Begin typing your search above and press return to search.

కొత్త గోపీచంద్ ను చూడబోతున్నారు

By:  Tupaki Desk   |   7 Nov 2021 3:30 AM GMT
కొత్త గోపీచంద్ ను చూడబోతున్నారు
X
ఒక కథలో ఎక్కడెక్కడ ఏయే అంశాలు సర్దేస్తే అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది మారుతికి బాగా తెలుసు. ఇక సినిమా నుంచి యూత్ ఏం కోరుకుంటుంది? మాస్ ఆడియన్స్ ఏం ఆశిస్తారు? ఫ్యామిలీ ఆడియన్స్ వేటి కోసం చూస్తారు? అనే విషయంపై మారుతికి పూర్తి అవగాహన ఉంది. దర్శకుడిగా తన ఇమేజే కి తగినట్టుగా పెద్ద సినిమాను ప్లాన్ చేసుకున్న ఆయన, కరోనా వలన వచ్చిన గ్యాప్ ను కూడా వదులుకోకుండా, 'మంచిరోజులు వచ్చాయి' తీశాడు.

సంతోష్ శోభన్ - మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమా, దీపావళి సందర్బంగా ఈ నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ ఈ సినిమా టీమ్, వైజాగ్ లో నిన్న సాయంత్రం 'థ్యాంక్యూ మీట్' ను ఏర్పాటు చేసింది. ఈ వేదికపై దర్శకుడు మారుతి మాట్లాడుతూ .. " చాలా హ్యాపీగా .. ఆహ్లాదంగా .. చల్లటి సాయంత్రం చాలా బాగుంది.

నిజంగా 'మంచి రోజులు వచ్చాయి' సినిమా ఫంక్షన్ వైజాగ్ లో ఇలా జరుపుకుంటామని అనుకోలేదు. 'మహానుభావుడు' ఫంక్షన్ ను కూడా ఇలాగే బీచ్ లో చేసుకున్నాము .. మళ్లీ ఇప్పుడే రావడం. అసలు ఈ సినిమాను చేయాలని నేను అనుకోలేదు. 'పక్కా కమర్షియల్' షూటింగు మొదలుపెట్టేసి 40 రోజులు అయిన తరువాత కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. షూటింగు ఒక ఫ్లోలో వెళుతూ ఉండగా ఈ గ్యాప్ ఏంటా అని అనుకున్నాను. ఆ సమయంలో కరోనా గురించి అంతా భయపడుతూ ఉంటుంటే, ఆ భయం పై ఒక కాన్సెప్ట్ అనుకున్నాను.

అలా ఆ కాన్సెప్ట్ పట్టుకుని వెళ్లి ఒక 27 రోజులలో చేసిన సినిమా ఇది. ఏ రోజుకు ఆ రోజున ఎవరికి వీలుగా ఉంటే వాళ్లను రమ్మని చెప్పి చేసిన సినిమా ఇది. ఒకటే లొకేషన్లో చేసిన సినిమా ఇది. కొంతమంది ఆర్టిస్టులకు .. టెక్నీషియన్లకు ఉంపయోగపడుతుందని చేసిన సినిమా ఇది. ఆ రోజున అలా తీసుకున్న ఆ నిర్ణయం నిజంగా చాలా మంది ఆర్టిస్టులను పుట్టించింది. చాలామంది టెక్నీషియన్లకు ఉపయోగపడింది. నేను సక్సెస్ ను సాధించాలనే ఉద్దేశంతో చేసిన సినిమా కాదు ఇది. ఒక మంచి ఉద్దేశంతో మొదలైన రోజునే ఈ సినిమా సక్సెస్ అయిపోయింది.

ఇప్పుడు మీరంతా చూపిస్తున్న అభిమానం బోనస్ లా అనిపిస్తూ .. మంచి ఎనర్జీని ఇస్తోంది. ఈ రోజున విజయనగరం .. శ్రీకాకుళం థియేటర్లకు వెళ్లాము. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఆశించిన దానికంటే ఫన్ కాస్త తగ్గినా, కొంత సీరియస్ గానే చెప్పవలసిన పాయింట్ ఇది. నెక్స్ట్ 'పక్కా కమర్షియల్' కి దీనికంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్ మెంట్ ను అందిస్తాను .. అందులో డౌటేలేదు. ఈ సినిమాను ఇంతబాగా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్.

ఈ తరహా కాన్సెప్ట్ సినిమాలను ఆదరిస్తే మిగతా దర్శకులంతా కూడా, ఏ మాత్రం ఖాళీ దొరికినా ఇలాంటి సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతారు. 'పక్కా కమర్షియల్' తో త్వరలో మీ ముందుకు రాబోతున్నాను. గోపీచంద్ గారిని చాలా కొత్తగా చూడబోతున్నారు. సోమవారం రోజున ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయబోతున్నాము" అని చెప్పుకొచ్చాడు.