి తీసుకురావాలనుకుంటాను’’ అని కృష్ణవంశీ అన్నాడు.